Saturday, November 23, 2024

నేటి సంపాదకీయం – ‘కారుణ్య’ నియామకాలు!

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌): తండ్రి ఉద్యోగం చేస్తూ మరణిస్తే ఆ ఉద్యోగాన్ని కుమారునికి ఇచ్చే విధానం ప్రస్తుతం అమలులో ఉంది. కొన్ని రాష్ట్రాల్లో పెళ్ళి కాని కుమార్తెకు కూడా ఆ ఉద్యోగాన్ని ఇస్తున్నారు. కారుణ్య నియామకాలుగా పేరొందిన ఈ నియామకాలు దేశంలో పలు రాష్ట్రాల్లో వివాదాన్ని సృష్టిస్తున్నాయి. పెళ్ళయిన కుమార్తెలకు తండ్రి ఆస్తిలో వాటా వస్తుందంటూ ఇటీవల ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు యువతుల్లో చిత్తస్థయిర్యాన్ని కలిగించింది. పెళ్ళి అయిన తర్వాత యువతి ఇంటిపేరు మారిపోతుంది కనుక, తండ్రి నుంచి వారసత్వంగా పొందేందుకు ఇక అర్హతలేమీ ఉండవన్న నిబంధనల వల్ల చాలా మంది ఇబ్బందులకు గురి అవుతున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యార్హత కలిగినప్పటికీ, పెళ్ళయిన కుమార్తెలకు తండ్రి మరణానంతరం ఉద్యోగం ఇచ్చేందుకు ఈ విద‌మైన‌ నిబంధన అడ్డు పడుతోంది.

మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల మరోసారి ప్రకటించారు. సైన్యంలో త్రివిధ దళాల్లో మహిళలకు తగిన ప్రోత్సాహాన్ని ఇస్తున్నామని కూడా ప్రకటించారు. మహిళలకు ఆస్తి హక్కునే కల్పించినప్పుడు ఉద్యోగాల్లో వారసత్వం ఇవ్వడంలో తప్పేమిటని ఇటీవల పలు మహిళా సంఘాలు వాదిస్తున్నాయి. కొన్ని కుటుంబాల్లో వారసులుగా కుమార్తెలే ఉంటారు. తండ్రి వారసత్వం సహజంగానే వారికి దక్కాలి. అయితే, ఆ కుమార్తెల్లో పెళ్ళి అయిన వారికి తండ్రి ద్వారా ఆస్తుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ వారసత్వందక్కకుండా అడ్డుపడే నిబంధనను సవరించాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి ఇటీవల అలహాబాద్‌ హైకోర్టు సూచించింది. చరిత్ర గతిని మార్చే నిర్ణయాలన్నీ అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాల ప్రకారమే జరుగుతున్నాయి. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా పెళ్ళయిన కుమార్తెలకు తండ్రి ఉద్యోగాన్ని వారసత్వంగా పొందే హ క్కు లభించనుంది.

నిజానికి కారుణ్య నియామకాల్లో సర్వీసులో ఉండగా మరణించిన ఉద్యోగి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మాత్రమే నిబంధనల్లో ఉంది. కానీ, అర్హులైన వారికి ఈ వారసత్వం లభించకుండా చేయడం కోసం పెళ్ళయిన ఆడవారిని మినహాయిస్తున్నారు.ఇది అన్యాయమని ప్రయాగ్‌ రాజ్‌కి చెందిన మంజుల అనే యువతి పోరాడి విజయం సాధించింది. ఇలాంటి కేసులు మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో ఉన్నాయి. అయితే, అందరూ ఆమె మాదిరిగా కోర్టులకు ఎక్కి న్యాయం కోసం పోరాడే శక్తి లేక విరమించుకుంటున్నారు. ప్రభుత్వం ఇలాంటి వారి కోసం అలహాబాద్‌ కోర్టు సూచన ప్రకారం నిబంధనలను సవరించాలి. అంతేకాకుండా ఉమ్మడి కుటుంబాల్లో ఆస్తులు పంపకాల్లో కుమార్తెలకు వారిలోనూ, పెళ్ళయినవారికి న్యాయం జరిగేట్టు చూడాలనిమహిళా సంఘాలు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. కొన్ని కుటుంబాల్లో సంతానం అంతా కుమార్తెలే అయినప్పుడు వారికి తండ్రి ఆస్తి, ఉద్యోగ వారసత్వాలను పొందేందుకు చట్టప్రకారం అర్హత కల్పించాలని కూడా మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

అసలు ఇలాంటి నియామకాల పేరులోనే కారుణ్యం అనే పదం ఉంది.అంటే ఉద్యోగి సర్వీసు ముగియకుండా పోవడం వల్ల ఆ ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉద్దేశించిన నియామకం అని అర్ధం. సర్వీసులో ఉండగా ప్రాణాలు కోల్పోయే వారికి ఎక్స్‌గ్రేషియా, పరిహారం పేరిట ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కేవలం తాత్కాలికం. అదే ఆ ఉద్యోగి కుటుంబంలో మగ, ఆడ తేడా లేకుండా ఎవరో ఒకరికి ఉద్యోగం ఇస్తే అతడి కుటుంబాన్ని ఆదుకున్నట్టు అవుతుంది. తండ్రిని కోల్పోయిన కుమార్తె మొత్తం కుటుంబ భారాన్ని మోస్తూ తన తర్వాత వారిని పెద్ద చదువులు చదివించి, జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడేందుకు దోహదం చేస్తున్న యువతులు ఎంతో మంది మన సమాజంలో ఉన్నారు. కారుణ్య నియామకాల నిబంధనల్లో సవరణ చేస్తే అలాంటి వారిని ఆదుకున్నట్టు అవుతుంది. అంతేకాకుండా వారిలో ఆత్మస్థయిర్యాన్ని పెంచినట్టు అవుతుంది. మృతుని కుటుంబానికి నీడ నిచ్చినట్టు అవుతుంది. కారుణ్య నియామకాల్లో అస్పష్టతలను తొలగించి మరణించిన ఉద్యోగి సంతానంలో మగ, ఆడ తేడా లేకుండా ఉద్యోగం ఇస్తే ఆ నియామకాలు సార్ధకమవుతాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement