Tuesday, November 26, 2024

నేటి సంపాదకీయం–మణిపూర్‌లో మళ్లీ మంటలు

ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి వెల్లి విరుస్తోందంటూ కేంద్రం ప్రకటించి ఇంకా కొద్ది రోజులైనా కాలేదు,శనివారం నాడు మణిపూర్‌లో చుర్‌ చంద్రాపూర్‌ జిల్లాలో ఉగ్రవాదులు పొంచి ఉండి జరిపిన దాడిలో అసోం రైఫిల్స్‌ కమాం డింగ్‌ ఆఫీసర్‌, ఆయన భార్య, కుమారుడు, మరి నలుగురు జవాన్లు మరణించిన సంఘటన ఇటీవల చోటు చేసుకున్న ఘటనల్లో అత్యంత కిరాతకమైనది.ఐఈడీ పేలుళ్ళ సామగ్రిని పేల్చడం ద్వారా ఈ దారుణానికి వారు పాల్పడ్డారు. పైగా ఇందుకు తమదే బాధ్యత అంటూ మణిపూర్‌ లిబరేషన్‌ ఆర్మీ (పిఎల్‌ఏ), మణిపూర్‌ నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌లు ప్రకటించాయి. తమ రాష్ట్రంలో భూముల కోసం, భూముల హక్కుల కోసం ఆదివాసులు, గిరిజనులు సాగిస్తున్న ఆందోళనను అసోం రైఫిల్స్‌ దళాలు నిర్దాక్షిణ్యంగా అణచివేయడం వల్లనే తాము ఈ ప్రతీకార చర్యకు పాల్పడినట్టు చెప్పుకున్నాయి.

అసోం రైఫిల్స్‌ పాత్ర వివాదా స్పదమైనదే కావచ్చు, ఆ దళం కమాండింగ్‌ అధికారి, భార్య,కుమారులతో వెళ్తున్నప్పుడు పొంచి ఉండి దాడి చేయడం అమానుషం. అనాగరికం. ఈశాన్య ప్రాంతాల్లో భద్రతా దళాలు ప్రాణాలకు తెగించి ప్రజలను ఉగ్రవాదుల నుంచి కాపాడుతున్నాయి. అయితే, ఆ ప్రాంత ప్రజల్లో కొందరు ఉగ్రవాదులతో మిలాఖత్‌ కావడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దాడి చేసిన రెండు సంస్థల్లో మణిపూర్‌ పీపుల్స్‌ ఆర్మీ నలభై ఏళ్ళు గా ఈ ప్రాంతంలో ప్రజలను ఆందోళనలకు పురికొల్పుతోంది. భారత్‌ నుంచి మణిపూర్‌ విడిపోవాలన్న డిమాండ్‌పై ఈ సంస్థ ఏర్పడింది. భారత్‌తో కలిసి ఉంటే మణిపూర్‌ ప్రజలకు న్యాయం జరగదన్న భావాన్ని స్థానికుల్లో వ్యాపింపజేయడంలో పీపుల్స్‌ ఆర్మీ మూడు దశాబ్దాలుగా నిర్విరామంగా జరిపిన కృషి ఫలితంగా ఇప్పుడిప్పుడే ఈ దళంలోకి యువకులు, కొత్తవారు వచ్చి చేరుతున్నారు. ఈ దాడి జరిగిన ప్రాంతం చుర్‌ చంద్రాపూర్‌ జిల్లా ఎత్తయిన కొండల మధ్య మయన్మార్‌కి సరిహద్దుల్లో ఉంది.అక్కడి నుంచి శరణార్ధు లు ఈ జిల్లాకి తరచూ వస్తుంటారు.

వీరికి సిద్ధాంతపరమైన అవగాహన, ఆసక్తి లేక పోయినా, తిండి తిప్పల కోసం వచ్చిన వారిని పీపుల్స్‌ ఆర్మీ చేరదీసి సాయుధ శిక్షణ ఇస్తోంది. అంతేకాకుండా చైనా ప్రోద్బలం కూడా లేకపోలేదు. సరిహద్దు గ్రామాల్లో, ప్రాంతాల్లో అశాంతిని రెచ్చగొట్టేందుకు చైనా బరితెగిస్తున్న సంఘటనలు ఇప్పటికే ఎన్నో నమోదు అయ్యాయి. పీపుల్స్‌ ఆర్మీని భిషేశ్వర్‌ 1978లో నెలకొల్పాడు. మార్క్సిస్టు లెనినిస్టు భావజాలంతో పెరిగిన అతడు మణిపూర్‌, నాగాలాండ్‌, మిజోరంలలో వేర్పాటు, ఉగ్రవాద వర్గాలను ఏకం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.అతడి ప్రయత్నాలు ఫలించలేదు. మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు తర్వాత అక్కడి నుంచి వచ్చిన సైనికులు, పౌరుల సాయంతో అతడు మణిపూర్‌ పీపుల్స్‌ ఆర్మీని విస్తరింపజేశాడు. తమ ప్రాంతంలో వనరులను ఇతర ప్రాంతాలకు చెందిన వారు దోచుకుని పోతున్నారని మణిపూర్‌ వాసులు ఆ మధ్య పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. 2015లో ఈ మాదిరి ఘటనలో 18 మంది మరణించారు. అయితే, అసోం రైఫిల్స్‌ అధికారుల లక్ష్యంగా దాడి చేయడం ఇదే మొదటి సారి.

- Advertisement -

ఈ దాడిలో మరణించిన అసోం రైఫిల్స్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ విప్లవ్‌ త్రిపాఠీ గతంలో మిజోరంలో తీవ్రవాదుల దాడులను అరికట్టి సమర్ధుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. మయన్మార్‌ నుంచి అక్కడి పౌరులు, జవాన్లు మణిపూర్‌ సరిహద్దులు దాటి రాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నారు.అందువల్ల ఆయనపై ప్రతీకారంతోనే ఈ దాడికి పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీపాల్పడి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. పిఎల్‌ఏగా పేరు మోసిన ఈ తీవ్రవాద సంస్థ స్థానికుల హక్కుల కోసం చేసిందేమీ లేదు. కానీ, మణిపూర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి స్థానికులను ఆకట్టుకుంటున్నారు.అసోం రైఫిల్స్‌ దళంలో స్వార్ధపరులైన అధికారులు లోపాయికారీగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. పీపుల్స్‌ ఆర్మీ దాడితో మణిపూర్‌లో చెలరేగిన హింస మరిన్ని దాడులకు దారి తీయవచ్చని భావిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement