Tuesday, November 26, 2024

నేటి సంపాద‌కీయం – అంతా ‘హస్త’వ్యస్థం!

ఐదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలతో సరిపోలి ఉన్నాయి. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. కానీ, 60 సీట్లు తగ్గాయి. అయితే, ఓట్లు ఐదు శాతం పెరిగాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆకర్షణ శక్తి చెక్కు చెదరలేదని కమలనాథులు చెప్పుకుంటున్నా, ప్రతిపక్షాల అనైక్యత, దీటైన నాయకతం లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రజలు బీజేపీకే పట్టం కట్టారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ అధికారాన్ని కోల్పోవడం ఆ పార్టీ సయం కృతం. ఈ ఐదు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఎక్కడా కూడా కాంగ్రెస్‌ ఓట్లూ, సీట్లూ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయి మరింత కునారిల్లడానికి కారణం పార్టీనాయకులనూ, కార్యకర్తలను ఉత్సాహ పర్చే శక్తివంతమైన నాయకతం లేకపోవడమే. అయినా ఆ పార్టీ ఇప్పటికీ గాంధీ కుటుంబంపైనే ఆధారపడి ఉంది. ఆ కుటుంబ వారసుడైన రాహుల్‌ గాంధీ పార్టీని నడిపించలేకపోతున్నారు. ఆయనకు సయంప్రకాశశక్తి లేదు. ఆ పార్టీలో ఇప్పటికీ సమర్ధులైన వారు ఉన్నారు. సరైన ప్రోత్సాహం లేకవారు గత్యంతరం లేక ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎంతో కాలం అధికారంలో ఉన్న ఆ పార్టీకి ఈసారి ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలే రావడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది.

ఉత్తరప్రదేశ్‌లో ఈసారి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రే ఎంతో శ్రమించి ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. ఉత్తరా ఖండ్‌, గోవా, మణిపూర్‌లలో రెండో స్థానంలో ఉన్నా ఆ పార్టీ టికెట్‌పై నెగ్గిన ఎమ్మెల్యేలు గతంలో మాదిరిగా బీజేపీలోకి ఫిరాయించరన్న గ్యారంటీ లేదు. ఉత్తరప్రదేశ్‌ లో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ గత ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఆయనను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఈసారి యోగీ గోరఖ్‌పూర్‌ నుంచి అసెంబ్లికి ఎన్నిక్యయారు. ఆయన ఐదేళ్ళూ అధికారంలో కొనసాగడం మోడీ చలవే. ఇకపైన కూడా మోడీ నమ్మకస్తునిగానే ఆ పదవిలో కొనసాగవచ్చు. ఉత్తరప్రదేశ్‌లో ఓట్ల సంఖ్య‌, స్థానాల సంఖ్య మాత్రమే కాదు, విస్తీర్ణం కూడా ఎక్కువే. కేంద్రం అండ వల్లే ముఖ్యంగా మోడీ ప్రత్యక్ష పర్యవేక్షణ వల్లే అక్కడ బీజేపీ మరోసారి వరుసగా అధికారంలోకి వచ్చింది. తమది డబుల్‌ ఇంజన్‌ పాలన అని మోడీ అన్నట్టు ఇది డబుల్‌ ఇంజన్‌ విజయమనడంలో అతిశయోక్తి లేదు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ ఓటమి స్వయం కృతమైతే, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఘనవిజయం ఆ పార్టీ సారథి, ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్వయం కృషి. కేజ్రీవాల్‌ హర్యానాకి చెందిన వారు. పొరుగు రాష్ట్రమైన పంజాబ్‌పై ఆయన ఎంతో కాలంగా దృష్టి పెట్టారు. అకాలీదళ్‌కి ఒకప్పుడు పెట్టని కోటగా ఉన్న పంజాబ్‌లో అకాలీదళ్‌ కురువృద్ధుడు, మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, ఆయన కుమారుడు సుఖబీర్‌ సింగ్‌ బాదల్‌, ప్రస్తుత ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు చరణ్‌జిత్‌ చన్నీ, మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోతి సింగ్‌ సిద్ధూ వంటి అతిరథ, మహారథులంతా చీపురు (ఆప్‌ గుర్తు) సునామీలో కొట్టుకుని పోయారు. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన సినీనటుడు సోనూసూద్‌ సోదరి మాళవిక సూద్‌ కూడా ఓటమి పాలయ్యారు.

చేతికి ఎముక లేకుండా ఎంతో మందికి సాయం అందిస్తున్న సోనూసూద్‌ ప్రతిష్టపై ఆధారపడి ఆమె కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేశారు. పంజాబ్‌ ఎన్నికలకు కొద్ది నెలల ముందు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ని ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికి కాంగ్రెస్‌ అధిష్టానవర్గం మాజీ క్రికెటర్‌ సిద్ధూని ఆయనపై ఉసిగొల్పుడం, ఎంతో మంది సీనియర్‌ నాయకులను కాదని సిద్ధూని పీసీసీ అధ్యక్షునిగా చేయడం, అమరీం దర్‌సింగ్‌, సిద్ధూల మధ్య విమర్శ, ప్రతివిమర్శలు కాంగ్రెస్‌ కొంపముంచాయి. అలాగే, ఉత్తరాఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌కు వ్యతిరేకంగా ప్రత్యర్ధి వర్గం పని చేయడం వల్లనే ఆయన ఓటమి పాల య్యారు. గోవాలో బీజేపీ దివంగత నేత, మాజీ రక్షణ మంత్రి మనోహర్‌ పరీకర్‌ కుమారునికి బీజేపీ టికెట్‌ ఇవ్వకపోవడమే కాకుండా ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఆయనను ముఖ్యమంత్రి సావంత్‌ ఓడించారు. కాంగ్రెస్‌ తరహా వెన్నుపోట్లు, అసమ్మతి రాజకీయాలు బీజేపీలోనూ ప్రవేశించాయి. ఉత్తరప్రదేశ్‌లో సీట్లు తగ్గడానికి అదే కారణం. మొత్తం మీద ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఆపార్టీ నిలబెట్టే అభ్యర్ధికే విజయం సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్షాలను మోడీ బలహీన పర్చారన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి ప్రధానమంత్రి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలు బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement