ఐదు రాష్ట్రాల్లో వచ్చే నెలలో అసెంబ్లి ఎన్నికలకు నగారా మోగి నాలుగు రోజులైనా కాలేదు, ఈ ఐదింటిలోని ఉత్తరప్రదేశ్, గోవాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి దెబ్బతగిలింది. ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీకి ఇద్దరు మంత్రులు, వారి అనుచరులు బీజేపీకి రాజీనామా చేశారు. వీరిలో ఉత్తరప్రదేశ్‌లో మంత్రిగా ఇంతవరకూ వ్యవహరించిన స్వామి ప్రసాద్ మౌర్య ఇతర వెనకబడిన తరగతుల (ఓబీసీ) నాయకుడు. ఆయన తోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. మౌర్య చాలా కాలం బహుజన సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) లో రెండవ స్థానంలో ఉండేవారు. పార్టీ అధినేత్రి మాయావతితో విభేదించి బీజేపీలో చేరారు. ఆయన సమాజ్‌వాదీ పార్టీలో చేరడం బీజేపీకి గట్టి దెబ్బేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మౌర్య పూర్వాంచల్‌లోని పద్రౌనా నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. ఓబీసీ వర్గాల్లో ఆయనకు గట్టి పట్టు ఉంది. ఆయన యోగీ ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా ఇంతవరకూ వ్యవహరించారు. ఆయన కుమార్తె సంఘమిత్ర బదౌనా నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్వామీ ప్రసాద్ మౌర్య తన నిర్ణయం ఆకస్మికం కాదన్నారు.
నిరుద్యోగులు, యువతకు ఉపాధి కల్పించే పథకాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి యోగీతో అనేక సార్లు మొరపెట్టుకున్నాననీ, అయితే, యోగీ బీజేపీ అజెండా అమలుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. బీజేపీ సిద్ధాంతాలు తనకు సరిపడ కపోయినా, గత ఎన్నికల ముందు యోగీ ఇచ్చిన హామీలను పురస్కరించు కుని బీజేపీలో చేరానని స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు. బీజేపీ అజెండా పేదల అజెండా కాదని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ మసూద్ కూడా పార్టీకి రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీలో చేరేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో ఆయన ఇప్పటికే చర్చలు జరిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రకటనలే ఈ పరిణామాలకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. హిందువులంతా తమ పార్టీ వైపే ఉన్నారని అన్యాపదేశంగా పేర్కొంటూ సమాజంలో 80 శాతం ప్రజల ఓట్లు తమకే పడతాయంటూ యోగీ చేసిన వ్యాఖ్య ప్రతికూల పరిణామాలకు దారితీస్తోంది. అంతేకాకుండా హిందువులు సంఘటితమవుతున్నారనీ, ముస్లింలు, ఇతర మతాల వారు ఏకాకులు కావడం ఖాయమంటూ ఆయన ప్రకటించి ఇతర వర్గాల వారి ఆగ్రహానికి గురి అయ్యారు.
రాష్ట్రంలో అభ్యర్ధుల ఎంపిక గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర నాయకులతో చర్చలు జరుపుతున్న తరుణంలోనే ఈ రాజీనామాలు కలకలాన్ని సృష్టించాయి. గోవాలో కూడా ఇదే మాదిరి పరిస్థితి నెలకొంది. అక్కడ మనోహర్ పారికర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ నాయకులకు గౌరవం ఉండేదనీ,ఇప్పుడు బీజేపీ నాయకులను ఎవరూ పట్టించుకోవడం లేదని బీజేపీకి రాజీనామా చేసిన మైకేల్ లోబో వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో విభేదించి మంత్రి పదవికీ, ఎమ్మెల్యే పదవికీ ఆయన రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరేదీ తానింకా నిర్ణయించుకోలేదని ఆయన చెప్పారు. మొత్తం మీద యూపీ, గోవా పరిణామా లు కేంద్రంలో కమలనాథులకు కలవరాన్ని సృష్టించినవేనని చెప్పవచ్చు. ఇటీవల వెల్లడైన సర్వేఫలితాల్లో ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకే తిరిగి అధికారమన్న సమాచారం కమలనాథులు ఉబ్బితబ్బిబ్బయ్యేట్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, యూపీలో వారణాసి నియోజక వర్గానికి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ మెప్పుకోసం స్థానిక నాయకులు సృష్టిస్తున్న నినాదాలు అతిగా ఉంటున్నాయి. హరహర మోడీ, ఘర్ ఘర్ మోడీ అనే నినాదం స్థానికుల భావోద్వేగాలకు వ్యతిరేకంగా ఉందనీ, శివుని ఆరాధనకు సంకేతంగా ఉపయోగించే నినాదాలను మోడికి వర్తింపజేయడం అపచారమని మహంతలు కొందరు ఆక్షేపణ తెలుపుతున్నారు. మోడీ అంటే తమకు గౌరవమేననీ ,పరమ శివునితో ఆయనను సమానంగా కీర్తించరాదన్నది వారి అభిప్రాయం. మోడీ చుటూ చేరిన భజన పరులే ఇలాంటి అతిధోరణులను సృష్టిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital