పేదరికం స్థితి నుంచి భారత్ క్రమంగా బయటపడుతోందనీ, దేశ జనాభాలో 0.8 శాతం మంది కడునిరు పేద స్థితిలో ఉన్నారని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎం ఎఫ్) అధ్యయన పత్రం వెల్లడించింది. దేశం నుంచి ఎగుమతులు నాలుగువందల బిలియన్ డాలర్లు దాటాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్రమంత్రి పియూష్ గోయెల్ వెల్లడించారు. గోయెల్ అయితే కొత్తగా విడుదలైన సినిమా కలెక్షన్లతో మన ఎగుమతులు పోటీ పడుతున్నాయంటూ వ్యాఖ్యానించి జనాన్ని సంతోషపర్చేందుకు ప్రయత్నించారు. పేదరికాన్ని నిర్వచించడానికి కొలమానం ఏమిటి? పూర్వపు కేంద్ర ప్రణాళికా సంఘం దీనికి అందజేసిన ప్రమాణాలను ప్రభుత్వం తుంగలోకి తొక్కింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేందుకు ప్రణాళికా సంఘం చేసిన సిఫార్సులన్నీ పేదరికం ప్రాతి పదికగానే చేయడం జరిగింది. అయితే, మోడీ ప్రభుత్వం ఈ ప్రమాణాలను పక్కన పెట్టింది. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు బయలుదేరాయి. ఐఎంఎఫ్ అధ్యయన పత్రంలో పేదరికం తిరోగమన దిశలో ఉందంటూనే భారత్‌లో భాగ్యవంతులూ, నిరుపేదల మధ్య అంతరం పెరిగిందని పేర్కొంది. ఇదిపరస్పర విరుద్ధంగానే కనిపిస్తోంది. అయితే, ఒక పూటకు కూడా తిండిలేక మాడుతున్న జనాన్ని దృష్టిలో ఉంచుకునే కడుపేదలని పేర్కొనడం జరుగుతోంది. కరోనా వచ్చిన తర్వాత వృత్తి వ్యాపారాలు పూర్తిగా పడిపోయినా, ప్రభుత్వం ఉచిత రేషన్‌ని అందజేస్తోంది. ఈ రేషన్‌ను మరోఆరు మాసాల పాటు కొనసాగించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. దానిని దృష్టిలో ఉంచుకుని పేదరికం తగ్గుతోందని ఐఎంఎఫ్ పేర్కొని ఉండవచ్చు.
అయితే, బియ్యం, ఆహార ధాన్యాలు మాత్రమే కాదు. ఇతర నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగాయి. వీటిని అదుపు చేయనిదే కేవలం బియ్యాన్నీ, ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం పదే పదే ప్రకటనలు చేయడం ఆత్మస్తుతిగానే ఉంది. ఇంధనం లేనిదే ఏ కుటుంబమైనా జీవనాన్ని ఎలా కొనసాగించగలదు.? ఎగుమతులు పెరిగినా, ఎగవేత దారుల నుంచి బకాయిల వసూళ్లలో పురోగతి కనిపిస్తున్నా, కొత్తగా ప్రజలపై పన్నులు ఎందుకు వేయాల్సి వస్తోందో కేంద్రం చెప్పాలి. ముఖ్యంగా ఇంధన ధరలను కేంద్రం ఎందుకు తగ్గించలేకపోతోందన్న ప్రశ్న సామాన్యులను వేధిస్తోంది. గతంలో మాదిరిగా పుల్ల, పుడక ఏరితెచ్చుకునేందుకు ఇప్పుడు అవకాశాలు బాగా మృగ్య మైపోయాయి. కిరోసిన్ అనేది మార్కెట్‌లో సామాన్యులకు దొరకని వస్తువుగా తయారైంది. బండ్లపై తినుబండారాలను తయారు చేసి అమ్ముకొనేవారు సైతం ఇప్పుడు గ్యాస్ పొయ్యిలనే వినియోగిస్తున్నారు. వంటనూనెల ధరలు ఎవరికీ అందనంత ఎత్తున పెరిగిపోయాయి. విద్యుత్ చార్జీలు ముందే పెరిగిపోయాయి. సామాన్యులపై భారం పడకుండా చార్జీలను పెంచామని ప్రభుత్వాలు చెబుతున్నా, కళ్ళుతిరిగే రీతిలో విద్యుత్ బిల్లులు వస్తున్నది పేదలకే. ఇది ఒక ప్రహసనంగా తయారైంది. పైగా వేసవిలో విద్యుత్ కోతలతో పగటి పూట ప్రజలు నరకాన్ని చూస్తున్నారు. సామాన్యుల దప్పిక తీర్చే కుండల ధరలు కూడాబాగా పెరిగిపోయాయి.
గతంలో వేసవి చలివేంద్రాలు ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. హైదరాబాద్, సికిందరాబాద్ జంటనగరాలకు వందేళ్ళ దాకా నీటికొరత ఉండదంటూ ప్రభుత్వం ప్రకటించినప్పుడు సామాన్యులు ఎంతోపొంగి పోయారు. కానీ, కొన్ని కాలనీల్లో నీటికోసం మహిళలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ట్యాంకర్లద్వారా నీరు తెప్పించుకునే స్థోమత అందరికీ ఉండదు. ట్యాంకర్లను బుక్ చేసినా అవి సకాలంలో రావు. వాటి ప్రాథమ్యాలు ఎక్కువగా భాగ్యవంతుల కాలనీలకేనన్నది అసత్యం కాదు., వేసవిలో నీరు, విద్యుత్ వాడకం ఎక్కువన్న సంగతి నిజమే. అలాంటి సమయాల్లోనే ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందించి అమలు జేయాలి. విద్యుత్ కోతలు పేదలు నివసించే ప్రాంతాలకేనా? భాగ్య వంతుల కాలనీల్లో ఉండవా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఇరవై నాలుగు గంటల విద్యుత్ అనేది కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతోంది. ప్రభుత్వాలు ఏ పథ కాన్ని అమలు జేసినా, ఏ కార్యక్రమాన్ని చేపట్టినా సామాన్యునికి ప్రయోజనం కలిగే రీతిలో ఉండాలి. ఆ విషయాన్ని నాయకుల ప్రసంగాల్లో ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. కానీ, ఆచరణలో అది అమలు జరగడం లేదు. ప్రభుత్వాధినేతలు చేసే వాగ్దానాలు దిగువస్థాయి వరకూ అమలు జేసే యంత్రాంగం ఉన్నప్పుడే సత్ఫలితాలు లభిస్తాయి. రాజకీయ పార్టీలు ప్రజాసమస్యలపై స్పందిస్తున్న తీరు అభినందనీయమే. కాని ఫలితం కన్పించడం లేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..