ప్రభ న్యూస్: సాంకేతిక పరిజ్ఞానం మనిషిలో ఆత్మవిశ్వసాన్ని పెంచుతున్నట్టే, నిరక్షరాస్యు లనూ, దీనిపై దృష్టి పెట్టని వారినీ మరింత అయోమయం చేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానంలో మన దేశం సాధించిన విజయంగా డిజిటల్ కరెన్సీని గురించి చెప్పుకోవచ్చు. డిజిటల్ కార్డు మన దగ్గర ఉంటే బ్యాంకును మన వెంట తీసుకుని వెళ్తున్నట్టే. ఇదే విషయాన్ని ఐదేళ్ళ క్రితం పెద్ద నోట్ల రద్దు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించినప్పుడు హేళన చేసినవారున్నారు . అయితే, ఇది పూర్తిగా విఫలం కాలేదు. మిశ్రమ ఫలితం లభించింది. ఇందుకు బ్యాంకు ఖాతాదారులతో పాటు బ్యాంకు సిబ్బంది, అధికారుల పాత్రతో పాటు లబ్ధిదారులు, బ్యాంకు ఖాతాదారుల పాత్ర కూడా ఉందనడం నిష్ఠూరమేమీ కాదు. తమ ఖాతాల్లో డబ్బును తీసుకోవడం., కొత్తగా డబ్బు జమ చేయడం తెలియని వారు ఇంకా ఉన్నారు. వీరికి కొత్త విధానాల గురించి తెలియజెప్పేందుకు బ్యాంకు సిబ్బంది, అధికారులు తీరిక లేదంటూఉంటారు.
దీని వల్ల కూడా ఈ డిజిటల్ కార్డు ప్రాచుర్యం పొందడం లేదు. బ్యాంకుల్లోనే కాకుండా విడిగా ఉండే ఎటిఎంలలో బ్యాంకు కార్డు ద్వారా డబ్బు తీసుకునేందుకు ఖాతాదారులకు సరైన అవగాహన కల్పించడంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది సరైన పాత్ర వహించడం లేదన్న ఫిర్యాదులు ఇప్పటికీ వస్తున్నాయి.
అంతేకాకుండా డిజిటల్ కార్డుల ద్వారా నిత్యావసరాల కొనుగోళ్ళు, ఇతర లావాదేవీలు జోరుగా జరగకపోవడానికి కారణం కూడా ఖాతాదారుల్లో అవగాహన కల్పించడంలో బ్యాంకు సిబ్బంది వైఫల్యమే కారణ మని చెప్పవచ్చు. డిజిటల్ కార్డుల ద్వారా లావాదేవీలు జరపాలన్న ఆసక్తితో వెళ్ళే బ్యాంకు ఖాతాదారులకు చేదు అనుభవాలు ఎదురవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చిన్న వస్త్ర దుకాణాలు, ఫ్యాన్సీ షాపుల్లోనే కాకుండాపెద్ద మాల్స్‌లో కూడా తమ వద్ద స్వైపింగ్ మెషీన్లు ఉన్నా అవి సక్రమంగా పని చేయడం లేదన్న సమాధానం ఇస్తున్నారు. స్వైపింగ్ యంత్రాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం లేదా ఆధునీకరించడం చేసుకునే బాధ్యత ఆయా దుకాణాలు, మాల్స్ యజమానుల బాధ్యత. కొన్ని ఆధునిక దుకాణాల్లో కూడా డిజిటల్ కార్డులు పని చేయవనీ, నగదుతోనే లావాదేవీలు ఉంటాయని నిర్మొహమాటంగా స్పష్టం చేస్తున్నారు.
ప్రధానమంత్రి మోడీ నోట్ల రద్దు వల్ల ఆశించిన స్థాయిలో నల్లధనం ప్రభుత్వం చేతికి రాలేదని అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా అంగీకరించారు. కరెన్సీ నోట్ల మార్పిడి ద్వారా వ్యాపార పరంగా లబ్ధి పొందినవారున్నారు. నల్లధనం వెలికి తీయడానికి కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ఐదేళ్ళ క్రితం సరిగ్గా నవంబర్ ఐదవ తేదీన చేసిన ప్రకటనలో చిత్తశుద్ధి ఉండవచ్చు. కానీ, ఆయన ఆలోచనలూ, రూపొందించే కార్యక్రమాల వేగాన్ని యంత్రాంగం ఇంకా అందుకోలేకపోతోంది. మరో వంక ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) పరిశ్రమ శరవేగంగా అభివృద్ది చెందుతోందని ప్రభుత్వమే పదే పదే ప్రకటిస్తోంది. డిజిటల్ ఎకానమీ లక్ష్యం ఐదేళ్ళలో ఒక ట్రి లియన్ డాలర్లని సాక్షాత్తూ కేంద్ర ఐటి మంత్రి వెల్లడించారు.ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఆయన శాఖ ద్వారా కృషి చేస్తూ ఉండవచ్చు.
డిజిటల్ పేమెంట్సుకు ఇంకా అంత ప్రాధాన్యం లభించడం లేదు., బ్యాంకుల్లో చెక్కుల మార్పిడిలో ఇబ్బందులు ఇంకా తొలగడం లేదు.డిజిటల్ కార్డుల వినియోగంలో భద్రత లేదని వినియోగదారులు అంటున్నారు. ఏమాత్రం అశ్రద్ధ వహించినా, ఏమరు పాటుగా ఉన్నా కార్డులు ఎటిఎం యంత్రాల్లోకి వెళ్ళిపోతుంది. ఆ యంత్రాలను ఖాతాదారుడు కోరిన వెంటనే బ్యాంకు సిబ్బంది తెరవరు. ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. పైగా వరుసలో నిలబడిన వారు పిన్ నెంబర్‌ను చూసే ప్రమాదం ఉంది. అయితే,నగదు చెల్లింపుల్లో ఉండే కష్టాలు అక్కడా ఉన్నాయి.అందువల్ల ముందుగా ఖాతాదారులు తమ ఖాతాల లావాదేవీల విషయంలో అవగాహన పెంచుకున్నప్పుడే ఈ విధానం పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుంది.డిజిటల్ లావాదేవీలు గాడిలో పడితే దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజ నకరమన్న మాట నిజమే.డిజిటిల్ కరెన్సీకి జనం ఇప్పుడిప్పుడే అలవాటు పడుతు న్నారు. దీన్ని మరింతగా వాడకంలోకి తీసుకురావాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది.