అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పత్రికల్లో వ్యాసాలు, ఎలక్ట్రానిక్ మీడియాలో గోష్టులు, సభలూ, సమావేశాలు తప్ప మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కానీ, సామాజిక సేవా సంస్థలు కానీ చేసిందేమీ లేదు. మహిళలకు ప్రోత్సాహం ఇస్తే వారు సాధించలేనిది లేదని ఏనాడో మన ప్రాచీన కవులు తమ కవితల్లో స్పష్టం చేశారు. ఆనాడే కాదు, ఇప్పుడు కూడా మహిళలను అందలం ఎక్కిస్తేనే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఉపన్యాసాలు దంచేసేవారు మన సమాజంలో ఉన్నారు. అయితే, ఓరిమి, కష్ట సహిష్ణుత, ప్రశాంత చిత్తం, పట్టువీడని మనస్తత్వం మహిళల సొత్తు. అందువల్ల ఏ పని అప్పగించినా వారు ఆ పనినిపూర్తి చేసేందుకు నిరం తరం కష్టపడుతుంటారు. కార్మిక రంగం నుంచి కార్పొ రేట్ రంగంలో పదవులు, ఉద్యోగాల వరకూ మహిళలు అన్ని రంగాల్లో ఈనాడు రాణిస్తున్నారంటే అదంతా వారి స్వయం కృషే. ప్రభుత్వాలు ప్రచారానికే మహిళ ఊసెత్తుతూ ఉంటాం. మహిళల అభ్యున్నతి పట్ల ప్రభుత్వాలకు, ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదనడానికి మహిళా బిల్లు మూడు దశాబ్దా లుగా పార్లమెంటు గడప దాటకపోవడమే నిదర్శనం.
మహిళా సాధికారతకు పార్లమెంటులో, అసెంబ్లిల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం బిల్లును ఆనాడు ఎప్పుడో ఎన్‌డిఏ తొలివిడత ప్రభుత్వంలో ఆనాటి ప్రధాని వాజ్‌పేయి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అంతకు ముందు ప్రధాని పీవీ నరసింహారావు కూడా ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందేట్టుచూడటానికి చిత్తశు ద్ధిని ప్రదర్శించారు. వాజ్‌పే నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం తొలి సంకీర్ణ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి మహిళా ముఖ్యమంత్రులైన మాయావతి (బీఎస్‌పీ), జయలలిత (అన్నా డిఎంకె) నుంచి తరుచుగా బెదిరింపులు వచ్చేవి. అర్థంతరంగా జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడం వల్లనే వాజ్‌పేయి తొలి ప్రభుత్వం 13రోజులు మాత్రమే అధికారంలో ఉంది. ప్రభుత్వాల్లో పదవుల విషయంలో కూడా మహిళలకు మొదటి నుంచి అన్యాయం జరుగుతోంది. నాలుగున్నర దశాబ్దాల క్రితం ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాగలి గారంటే ఆమెకు అండగాఉన్న కుటుంబ నేపథ్యమే కాకుండా, ఆమె ధైర్య సాహసాలు, తెలివి, సమయ స్ఫూర్తి, వ్యూహత్మకంగా పావులు కదిపే శక్తి మొదలైన కారణాలే తప్ప ఒక మహిళగా ఆమెకు వచ్చిన అవకాశాలు కావు.
అధికార గణంలో కూడా మహిళలకు ఉన్న తపదవులు లభించడం అన్నది కూడా చాలా తక్కువ. మహిళలను ప్రోత్సహించాలని ఉపన్యాసాలు ఇచ్చేవారే, మహిళల అభ్యున్నతికి అడ్డుపడుతున్నారు. మన దేశంలో కన్నా ఇతర దేశాల్లోనే రాజకీయ పదవుల విషయంలో మహిళలకు ఎక్కువ ప్రోత్సాహం లభిస్తోంది. ఉదాహరణకు నార్డిక్ దేశాలుగా పేరొందిన డెన్మార్క్, ఐస్‌లాండ్, స్వీడన్‌లకు ప్రస్తుతం మహిళా ప్రధానులే ఉన్నారు. నార్వేకి కూడా గత ఏడాది వరకూ మహిళాప్రధాని ఉన్నారు. జర్మనీ చాన్సలర్‌గా చాలా కాలం వ్యవహరించిన అంగేలా మెర్కెల్ ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించారో అందరికీ తెలుసు. మహిళా ప్రధానులు ఉన్న దేశాల్లో కోవిడ్-19ను వీలైనంత త్వరగా అరికట్టగలిగినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. వ్యాక్సినేషన్ విషయంలో వారుతీసు కున్న శ్రద్ధాసక్తులు, నిబద్ధత వల్ల ఇది సాధ్యమైందని ఆరోగ్య సంస్థ పేర్కొంది. అలాగే, మహిళలు నడిపే విద్యాలయాలు, ఆరోగ్య సంస్థలు ఎటువంటి తటబాట్లు, లోటుపాట్లు లేకుండా బాగా పని చేస్తున్నాయి.
అవినీతికి ఆస్కారం లేని పాలనా పద్దతులను అమలు జేయడంలో మహిళలు మంచి పేరు తెచ్చుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన మహిళలంతా స్వయంకృషి వల్ల ఎదిగిన వారే. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారీస్ అమెరికాలో స్థిరపడిన భారతీయ కుటుంబానికి చెందిన వారు. అమెరికా అధ్యక్షుడు జోబిడెన్‌కు ఆమె అందిస్తున్న సహకారం ఇప్పటికే ప్రశంసలను అందుకుంది. మహిళలను పొగడ్తలతో పొంగిపోయేట్టు చేయకుండా, వారి శక్తి సామర్ధ్యాలనూ, మేథస్సునూ, వృత్తి పరమైన నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటే అభివృద్ధి పథంలో ముందుకు సాగడం తథ్యమన్న మెకిన్సే నివేదిక అక్షర సత్యం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..