Tuesday, November 26, 2024

నేటి సంపాదకీయం – అంద‌రికీ మేలు చేస్తేనే..

మంగళవారం పార్లమెంటుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్పించిన కేంద్ర బడ్జెట్‌పై వరుసగా రెండో రోజున కూడా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ బడ్జెట్‌కు సమాజంలో ఏ వర్గానికీ ఉపయోగపడదనీ, ప్రధానమంత్రి సన్నిహితులైన మహాకోటీశ్వరులకు మాత్రమే ప్రయోజనం
చేకూరుతుందని కాంగ్రెస్‌ సహా అన్ని ప్రతిపక్షాలు విమర్శించగా, ఈ బడ్జెట్‌తో దేశం రూపురేఖలు మారిపోతాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఈబడ్జెట్‌తో భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని ఆయన అన్నారు. కరోనా రెండుదశల్లో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కుంగిపోగా, భారత్‌ ఈ సవాల్‌ను తట్టుకుని నిలబడటమే గొప్ప విషయమని ప్రధానమంత్రి అన్నారు. వ్యవసాయ రంగాన్ని తమ ప్రభుత్వం విస్మరించిందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. వ్యవసాయ రంగంలో హైటెక్‌ పద్దతులు ప్రవేశపెట్టడం వల్ల రైతుల పెట్టుబడి వ్యయం తగ్గుతుందనీ,
అలాగే, క్రిమిసంహారక మందులను చల్లించడానికి డ్రోన్‌లను వినియోగించడం వల్ల రైతులకు
ఎంతో కలిసొస్తుందని అన్నారు. ప్రధాని చెప్పింది నిజమే కావచ్చు కానీ, డ్రోన్‌ టెక్నాలజీని వినియోగించుకునే స్థోమతు సంపన్నులైన రైతులకు మాత్రమే ఉంటుంది. చిన్నకారు, మధ్యతరహా రైతులు ట్రాక్టర్లనే వినియోగించుకోలేకపోతున్నారు. డ్రోన్‌ల సేవలను ఎలా పొందగలుగుతారు?

అలాగే, డిజిటల్‌ రుపీ ద్వారా ఆర్థిక పరమైన లావాదేవీలు సులభతరం అవుతాయని ప్రధాని అన్నారు. ప్రస్తుతం బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు సాగించే సన్నకారు, మధ్యతరగతి రైతులు ఎంతమందిఉన్నారు. దేశంలో పరిస్థితులను బట్టి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో తప్పులేదు. ఏడాది పాటు దేశవ్యాప్తంగా రైతులు సాగించిన ఆందోళనతో దిగి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు మరోరూపంలో ఆ సాగు చట్టాల్లోని అంశాలను వ్యవసాయ రంగంలో ప్రవేశపెడుతోందేమోనని పలువురు అనుమానిస్తున్నారు. మార్పు సహజమే కాక, ఆహ్వానించదగిందే. ఇందుకు ప్రజలనూ, సంబంధిత వర్గాలను సంసిద్ధం చేసిన తర్వాతే సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టాలి, లఘు, చిన్న పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలకు) ఈ సారి బడ్జెట్‌లో అధిక నిధులుకేటాయించామని అంటున్నారు, కానీ, ఆ చర్యల ఫలాలు లబ్ధిదారులకు చేరేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవల్సి ఉంది. ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల సంఖ్యను మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా తగ్గాయి. బ్యాంకుల్లో సామాన్యులకు రుణం లభించడం ఎంత కష్టమో జగద్విదితం. రాజకీయ నాయకుల అండ ఉన్నవారికీ, రాజకీయ నాయకులకు మాత్రమే బ్యాంకు రుణాలు లభిస్తాయి. వేల కోట్ల రూపాయిలు బకాయి పడినా వారికే బ్యాంకుల్లో ఆదరణ లభిస్తోంది. డిజిటల్‌ ఎకానమి వ‌ల్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని ఆర్థిక మంత్రి, తాజాగా ప్రధానమంత్రి పేర్కొన్నారు.

డిజిటల్‌ లావాదేవీల వల్ల బ్యాంకుల్లో రుణాల బట్వాడా పారదర్శకంగా జరుగుతుందన్న మాట నిజమే, తీసుకున్న రుణాలను లబ్ధిదారులు వేరే కార్యక్రమాలకు మళ్ళిస్తుంటే బ్యాంకులు చూస్తూ ఊరుకుంటున్నాయన్న ఆరోపణలు ఇప్పటికే వస్తున్నాయి. బ్యాంకులలో రుణాల పై పర్యవేక్షక యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేయడం లేదనో, లేక, లబ్ధిదారులతో సంబంధిత వ్యక్తులు కుమ్మక్కు కావడం వల్లనో బకాయిలు పెరిగి పోతున్నాయని బ్యాంకు ఉద్యోగ సంఘాలే చెబుతున్నాయి. డిజిటల్‌ లావాదేవీలు ఇప్పటికే కొనసాగుతున్నా అక్రమాలను పట్టుకోలేకపోతున్నారు. అలాగే, క్రిఎ్టో కరెన్సీకి అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ఆర్థికమంత్రి చేసిన 30 శాతం పన్ను ప్రతిపాదన వల్ల స్పష్టం అవుతోంది. కానీ, ఇందుకు సంబంధించిన విధాన ప్రకటన వెలువడలేదు. అలాగే, విదేశీ మారక ద్రవ్య నిధులుబాగా పెరిగాయన్న మాట ప్రభుత్వ వర్గాలనుంచి తరచూ వినిపిస్తున్నాయి. ఆ నిల్వలను ఎవరికోసం వినియోగిస్తున్నారు? విదేశీ మారక ద్రవ్య నిధులు బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే తోడ్పడుతున్నాయన్న ఆరోపణలకు సరైన సమాధానం లేదు. అందువల్ల ప్రధానమంత్రి ఆకాశవాణిలో మనసులో మాట ద్వారా చెప్పిన విషయాలనే ఇప్పుడు బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మల తెలిపారు. ఇవి ఆదర్శప్రాయమైనవి అనడంలో సందేహం లేదు. కానీ, ఆచరణలో నిరూపించేది ఎవరు?

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement