పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ అధికారాన్నిచేపట్టి ఇంకా నెలరోజులు కాలేదు. అప్పుడే తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇది అంతర్గత సమస్య కాదు. పాకిస్తాన్‌ను సమర్ధిస్తున్న చైనాకి ఆగ్రహాన్ని కలిగించే సమస్య. బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కోసం చాలా కాలంగా ఆందోళన సాగుతోంది. బలూచిస్తాన్‌లో చైనా పెట్టుబడులకు పూర్వపు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎడాపెడా అనుమతులు ఇచ్చేశారు. పాక్ ఆస్తులను చైనాకు ధారా దత్తం చేయడం అంతకుముందే ప్రారంభమైంది. ఇమ్రాన్ పగ్గాలు చేపట్టిన తర్వాత మరింత ఎక్కువైంది. సహజవనరులు ఎక్కడ కనిపించినా కొల్లగొట్టుకుని పోవడం చైనా ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం ఈ విధానంతో పొరుగుదేశాల వనరులను, ఆస్తులను కబ్జా చేయడాన్ని చైనా చాలా కాలం క్రితమే ప్రారంభించింది. శ్రీలంకలో కొలంబో సమీపంలోని హంబటన్ రేవు ఆధునీకరణకు రుణాలివ్వడం పేరిట ఆ రేవుపై పూర్తి హక్కులను చైనా చేజిక్కించుకుంది. అదే మాదిరిగా బలూచిస్తాన్‌లో గ్వాదర్ నౌకాశ్రయాన్ని నిర్మిస్తామనే సాకుతో ఆ చుట్టు పక్కల ప్రాంతాలన్నింటినీ చైనా ఆక్రమించుకుంది. అక్కడ అమూల్యమైన సహజ వనరులు, ఖనిజాలు ఉన్నాయి. తమ ప్రాంతానికి చెందిన సహజవనరులను చైనా దోచుకుని పోవడాన్ని బలూచి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
తమ ప్రాంతంలో గనులు, బభూములను చౖైెనాకు లీజుకిచ్చే అధికారం ఇమ్రాన్‌కి ఎవరిచ్చారంటూ వారు కొద్ది రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. చైనా నుంచి భారీగా రుణాలు, ఇతర ఆర్థిక సాయం పొందుతున్నందున చైనా ఆక్రమణ వైఖరికి ఇమ్రాన్ అడ్డు చెప్పలేకపోయారు. బలూచ్ ఉద్యమం ఇమ్రాన్ అధికారంలో ఉన్నప్పుడే ప్రారంభమైంది. అది ఇప్పుడు మరింత ఉధృతమైంది. ఈ ఉద్యమానికి చెందిన వారు ఆందోళన పద్ధతులను మార్చారు. చైనాపై తమకున్న కసిని ఆచరణలో చూపించేందుకు కరాచీ యూనివర్శిటీలో కన్‌ఫ్యూషియస్ సెంటర్‌లో అధ్యయనం చేస్తున్న చైనీస్ విద్యార్దినులను లక్ష్యంగా చేసుకుని ఆ కేంద్రంపై మానవబాంబు దాడి చేసింది. ఆ మానవ బాంబు ఎవరో కాదు, బలూచి లిబరేషన్ ఆర్మీకి చెందిన షేరా బలూచి. ఆమె భర్త వైద్యుడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమెఅదే యూనియవర్శిటీ నుంచి బాటనీలో పట్టా పొంది, ఎంఫిల్ చేస్తున్నారు. ఆమె ఇంతటి ఘాతుకానికి ఒడిగడుతుందని ఎవరూ ఊహించలేదు. ఆమె చర్య కారణంగా ఇప్పుడు పాక్‌పై చైనా అగ్గిమీద గుగ్గిలం అయింది. చైనాని సముదాయించలేక పాక్ ప్రభుత్వం నానా అవస్థలు పడుతోంది. ఈ ఘటనపై చైనా విదేశాంగ శాఖ వ్యాఖ్యానిస్తూ అంతకు అంత బదులు తీర్చుకుంటామని హెచ్చరించింది. బలూచి ప్రాంత ప్రజలు పాక్ ఫెడరల్ ప్రభుత్వంపై కొద్ది మాసాలనుంచి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తమ ప్రాంతానికి పాక్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందనీ, అందుకే, ప్రత్యేక బలూచి ఉద్యమాన్ని ప్రారంభించామని వారు చెబుతున్నారు. తమ ఆందోళన వేర్పాటు ఉద్యమానికి దారి తీయడానికి పాక్ ఫెడరల్ ప్రభుత్వ వైఖరే కారణమని స్పష్టం చేస్తున్నారు.అంతేకాక, చైనాలోని వీగర్ ముస్లింలపై అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న దమననీతికి వ్యతిరేకంగా ఆందోళన సాగిస్తున్నామని వారు చెబుతున్నారు. బలూచ్‌లో చైనా పెట్టుబడులనూ, నిర్మాణాలను వ్యతి రేకిస్తూ నిర్మాణ ప్రదేశాల వద్ద ఆందోళనలు సాగిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం కాశ్మీర్‌లో స్వయం పాలన ఆందోళనను సమర్ధిస్తూ బలూచిలోఅదే తరహా ఉద్య మాన్ని అణచివేయాలని చూడటం పాక్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వారు ఆరోపిస్తున్నారు. బలూచి ఉద్యమ ప్రకంపనలు ఐక్యరాజ్య సమితిలో కూడా కనిపించాయి. అక్కడ కూడ జనరల్ అసెంబ్లి సమావేశాలు, భద్రతా మండలిసమావేశాలు జరుగుతున్న సమయంలో బలూచీ ఆందోళనకారులు ప్లకార్డులతో ఆందోళనలను నిర్వహించారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ పోరాటానికి భారత్ మద్దతు కోరడంతో పాక్ నాయకులు ఎదురుదాడి ప్రారంభించారు.
బలచి ఉద్యమాన్ని భారత్ ప్రోత్సహిస్తోందని ఆరోపించడం గమనార్హం. అయితే, బలూచి ఉద్యమకారులకు చైనాపైనే ఎక్కువ ఆగ్రహం ఉంది. గ్వాదర్ రేవు నిర్మాణం పేరిట ఆ ప్రాంతంలో చైనా విస్తరణ కార్యకలాపాలకు పాక్ ఫెడరల్ ప్రభుత్వం అండగా నిలుస్తోందనీ, చైనా నుంచి వచ్చిన నిధులను ఇందుకోసం వినియోగిస్తోందని బలూచి ఆందోళన కారులు ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ ఒకప్పుడు తమ సహాయ సహకారాలు పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తున్నారు. బలూచి లిబరేషన్ ఆర్మీలో గూడు కట్టుకున్న ఆగ్రహావేశాలకు ప్రతిరూపం షారా బలూచి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..