Thursday, November 21, 2024

నేటి సంపాద‌కీయం – భారత్‌పై అమెరికా బుసలు!

ఉక్రెయిన్‌, రష్యాల మధ్య యుద్ధం ప్రపంచంలోని వివిధ దేశాలకు విషమ పరీక్షను తెచ్చి పెట్టింది. ఈ యుద్ధంతో సంబంధం లేని దేశాలకు సమస్యలను సృష్టిస్తోంది. ఇందుకు మనదేశమే ఉదాహరణ. ఉక్రెయిన్‌, రష్యాల నుంచి మన దేశానికి వంటనూనెలు, ముడి చమురు దిగుమతి అవుతున్నాయి. ఈ రెండుదేశాల మధ్య యుద్దం కారణంగా వీటి దిగుమతులకు ఇబ్బం దులు ఏర్పడినప్పటికీ మన దేశం దౌత్యపరమైన కౌశలం తో వాటిని అధిగమిస్తోంది. అయితే, రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవడానికి వీలు లేదంటూ అమెరికా, ఆస్ట్రేలియాలు ఆదేశించడం మన సర్వసత్తాక ప్రతిపత్తిపై దాడి వంటిదే. సర్వసత్తాక ప్రతిపత్తి గల దేశానికి ఏ దేశంతో నైనా మైత్రి జరిపే హక్కు, వాణిజ్య సంబంధాలు నెరిపే హక్కు ఉంటాయి. అయితే, పెద్దన్న పాత్ర వహిస్తున్న అమెరికా ఈ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి భారత్‌ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడం, మీరనుసరిస్తున్న విధానం మీకు చేటు తెస్తుందంటూ హెచ్చరించడం వరకే సరిపెట్టింది. ఇప్పుడు మరింత ముందుకు వెళ్ళి, రష్యా నుంచి చమురు తెప్పించుకో వద్దనే వరకూ వెళ్ళింది. ముడి చమురు మాత్రమే రష్యా నుంచి భారత్‌ దిగుమతి చేసుకునేది. ఉక్రెయిన్‌ నుంచి వంట నూనెలు దిగుమతి చేసుకునేది.

ఉక్రెయిన్‌ ప్రస్తుతం సరఫరా చేయలేననడంతో వంటనూనెలను కూడా రష్యా నుంచే మన దేశం దిగుమతి చేసుకుంటోంది. దీనిపై భారత్‌పై అమెరికా మాత్రమే కాకుండా, ఆస్ట్రేలియా కూడా ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. రష్యాపై అమెరికా, దాని మిత్ర దేశాలు ఆంక్షలు విధించిన నేపధ్యంలో ఆ తీవ్రతను తగ్గించేందుకు రష్యాకు పరోక్షంగా భారత్‌ సాయం అందిస్తున్నాయని అమెరికా, ఆస్ట్రేలియాలు విమర్శించాయి. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్ళెం వేయడానికి అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, ఇండియాలు కలిసి క్వాడ్‌ కూటమిని ఏర్పాటు చేశాయి. క్వాడ్‌లో భారత్‌కి ఉన్న సభ్యత్వాన్ని అడ్డుపెట్టుకుని క్వాడ్‌లో ఇతర దేశాలైన ఆస్ట్రేలియా, జపాన్‌లు రష్యా పట్ల కఠిన వైఖరిని అనుసరించాలని ఒత్తిడి తెచ్చాయి. రష్యా నుంచి మన దేశం ఆయుధ సామగ్రినీ, ముడి చమురును దిగుమతి చేసుకుంటోందన్న విషయం అమెరికా, ఆస్ట్రేలియాలకు తెలుసు. అయినప్పటికీ రష్యాతో సంబంధాలను తెంచుకోవాలని ఒత్తిడి చేయడంలో ఈ రెండుదేశాల ఉద్దేశ్యం ఏమిటో బహిర్గతమవుతోంది. అమెరికాతో మన దేశానికి వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది.

అయితే, అది కూడా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ హయాంలో చైనాకు చెక్‌ పెట్టేందుకు ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని మన దేశం చేసుకుంది. ట్రంప్‌ హయాంలో ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులు చేసుకోవద్దని హెచ్చరించినా, దానిని భారత్‌ పాటించలేదు. ఇప్పుడు అమెరికా ప్రస్తుత అధ్యక్షు డు బిడెన్‌ అదే రీతిలో భారత్‌ని కట్టడి చేయాలనుకుంటున్నారు. మన దేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానానికి ఇది పరీక్షే. క్వాడ్‌ భాగస్వామ్య దేశాలు ఒకే మాటపై ఉండాలనీ, రష్యాపై అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు ఆంక్షలు విధించిన నేపధ్యంలో రష్యాతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోరాదన్న నియమానికి భారత్‌ కట్టుబడి ఉండటం లేదని అమెరికా వాణిజ్య మంత్రి గినా రైమాండో అన్నారు. ఆమెతో పాటు వాషింగ్టన్‌లో విలేఖరుల సమావేశంలో పాల్గొన్న ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్‌ టెహన్‌ ప్రజాస్వామ్య దేశాలు నిబంధనల ఆధారిత విధానాల అమలుకు కలిసి పని చేయాలని అన్నారు. భారత్‌పై హుకుం జారీ చేసే అధికారం అమెరికా, ఆస్ట్రేలియాలకు లేదు.

మన విదేశాంగ విధానం పారదర్శకమైనది.ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో సైతం మన విదేశాంగ విధానాన్ని ఏ ఒక్క దేశమూ తప్పుపట్ట లేదు. అమెరికా అధ్యక్షుడు బిడెన్‌ రష్యాను నిలువరించ డంలో విఫలమయ్యారు. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కి పెద్ద ఎత్తున ఆయుధ, ఆర్థిక సాయాన్ని అందించారు. అవేమీ పని చేయకపోవడంతో రష్యాతో వాణిజ్య సంబంధాలున్న దేశాలపై విరుచుకుని పడుతున్నారు. గతంలో అమెరికా అధ్యక్షులు ఎవరూ ఇటువంటి విధానాన్ని అనుసరించలేదు. మరో వైపు చైనాతో మెతక వైఖరిని అనుసరిస్తున్నారు. అసలు ఈ సంక్షోభాలన్నింటికీ చైనా వైఖరే కారణమన్న సంగతిని మరిచిపోతున్నారు. అమెరికా ఉడత ఊపులకు భారత్‌ బెదరదు. ఇందుకు తగినవిధంగానే నడుచుకుంటుంది. ఆంక్షలకు లోబడి రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటే అభ్యంతరం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఇంతవరకూ భారత్‌ దిగుమతి చేసుకున్న చమురు చాలని అమెరికా పేర్కొంటోంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ భారత్‌లో పర్యటన సందర్భంగా పలు ఒప్పందాలపై సంతకాలు చేసుకోవచ్చన్న వార్తల నేపధ్యంలో అమెరికా ఈ హెచ్చరిక చేసి ఉండవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement