దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ, యూపీ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు సమాజ్‌వాదీ పార్టీ హోరాహోరీ గా ఇప్పటి నుంచే తలపడుతున్నాయి. కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు నిర్ణయించుకుంది. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీకే తిరిగి అధికార మని కమలనాథులు ధీమాగా చెబుతున్నప్పటికీ, రాష్ట్రంలో పరిస్థితులు అందుకు భిన్నం గా ఉన్నాయి. లఖింపూర్ ఖేర్‌లో అక్టోబర్‌లో రైతులపై వాహనాలను నడిపించిన సంఘట నలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిస్ మిశ్రాదే ప్రధానపాత్ర అని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ధారించింది. రైతుల ఆందోళన ముగిసింది. కేంద్రానికీ,రైతు సంఘాలకూ మధ్య ఒప్పందం కుదిరింది. అయితే, సుదీర్ఘ కాలం ఆందోళన జరిపిన రైతులు ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ప్రదర్శన రక్తసిక్తం కావడం,ఇందులో కేంద్ర మంత్రి కుమారుని ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు రావడం తో అధికార పార్టీ బీజేపీ ఇరుకున పడింది. ప్రతిపక్షాల ఆందోళన కారణంగా ఏర్పడిన సిట్ నివేదిక బీజేపీని ఆత్మరక్షణలో పడేసింది. ఈ ఘటనలో నిందితులు పథకం ప్రకారం రైతులపై దాడి చేసినట్టు సిట్ నిర్ధారిం చింది.
ఈ అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకునేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతు న్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి సిట్ నివేదిక రాజకీయ ప్రేరేపితమైనదేనని కమలనాథులు పేర్కొంటున్నారు. ఈ ఆరోపణలను ప్రతిపక్షాలు తోసిపుచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి యోగీకి వ్యతిరేకంగా ఉందనీ, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేం దుకే ప్రభుత్వ అనుకూల సర్వే నివేదికను విడదల చేయించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎన్నికల ముందు సహజమే. వేటినీ కొట్టి వేయలేం. అయితే,లఖింపూర్ ఖేరీ ఘటనలో వీడియో సాక్ష్యాలు ఆధారంగా ఆశిస్ మిశ్రాను ప్రధాన నిందితునిగా సిట్ నిర్ధారించింది. ఈ కేసునుంచి బయటపడేందుకు కేంద్ర మంత్రిగా ఉన్న తన తండ్రి అజయ్ మిశ్రా అధికారాన్ని అతడు వినియోగించుకుంటున్నాడనీ, ఈ కేసులో అసలు నిందితులకు శిక్షలు పడేట్టు చూడాలంటే అజయ్ మిశ్రాని మంత్రి వర్గం నుంచి తప్పించాలని సమాజ్ వాదీ పార్టీ డిమాండ్ చేస్తోంది.
ఈ విషయమై మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ చాలా పట్టుదలతో ఉన్నారు. ప్రచారంలో, ప్రజలను ఆకట్టుకోవడంలో ముందున్న సమాజ్‌వాదీ పార్టీని ఎదుర్కొనేందుకు బీజేపీ తన అస్త్రాలన్నింటినీ సిద్ధం చేసింది. సరయూ కారిడార్, కాశీలో కాశీవిశ్వనాథ్ నడవా వంటి ప్రాజెక్టుల ప్రారంభానికి ప్రధానమంత్రి మోడీని ఆహ్వానించ డం బీజేపీ ప్రచారవ్యూహంలో భాగమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.మోడీ వారణాసి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాట నిజమే అయినప్పటికీ, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధానమంత్రి యూపీలో రెండురోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం,పనిలోపనిగా బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించడం బీజేపీ ఎన్నికల వ్యూహంలో భాగమేనని అంటున్నారు.
లఖింపూర్ ఖేరీ ఘటన దర్యాప్తులో జాప్యం పట్ల సుప్రీంకోర్టు ఇటీవల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆ తర్వాతే ఈ ఘటనపై సిట్ నివేదికను బహిర్గతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నాల్గేళ్ళ క్రితం బీజేపీ ఎమ్మెల్యే కుల్దిdప్ సింగ్ సెనగార్‌కి ప్రమేయం ఉన్న ఉన్నావో హత్యాచారం కేసును నీరు గార్చేందుకు యోగీ ప్రభుత్వం నీరు గార్చిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ లఖింపూర్ ఖేర్ సంఘటనలో నిందితులు తప్పించుకోకుండా చూడాలని ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కుల్దిప్ సింగ్ సెనగార్‌ని హత్యాచారం కేసు నుంచి తప్పించేందుకు యోగీ ప్రభుత్వం చివరి వరకూ ప్రయత్నించినట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి. అలాగే, గత ఏడాది సెప్టెంబర్‌లో హత్రాస్ జిల్లాలో ఒక దళితయువతిపై జరిగిన హత్యాచారం సంఘటనలో నిందితులను రక్షించేందుకు యోగీ ఆదేశాల మేరకు పోలీసు లు ప్రయత్నించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ రెండు సంఘటనలే కాకుండా యోగీ పాలనలో పోలీసుల అత్యుత్సాహానికి నిదర్శనాలు ఎన్నో.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital