Wednesday, November 20, 2024

నేటి సంపాదకీయం.. హిజాబ్ సంధించిన ప్ర‌శ్న‌లు

కర్నాటకలో రాజుకున్న హిజాబ్‌ వివాదం అనేక ప్రశ్నలను జాతి జనుల ముందు ఉంచింది. ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతానికి ఈ వివాదం సద్దుమణిగినా… అది సృష్టించిన అనేకానేక ధర్మసందేహాలకు న్యాయ స్థానమే పరిష్కారం చెప్పాల్సి ఉంటుంది. తీర్పు వచ్చే వరకు విద్యార్థులెవరూ.. విద్యా సంస్థల ప్రాంగణాలలో హిజాబ్‌, కాషాయ కండువాల వంటి ధార్మిక దుస్తులు ధరించవద్దని చీఫ్‌ జస్టిస్‌ రితూ రాజ్‌ అవస్థి సారథ్యంలోని హైకోర్టు ఫుల్‌బెంచ్‌ స్పష్టం చేసింది. తరగతులు పునరుద్ధరించాలని చెబుతూనే… ఈ పరిణామాలు కలవరం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. పౌరులందరికీ మత స్వేచ్ఛ ఉన్నా… దానికీ కొన్ని పరిమితులను రాజ్యాంగం నిర్దేశించిందన్న విషయాన్ని విస్మరించరాదని సున్నితంగా చెప్పింది. నిజానికి ఈ వివాదం చాలా సంక్లిష్టమైనది. అన్నిటికన్నా మతపరంగా చాలా సున్నితమైనది. ఉడిపిలోని ప్రి యూనివర్సిటీ పాఠశాలలో హిజాబ్‌ ధరించి వచ్చిన ముస్లిం అమ్మాయిలను తరగతి గదులలోకి అనుమతించకపోవడంతో మొదలైన వివాదం చినికిచినికి గాలివానగా మారింది. హిజాబ్‌కు పోటీగా కొంతమంది కాషాయకండువాలు కప్పుకొని రావడంతో మొత్తం వివాదం హింసాత్మకంగా మారింది. హిజాబ్‌ ధరించి స్కూల్‌కు వెళ్లడం తన ప్రాథమిక హక్కు అంటూ ముస్లిం అమ్మాయి కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు జోక్యం చేసు కోవలసి వచ్చింది.

ఈ వివాదం కొన్ని మౌలిక ప్రశ్నలు వేస్తున్నది. ధార్మిక దుస్తుల ప్రమేయం లేని యూని ఫారమ్‌ను తన విద్యార్థులకు నిర్దేశించే అధికారం విద్యా సంస్థల యాజమాన్యా లకు లేదా? సిక్కులు తలపాగా ధరించి తరగతులకు రావడానికి అనుమతిస్తున్నప్పుడు ముస్లిం యువతులు హిజాబ్‌ ధరించి వస్తే తప్పేమిటి? వాస్తవానికి రాష్ట్రంలోని విద్యాలయాలలో యూని ఫారమ్‌ తప్పనిసరి చేస్తూ 2013లోనే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఫిబ్రవరి 5వ తేదీన హిజాబ్‌ యూనిఫారమ్‌లో భాగం కాదని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులనే ఆయా పాఠశాలలు అమలు జరుపుతున్నాయి. అయితే… ఇలాంటి ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయడం చట్టబద్ధమేనా అన్నది కోర్టులు తేల్చాల్సి ఉంది. కర్నాటక విద్యాచట్టం 1983లోని 133(2) సెక్షన్‌ కింద ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వ చెప్పుకుంటున్నది. ఈ ఉత్తర్వులను సమర్ధిం చుకుంటూ… పబ్లిక్‌ ఆర్డర్‌ కోసమే కళాశాలల యాజమాన్యాలు ఈ నిషేధాన్ని అమలు జరుపుతున్నాయని ప్రభుత్వం వాదిస్తున్నది. మరి హిజాబ్‌ ధరించడం ఏ రకంగా పబ్లిక్‌ ఆర్డర్‌కు భంగం కరమో హైకోర్టే నిగ్గు తేల్చాల్సి ఉంటుంది. పైగా హిజాబ్‌ మతంలో భాగం కాదంటూ కేరళ, బొంబాయి హైకోర్టులు గతంలో ఇచ్చిన తీర్పులను కర్నాటక ప్రభుత్వం న్యాయస్థానం ముందు ఉంచింది. ఇప్పుడు ఈ హిజాబ్‌ ధారణ అనేది ఇస్లాం సంప్రదాయంలో భాగమేనా కాదా అనేది కూడా కర్నాటక హైకోర్టు తేల్చాల్సి ఉంటుంది. ఈ వివాదంలో రెండు ప్రాథమిక హక్కుల మధ్య ఘర్షణ కనిపిస్తున్నది.

పేద, ధనిక, కుల, మత తారతమ్యాలకు తావులేని విధంగా విద్యార్థులలో సమభావం పెంచడం కోసమే యూనిఫారమ్‌ను విద్యా సంస్థలు నిర్దేశిస్తాయి. విద్యా సంస్థలకు ఇలా యూనిఫా రమ్‌ను నిర్దేశించే అధికారం ఉందా లేదా? అనేది కీలకమైన ప్రశ్న. అదే సమయంలో యూనిఫారమ్‌తో పాటు తన మతాను సారం హిజాబ్‌ను ధరించే ప్రాథమిక హక్కు ముస్లిం యువతికి ఉందా లేదా అన్నది మరో ప్రశ్న. ఇలాంటి సమయంలోనే వ్యక్తిగత ప్రయోజనాల కన్నా… సామాజిక ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ‘దేశం, మతం ఈ రెండింటిలో ఏది సర్వోన్నతమైనది? కొందరు హిజాబ్‌ కావాలంటు న్నారు. ఇంకొందరు టోపీ ఉండాలంటున్నారు. మరికొందరు ఇంకేవో అడుగుతున్నారు. ఇది సమైక్య దేశమా? లేక మతం, ఇతర ప్రాతిపదికలతో చీలి పోయిందా? ఇది నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తోంది’ అన్న మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ఎం ఎన్‌ భండారీ వ్యాఖ్యలు ఇక్కడ ప్రస్తావ నార్హం. ఆయన ఆవేదనను అంతా అర్థం చేసుకోవాలి. ఈ కేసులో కర్నాటక హైకోర్టు ఏం తేల్చుతుందో చూద్దామన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ సూచనను అంతా మన్నించాలి. ఈ వివాదంపై రభస చేసి… సమాజంలో చీలిక తేవడానికి ప్రయత్నించడం క్షంతవ్యం కాదు. ఈ విషయంలో ఇరు పక్షాలు దేశ హితం కోసం సంయమనం పాటించాలి. ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా అవతరించే దిశగా దూసుకెళ్తున్న వేళ ఇలాంటి మతవిద్వేషాలు మాయనిమచ్చగా మిగిలిపోతాయి. రాజ్యాంగం నిర్దేశించిన సెక్యులర్‌ భావనకు ప్రమాదం వాటిల్లకుండా చూసుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement