కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ కన్నా తక్కువ తీవ్రత గలదన్న ధీమాతో ఉండవద్దనీ, ఒమిక్రాన్‌ను తేలిగ్గా తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ టెడ్రోస్ అథనామ్ హెచ్చరించారు. ఒమిక్రాన్ కేసులుప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న వేళ ఆయన ఈ హెచ్చరిక చేశారు. ఒమిక్రాన్ కూడా ప్రాణాంతకమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ వేరియంట్ డెల్టా కన్నా వేగంగా వ్యాపిస్తోం దనీ, ప్రపంచ వ్యాప్తంగా వివిధ నగరాల్లో వేలాది మంది ఒమిక్రాన్ చికిత్సకోసం ఆస్పత్రుల్లో చేరుతున్నారనీ, కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయని ఆయన అన్నారు. అగ్రరాజ్యమైన అమెరికాలో డెల్టా కేసులు వేలల్లో నమోదయితే, ఒమిక్రాన్ కేసులు లక్షల్లో రికార్డు అవుతున్నాయి. టీకాల పంపిణీలో అసమానతల వల్లనే కొత్త వేరియంట్లు వ్యాపిస్తున్నాయి, టీకాల పంపిణీలో ధనిక దేశాలు వివక్షపాటిస్తున్నాయన్నది ఆరోపణ కాదు, వాస్తవమని ఇప్పుడు రుజువు అవుతోంది. కొన్ని దేశాల్లో బాగా తక్కువ శాతం వ్యాక్సినేషన్ జరిగింది. అయితే, మన దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముందుచూపు వల్ల వ్యాక్సినేషన్ చురుకుగా సాగుతోంది. ఇప్పటికి 150 కోట్ల టీకాల పంపిణీ జరిగిందంటే సామాన్యమైన విషయం కాదు. టీకాల పంపిణీని ఒక యజ్ఞంలా భావించి అమలు జేస్తున్నారు.
అయితే, మన దేశంలో కూడా ఒమిక్రాన్ కేసుల సంఖ్య కొత్త సంవత్సరారంభం నుంచీ పెరుగుతోంది. బూస్టర్ల వల్ల వేరియంట్‌లను నియంత్రణ చేయవచ్చని చాలా మంది భావిస్తున్నారనీ, వేరియంట్లను నియంత్రించడానికి అదొక పద్దతే తప్ప పూర్తిగా బూస్టర్ వల్లే ఒమిక్రాన్ అరికట్టబడుతుందనుకుంటే పొరపాటని టెడ్రోస్ అథనామ్ స్పష్టం చేశారు. ముంబాయిలో ఒమిక్రాన్ రోగులకు చికిత్స అందించే వైద్యులు, వైద్య సిబ్బందికి కూడా ఒమిక్రాన్ సోకుతోంది. అయితే, డ్యూటీల వేళల్లో మార్పుల ద్వారా రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వైద్యసేవలందిస్తున్నట్టు ఆస్పత్రుల అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల ద్వారానే ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. ఇటలీ నుంచి వచ్చిన మరో విమానంలో 150 మందికి పాజిటివ్ నమోదు అయింది. అందుకే, విదేశాలనుంచి వచ్చిన వారు ఏడురోజుల హోం క్వారంటైన్‌ను పాటించాలని ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల్లో సూచించింది.
పండుగ రోజుల్లో జరిగే వేడుకలు, ఇతర కార్యక్రమాలను తగ్గించుకోవాలని ప్రభుత్వం ఈమార్గదర్శకాల్లో సలహా ఇచ్చింది. ముంబాయి, ఢిల్లి, బెంగళూరు వంటి మహానగరాల్లో ఇప్పటికే నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే, లాక్‌డౌన్‌ను విధించే ఆలోచన లేదని ముంబాయి మేయర్ ప్రకటించారు. తెలంగాణలో రెండో డోస్ వ్యాక్సినేషన్ లక్ష్యం వంద శాతం పూర్తి అయ్యేట్టు చూడటానికి వైద్యులు, సిబ్బందిని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హిరీష్‌రావు ఉరకలెత్తిస్తున్నారు. బూస్టర్ డోస్‌ల విషయంలో వయోజనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్‌లోనూ, ఇతర నగరాల్లో ఒమిక్రాన్ కేసుల నమోదు, చికిత్స మొదలైన అంశాల సమాచారాన్ని తెప్పించుకుని ఎప్పటికప్పుడు ఆయన సమీక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒమిక్రాన్ కేసుల నమోదు పైనా, చికిత్సలపైనా నిరంతర పర్యవేక్షణ జరుగుతోంది. అసోం తదితర రాష్ట్రాల్లో రాత్రి వేళల్లో కర్ఫ్యూని అమలు జేస్తున్నారు.
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారికి ఉచితంగా కోవిడ్ చికిత్సలు అందిస్తున్నారు. మన దేశంలో కరోనా, దాని కొత్త వేరియంట్ల విషయంలోఏమాత్రం ఏమరు పాటు లేకుండా చికిత్సలు అందిస్తున్నప్పటికీ, విదేశాల నుంచి వచ్చే వారి వల్లే ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ జైళ్లలో కూడా వేగంగా వ్యాపిస్తోంది. ఢిల్లిలోని తీహార్ జైలులో 16 మంది ఖైదీలకు, 21మంది సిబ్బందికి ఒమిక్రాన్ సోకింది. మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారికే కాకుండా, జైళ్ళలో ఒమిక్రాన్ సోకడాన్ని బట్టి ఈ వేరియంట్ వ్యాపక శక్తి ఎంత తీవ్రంగాఉందో స్పష్టం అవుతోంది. ఈ నెలాఖరుకు కరోనా మూడవ దశ ముమ్మరదశకు చేరుకుంటుందనీ రోజుకు నాలుగు నుంచి 8 లక్షల కేసులు నమోదు అవుతాయనీ, మార్చి నెలాఖరుకు పూర్తిగా సమసి పోతుందని అంతవరకూ అప్రమత్తత తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital