ప్రభన్యూస్: మరణ దండన శిక్ష విధించబడి పాక్ జైలులో మగ్గుతున్న కులభూషణ్ జాదవ్ అనే భారత మాజీ నేవీ అధికారి తిరిగి అప్పీలు చేసుకునేందుకు పాక్ అంగీకరించింది. ఇందుకు సంబంధించిన చట్టాన్ని సవరించింది. ఇది దౌత్య పరంగా భారత్ సాగించిన సంప్రదింపులకు ఘనవిజయం. రహస్య గూఢచర్యం చేశారన్న ఆరోపణలకు గురై పాక్ చెరలో మగ్గుతున్నవారంతా అమాయకులే. ఎంతో మంది మత్స్యకారులు, చిన్న వ్యాపారులు పాక్ జైళ్ళలో ఉన్నారు. వీరందరినీ విడిపించేందుకు మన ప్రభుత్వం దౌత్య ప్రయత్నాలు చేయడం, ఏళ్ళ తరబడి అవి సాగడం, చివరికి ఏవేవో సాకులతో వారి నిర్బంధాన్ని పాక్ సైనికులు కొనసాగించడం మామూలే. అలాంటి వారిలో ఒకరిగా ఐదేళ్ళ క్రితం పట్టుబడిన కులభూషణ్ జాదవ్ పై దేశద్రోహ నేరాన్ని మోపి, మిలటరీ కోర్టు చేత హడావుడిగా విచారణ జరిపించారు. పాక్ మిలటరీ కోర్టు అతడికి మరణ శిక్షవిధించింది. ఈ కేసులో తన తరఫున న్యాయవాదిని నియమించుకోవడానికి అతడికి పాక్ సైనికాధికారులు అనుమతి ఇవ్వలేదు. అంతేకాకుండా అతడి కుటుంబ సభ్యులెవరూ కలవకుండా ఆంక్షలు విధించారు. అతడికోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన బంధువులు, మిత్రులు పెదవి విరిచారు.
నౌకాదళంలో పదవీ విరమణ చేసిన కులభూషణ్ జాదవ్ వ్యాపార పనుల నిమిత్తం ఇరాన్ వెళ్ళినప్పుడు పాక్ గూఢ చారులు కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళారు. అతడు పాక్ సమాచారాన్ని సేకరించి ఇరాన్‌కి అందిస్తున్నాడంటూ అభియోగం మోపారు. అతడిపై విచారణ జరిపిన పాక్ సైనిక కోర్టు మరణ శిక్ష విధించింది. అంతేకాక, జాదవ్‌కి భారత్ అందిస్తానన్న న్యాయ పరమైన సాయాన్ని పాక్ ప్రభుత్వం నిరాకరించడం జెనీవా ఒప్పందంలోని 36వ అధి కరణాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేయడం పాక్ ప్రభుత్వాన్ని అభిశంసించడమే. ముంబాయి దాడుల ఘటనలో పాల్గొని పట్టుబడిన కసబ్‌కి మన దేశం న్యాయ సహాయాన్ని అందించేందుకు ఒక న్యాయవాదిని నియమించింది.
ఏ వ్యక్తి అయినా పరాయిదేశంలో పట్టుబడి శిక్షకు గురైనప్పుడు అతడికి న్యాయసహాయం అందించేట్టు చూడటం అక్కడి ప్రభుత్వం బాధ్యత. అలా ఏర్పాటు చేయకపోతే అతడి కేసు పై జరిపే విచారణా, కోర్టు వెలువరించే తీర్పూ ఏకపక్షమే అవుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకే జెనీవా ఒప్పందంలో 36వ అధికరణం కింద నిందితునికి న్యాయసహాయం అందించాలని నిర్దేశించడం జరిగింది. కులభూషణ్ జాదవ్ పై పాక్ సైనికాధికారులు మోపిన అభియోగాలు చాలా పేలవంగా ఉన్నాయి. అయితే,అక్కడి సైనిక న్యాయస్థానం మాత్రం ఉరి శిక్ష విధించింది. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఈ కేసును తీసుకుని వెళ్ళాలన్న నిర్ణయం ప్రధాన మంత్రి నరేంద్రమోడీదే. అలాగే, జాదవ్ తరఫున సీనియర్ న్యాయవాదులు దీపక్ మిట్టల్, హరీష్ సాల్వేలు వాదించారు.
ఈ ధర్మాసనంలో మొత్తం16 మంది న్యాయమూర్తులుండగా, 15మంది జాదవ్ కు విధించిన ఉరిశిక్షను నిలిపి వేసి కేసును తిరిగి సమీక్షించాల్సిందిగా ఆదేశించారు. ఇది అరుదైన విషయం. జాదవ్ మాదిరిగానే పాక్ గూఢ చారులకు పట్టుబడి ఉరిశిక్షకు గురైనా సర్బజిత్ సింగ్ అనే పశువుల కాపరిని దౌత్య పరమైన ఒత్తిడి ద్వారా విడిపించేందుకు పూర్వపు యూపీఏ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆనాటి పాక్ అధ్యక్షుడు, సైనిక పాలకుడు పర్వేజ్ ముషార్రఫ్ వద్ద ఈ అంశాన్ని ఎన్నో సార్లు ప్రస్తావించారు. ముషార్రఫ్ నమ్మించి మోసం చేశారు. చివరికి జైలులో జరిగిన ఘర్షణల్లో సర్బజిత్ మరణించినట్టు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపధ్యంలో కులభూషణ్ జాదవ్‌కి మరణశిక్ష ఆగిపోయేట్టు చేయడం, ఇప్పుడు అప్పీలుకు అనుమతి లభించడం దౌత్య విజయం.