చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మన దేశంలో పర్యటిస్తున్న సందర్భంగా మన విదేశాంగ మంత్రి జై శంకర్ ఆయనతో చర్చల సందర్బంగా సరిహద్దు సమస్య తేలిన తర్వాతే ఇతరవిషయాలపై చైనాతో సాధారణ సంబంధాలను కొనసాగించగలమని చాలా విస్పష్టంగా చెప్పారు. 1993-96 మధ్య ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయనీ, చైనా వాటిని గౌరవించడం లేదనీ, అందువల్లనే గాల్వాన్, డోక్లామ్‌లలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయని అన్నారు. చల్లకు వచ్చి ముంత దాచినట్టు వాంగ్‌యీ ఉక్రెయిన్ సమస్యపై మాట్లాడాదమనుకున్నారు. జైశంకర్ ఎప్పుడైతే చైనా పై భారత్ తాజా వైఖరిని కుండబద్దలు కొట్టారో అప్పుడు వాంగ్‌యీ మారు మాట్లాడలేదు. ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపేందుకు తమ దేశం చేయని ప్రయత్నమంటూ లేదని వాంగ్ యీ గొప్పలు చెప్పుకోబోయారు. అయితే, భారత్ పర్యటనలో ఇతర అంశాల ప్రస్తావన దేనికని జైశంకర్ చాలా మృదువుగా తిప్పికొట్టారు. చైనా పొరుగు దేశం కావడం వల్ల, శతాబ్దాల మైత్రి ఉన్న కారణం వల్ల చైనాను భారత్ ఎప్పుడూ గౌరవిస్తూనే ఉందనీ, అయితే, చైనా భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలను తుంగలోకి తొక్కి సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలను సృష్టిస్తోందన్న జైశంకర్ అన్న మాటల్లో ఏమాత్రం అత్యుక్తి లేదు. సిక్కిం సరిహ ద్దుల్లో డోక్లామ్‌లో చైనాసేనల మోహరింపుతో ఏర్పడిన ఉద్రిక్తత ఇరుదేశాల మధ్య సాధారణ సంబంధాలను తొలిసారి దెబ్బతీసింది.
చైనా నిర్మిస్తున్న మహామార్గానికి (బోర్డర్ రోడ్డు ఇనీషి యేటీవ్-బిఆర్‌ఐ) పొరుగుదేశాల భూభాగాల్లోకి చొచ్చుకుని పోవడం ఎప్పుడైతే ప్రారంభించిందో అప్పటి నుంచి సాధారణ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ మహామార్గానికి దారి ఏర్పరుచుకునే క్రమంలో భారత్‌కి చెందిన భూభాగాల్లోకి కూడా చొచ్చుకుని వచ్చేందుకు చైనా ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్‌లోని భూభాగాలను తమ అంతర్బాగాలుగా చూపే మ్యాప్‌లను విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లో మన కేంద్ర మంత్రులు, టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా వంటి ప్రముఖుల పర్యటనలకు అభ్యంతరం తెలిపింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, లడఖ్ తూర్పు ప్రాంతంలో గాల్వాన్ లోయలోకి చైనా సేనలు చొచ్చుకుని వచ్చాయి. వారిని మన సేనలు సమర్ధవం తంగా తరిమి కొట్టాయి. ఈక్రమంలో20 మంది భారత సైనికులు మరణించారు. ఇవన్నీ అవాంఛ నీయ ఘటన లేననీ, ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను చైనా గౌరవించి ఉంటే ఇవి చోటు చేసుకుని ఉండేవి కావని జైశంకర్ స్పష్టం చేశారు. అరవై ఏళ్ళ క్రితం మన భూ భాగాలను చైనా దురాక్రమణ జరిపింది. అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.1988లో ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ చైనా బీజీంగ్ పర్యటన తో ఇరుదేశాల మధ్య సంబంధాలపునరుద్ధరణ జరిగిం ది. 34 సంవత్సరాల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని చైనాలో పర్యటించారు. సరిహద్దు సమస్యను పక్కన పెట్టి ఇతర రంగాల్లో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఇరుదేశాలు అంగీకరించాయి.
అయితే, రాజీవ్ తీసుకున్న ఈ చొరవను చైనా తన దేశంలో ఉత్పత్తులను భారత్‌లో మార్కెటింగ్ చేసుకోవడానికే ఉపయోగించుకుంది. చైనాలో ఆర్థిక సంస్కరణల ప్రభావంతో అక్కడ పెరిగిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకూ, మొబైల్ ఫోన్‌లకు భారత్ ప్రధాన వ్యాపార కేంద్రం అయింది. చైనా మొదటి నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా స్వీయ ప్రయోజనం కోసమేనని ఆనాటి నుంచి ఈనాటి మహామార్గం వరకూ స్పష్టం అవుతూనే ఉంది. యూరప్ దేశాలతోనూ, ఇతర దేశాలతోనూ వాణిజ్య సంబంధాలను వృద్ధి చేసుకోవడా నికే మహామార్గాన్ని చైనా నిర్మించ తలపెట్టింది. ఇతర దేశాల భూభాగాల్లోకి చొచ్చుకుని రాకుండా ఉంటే ఇందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, మన దేశంతో సంబం ధాల పునరుద్ధరణ అని అంటూనే పాకిస్తాన్‌తో మరింత సాన్నిహిత్యాన్ని పెంచుకుంది. ఆక్రమిత కాశ్మీర్ వివాదాస్పద ప్రాంతమనీ, అది భారత్ భూభాగమేనని తెలిసినా పాక్ కోసం ఆ ప్రాంతంలో విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. అంతేకాకుండా ఎకనామిక్ కారిడార్ (ఆర్థిక నడవ)ను నిర్మిస్తోంది. ఆక్రమిత కాశ్మీర్‌పై వివాదం పరిష్కారం కాకుండా ఈ భూభాగాన్ని పాక్ తరఫున వకల్తా పుచ్చుకుని చైనా ప్రాజెక్టులు నిర్మించడం సహిచరా నిదని మన దేశం స్పష్టం చేసింది. అంతేకాకుండా కాశ్మీర్‌ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించినందుకు చైనా అభ్యంతరం తెలిపింది. లడఖ్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం చైనాకు ఇష్టం లేదు. లడఖ్ మీదుగా రోడ్డు నిర్మాణాన్ని చైనా తలపెట్టడంపై మనదేశం అభ్యంతరం తెలిపింది. సరిహద్దుల్లో సైనికులను మోహరించడం ఉద్రిక్తతలను సృష్టించడం చైనాకు అలవాటు. సరిహద్దు సమస్య తేలేవరకూ సాధారణ సంబంధాలు సాధ్యం కాదని మన దేశం స్పష్టం చేయడం న్యాయమే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..