సరిహద్దు రాష్ట్రం నాగాలాండ్‌లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మరో ఆరునెలలు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం దిమాపూర్ నుంచి రాష్ట్ర రాజధాని కొహిమాకు వందలాది మంది పాదయాత్ర ప్రారంభించారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి పాదయాత్ర ఎప్పుడూ జరగలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని కాశ్మీర్‌లో ప్రయోగిస్తున్నారు. దానిని వ్యతిరేకిస్తూ వందలాది మంది కాశ్మీరీ యువకులు ప్రదర్శనలు జరిపి పోలీసు కాల్పుల్లో మరణించారు.నాగాలాండ్‌లో కూడా ఇదే పరిస్థితి పునరావృతం అవుతుందేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.నాగాలాండ్‌లో ప్రజలు శాంతినే కోరుకుంటున్నారు. వారి తరఫున కేంద్రంతో సంప్రదింపులు జరిపేందు కు పలు సంఘాలు ఏర్పడ్డాయి. వాటిలో నాగా నేషనల్ కౌన్సిల్ ప్రధానమైంది. మయన్మార్‌లోని కొంత భాగాన్నీ, మణిపూర్,తదితర ఈశాన్య రాష్ట్రాల్లోని భాగాలను కలిపి నాగాలాండ్ ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న డిమాండ్‌పై నేషనలిస్టు కౌన్సిల్ చాలా కాలంగా ఆందోళన సాగిస్తోంది.
నాగా నేషనల్ కౌన్సిల్‌కి పొరుగున ఉన్న మయన్మార్‌లో తిరుగుబాటుదారుల మద్దతు ఉంది.కేవలం మద్దతుమాత్రమే కాకుండా వారు ఆయుధా లు కూడా సరఫరా చేస్తున్నారు. దీనిని చాలా తీవ్రంగా పరిగణించిన కేంద్రం ఆ రాష్ట్రంలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని అమలు జేస్తోంది.ఈ చట్టం కింద సాయుధ దళాలకు విశేషాధికారాలు దఖలు పడటంతో సాయుధ దళాలు గత నెలలో ఒక వాహనంపై కాల్పులు జరపడం, దానిపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడం ఇంకా మన స్మృతి పథం లోనే ఉంది. ఆ ఆందోళనల వేడి ఇంకా చల్లారకముందే శనివారం నాడు భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లోమరి కొందరు మరణించారు.ఈసారి మరణించిన వారి సంఖ్యను భద్రతాదళాలు దాచి పెడుతున్నాయని నాగా నాయకులు పేర్కొంటున్నారు. వరుస సంఘటనలతో నాగాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిని గవర్నర్‌కి స్వయంగా వివరించేందుకూ, గవర్నర్ ద్వారా కేంద్రానికి తెలియజేసేందుకు నాగాలు భారీ ప్రదర్శనగా బయలుదేరారు.
నాగాలకు మయన్మార్ తిరుగుబాటు దారుల ఆయుధాలు, సాయం గురించి ప్రశ్నించినప్పుడు నాగా నాయకులు తమవాదాన్ని వినిపించారు.కేంద్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా అమలు జరపలేదనీ, సివిల్ అధికారులు ప్రజల గోడు పట్టించుకోవడం లేదనీ, పోలీసులు లాఠీ చార్జి,కాల్పులు జరపడం తప్ప మామూలు భాషలో మాట్లాడటం లేదని వాపోయారు. ఈ తరుణంలో ఆత్మరక్షణ కోసం పొరుగున ఉన్న మయన్మార్ నుంచి సాయం తీసుకుంటున్నామని వారు వివరించారు.నిజానికి నాగాలాండ్ సమస్యను పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడే పరిష్కరించేందుకు చాలా ప్రయత్నం జరిగింది. నాగాల సమస్యను ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా పరిష్కరించేందుకు ఆయన కృషి చేశారు. బీజేపీ పాలన ప్రారంభమైన తర్వాత నాగాలాండ్‌లో మత పరమైన ప్రాబల్యం పెరుగుతోందంటూ అక్కడ అధికారంలో ఉన్న పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యేల్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిం చి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఏర్పాటు చేసింది.
నాగా ప్రజల భావోద్వేగాలను తెలుసు కోకుండా, ఉక్కుపాదంతో వారి ఆందోళనను అణచివేయడం కోసం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించడం,సాయుధ దళాల చట్టాన్ని బలవంతంగా రుద్దడం ప్రస్తుత ఆందోళనలకు కారణం. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు బలవంతంగా తమ సహజ వనరులను దోచుకోవడాన్ని కూడా నాగాలు వ్యతిరేకిస్తున్నారు..ఇటువంటి సున్నితమైన సమస్యను సామరస్య పూర్వక వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించాల్సింది పోయి కేంద్రం బలప్రయోగం చేస్తోందని ఆ ప్రాంతానికి చెందిన హక్కుల నాయకులు ఆరోపిస్తున్నారు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ప్రజాస్వామ్య వ్యతిరేకమని హక్కుల సంఘాలు చాలా కాలంగా వాదిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. కాశ్మీర్‌లో కూడా ఈ చట్టాన్ని ప్రజాస్వామ్య వాదులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. యూపీఏ హయాంలో కూడా ఇలాంటి ప్రదర్శనలు జరిగాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital