ప్రబన్యూస్ :నేపాల్‌తో మన దేశానికి తరతరాలుగా, మత ,సాంస్కృతిక విషయాల్లో సంబంధా లు ఉన్నాయి. ఇంకాచెప్పాలంటే నేపాల్ రాజవంశీకులు మన దేశంలోని సంస్థానాధీశుల కుటుంబాలతో వివాహ సంబంధాలు కలిగిఉన్నారు. నేపాల్ రాజు మహేంద్ర,ఆయన కుమారుడు బీరేంద్రల పాలనలో రెండు దేశాలు కలిసిమెలిసి ఉండేవి. నేపాల్‌ను భారత్ నుంచి విడదీయడానికి చైనా ఎంత ప్రయత్నించినా ఈ బంధమే రక్షణ కవచంలా నిలిచింది. అక్కడ రాచరిక వ్యవస్థను మావోయిస్టులు, కమ్యూనిస్టులు కలిసి ఉమ్మడి కూటమిగా ఏర్పడి సంవత్సరాల తరబడి పోరాటాలు సాగిం చి చివరకు కుప్పకూల్చారు.అప్పటి నుంచి భారత్‌తోనేపాల్ సంబంధాలు తరచు ఉద్రిక్తతకు లోనవుతున్నాయి. బీరేంద్ర తర్వాత అతడి సోదరుడు రాజు జ్ఞానేంద్ర హయాంలో కూడా ఇరుదేశాల మధ్యసంబంధాలు కొంతవరకూ మెరుగుగానే ఉండేవి.
ఆ తర్వాత మావోయిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రచండ అధికారాన్ని చేపట్టారు. ఆయన ను చైనా తన వైపు తిప్పుకోవడానికి ఎంత ప్రయత్నించినా, భారత్‌తోనే తమ మైత్రి కొనసాగుతుందని నిష్కర్షగా స్పష్టం చేశారు. ఆయన తర్వాత ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బీజింగ్‌కి ఆహ్వానించి నేపాల్‌కి ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించగానే ఆయన పొంగి పోయారు. దాంతో భారత్ వ్యతిరేక వైఖరిని అనుసరించడం మొదలు పెట్టారు. సరిహద్దుల్లో మన దేశానికి చెందిన కాలాపానీ ప్రాంతం తమదేనంటూ వితండ వాదం మొదలుపెట్టారు.దీనిపై పార్లమెంటుతో తీర్మానం కూడాచేయించారు. భారత్ చుట్టు పక్కల దేశాలన్నింటిని ప్రలోభ పర్చి తన వైపు తిప్పుకునేందుకు చైనా చాలా ప్రయత్నాలు సాగిస్తోంది.శ్రీలంకలో మహిందా రాజప క్సే అధ్యక్షునిగా ఉన్నప్పుడు కొలంబో సమీపంలోని ఒక రేవును అభివృద్ధి చేయడానికి చైనా ప్రభుత్వం తమ దేశంలోని కంపెనీ నుంచి రుణం ఇప్పించింది. ఆ రుణాన్ని శ్రీలంక తీర్చలేకపోవడంతో చైనీస్ కంపెనీ ఆ రేవులోవాటాను సొంతంచేసుకుంది.
ఇదే తీరులో ఇరుగుపొరుగు దేశాలకు రవ్వంత సాయాన్ని అందించి కొండంత ప్రతిఫలాన్ని పొందిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. పాకిస్తాన్‌ను ఏనాడో తన వైపునకు తిప్పుకుంది. భారత్‌పై కక్ష పెంచుకుని పొరుగుదేశాలను పురికొల్పడం ఒక అజెండాగా చైనా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా, బంగ్లాదేశ్ అవతరణకు సైనిక పరంగానూ, ఆర్థికంగానూ సాయం అందించిన మన దేశంపైకి బంగ్లాదేశ్‌ని రెచ్చగొడుతోంది. అలాగే, భూటాన్‌లోకి చైనా సేనలు చొచ్చుకుని వెళ్ళినప్పుడు వారిని వెనక్కి పంపడంలో భారత్ సైనికులు తోడ్పడ్డారు. దక్షిణ సముద్ర తీర ప్రాంతంలోని వియత్నాం వంటి దేశాలను భారత్‌కి వ్యతిరేకంగా ఎగదోస్తోంది. అయితే, ఈదేశాలకు వాస్తవాలేమిటో తెలుసు కనుక భారత్‌తో వైరం పెట్టుకోవడం లేదు. ఈ నేపధ్యంలో ఇప్పుడు నేపాల్‌లో నేపాలీ కాంగ్రెస్ నాయకుడు షేర్ బహదూర్ దేవుబా ప్రధానిగా గత జూన్ నెలలో బాధ్యతలు స్వీకరించారు.ఆయన తొలి విదేశీ పర్యటనగా మన దేశానికి రావల్సి ఉంది. రాకపోవడంతో చైనా ఒత్తిడి ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
ఇంతకు ముందు కేపీ శర్మ ఓలీకి గాలం వేసినట్టుగానే దేవుబాని కూడా చైనా తన వైపునకు తిప్పుకుం టుందేమోనన్న కథనాలు వెలువడ్డాయి. అయితే,ఇటీవల గ్లాస్గోలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిన వాతావరణ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని దేవుబా కలుసుకుని ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపడంతో ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. నేపాల్ చిన్న దేశమైనా వ్యూహాత్మకం గానూ,మత పరంగానూ సాన్నిహిత్యాన్ని కలిగిన దేశం. నేపాల్‌లో అధిక సంఖ్యాకులు హిందువులే. వారంతా మన దేశంలోని హిందూ ప్రధాన ఆలయాలను సందర్శించందుకు ఏటా వస్తుంటారు. ఎన్నో విధాలుగా భారత్ తో విడదీయరాని బంధాన్ని కలిగి ఉన్న నేపాల్‌ని తన వైపునకు తిప్పుకోవడానికి చైనా ఆక్రమిత కాశ్మీర్ మీదుగా బోర్డర్ రోడ్డు ఇనీషియేటివ్ (మహా మార్గం) నిర్మాణంలో నేపాల్ సహకారం కోసమే. ఆక్రమిత కాశ్మీర్ వివాదాస్పద ప్రాంతం కనుక అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని మన దేశం వ్యతిరేకిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital