Saturday, November 23, 2024

నేటి సంపాదకీయం-నాగాలో ఓ కొత్త పాఠం!

ప్ర‌భ‌న్యూస్ : నాగాలాండ్‌ ఇటీవల చాలా తరచుగా వార్తల్లోకి ఎక్కుతోంది. ఆ మాటకొస్తే, ఈశాన్య రాష్ట్రాల పరిస్థితీ అలాగే ఉందనిపిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతిని సృష్టించడానికి పొరుగుదేశమైన మయన్మార్‌ కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. మణిపూర్‌లో కిందటి నెల తీవ్రవాదుల ప్రమేయం ఉన్న సంఘటనకూ, నాగాలాండ్‌లో తాజా సంఘటనకు మయన్మార్‌ తీవ్రవాదుల ప్రోద్బలమే కారణమని తెలుస్తోంది. అసోం రైఫిల్స్‌ దళానికి చెందిన కమాండింగ్‌ అధికారి కుటుంబ సభ్యులతో కారులో వెళ్తుండగా, మణిపూర్‌లోని చుర్‌ చందాపూర్‌లో తీవ్రవాదులు మందుపాతర పేల్చిహత్య చేశారు. ఆ తర్వాత అక్కడ తీవ్రవాదుల కోసం సైనికుల గాలింపును ముమ్మరం చేశారు. అదేమాదిరిగా నాగాలాండ్‌లో తీవ్రవాదుల కోసం వేట తీవ్రం చేశారు. వేగంగా వెళ్తున్న ఒక వాహనాన్ని ఆపమని ఎన్ని సార్లు హెచ్చరించినా ఆపకపోవడంతో కాల్పులు జరిపారు. ఆ వాహనంలో ఆరుగురు పౌరులుఉన్నారు. దాంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల పౌరులు గుమిగూడి సైనికులపై దాడి చేశారు. ఒక జవాన్‌ మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన పొరపాటున జరిగిందనీ, ఇందుకు చింతిస్తున్నామని హోంమంత్రి అమిత్‌ షా పార్లమెంటులో ప్రకటించారు.

దీనిని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఒక అస్త్రంగా వాడుకుంటున్నాయి. ఆ ప్రాంతానికి కాంగ్రెస్‌ బృందం బయలుదేరుతోంది. నిజానికి నాగాలాండ్‌లో ఎప్పుడూ ఏదో ఒక హింసాత్మక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌లలో నివసించే నాగాలందరితో కలిసి నాగలిం అనే ప్రత్యేక రాష్ట్రం కోసం చాలాకాలంగా ఆందోళన సాగిస్తున్నారు. నాగా తీవ్రవాదులు పొరుగున ఉన్న మయన్మార్‌ సరిహద్దు జిల్లాల్లో శిబిరాలను ఏర్పాటు చేసుకుని కొత్తగా యువకులకు సాయుధ శిక్షణ ఇస్తున్నారు. నాగాలాండ్‌ స్వయం ప్రతిపత్తికి కేంద్రం అంగీక రించలేదన్న కోపంతో వారు చాలా కాలంగా ప్రతీకారం తీర్చుకునేందుకు సాయుధ ఘర్షణ లకు దారితీసే హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. దాంతో కేంద్రం ఆ రాష్ట్రానికి కేంద్ర బలగాలను పంపింది. పౌరులపై కాల్పుల సంఘటన తీవ్రమైనదే. అయితే, సాయుధ దళాల హెచ్చరికలను లెక్క చేయకుండా అందులో ఉన్నవారు వేగంగా వాహనాన్ని నడపడం ఈ మొత్తం సంఘటనకు మూలహేతువు.. పైగా, ఆ వాహనంలో ఉన్నవారుకాల్పులు జరపడంతో సాయుధ దళాలకు మరింత అనుమానం వచ్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. ఈ సంఘటనపై ఆయన లోక్‌సభలో ప్రకటన చేశారు.

సరిహద్దు ప్రాంతాల్లో భద్రతకు మోడీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. కాశ్మీర్‌ విభజన తర్వాత కాశ్మీర్‌లోకి అక్రమంగా ప్రవేశించేవారిపై కఠినంగా వ్యవహరించాలని భద్రతా దళాలకు ఆదేశాలు జారీ చేసింది. అనుమానం వచ్చిన వారిని వెంటాడి అరెస్టు చేయడం, అవసరమైతే కాల్పులు జరపేందుకు జవాన్లకు అధికారాలిస్తున్నట్టు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. నాగా తీవ్రవాద నాయకులు విదేశాల్లో ఉంటూ స్థానిక కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. విదేశాల నుంచి ఆయుధాలు సరఫరా అయ్యేట్టు చేస్తుంటారు. మయన్మార్‌ పొరుగుదేశం కావడంతో నాగా తీవ్రవాదులకు మయన్మార్‌ నుంచే ఆయుధాలు అందుతున్నట్టు భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి.

అంతేకాకుండా నాగా తీవ్రవాదులు మయన్మార్‌లోని తిరుగుబాటుదారులతో సంబంధాలు పెంచుకుని భారత్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు, హింసను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారన్న సమాచా రం కేంద్రానికి అందింది. దాంతో ఆ రాష్ట్రంలో అదనపు దళాల సాయంతో భద్రతాదళాలు గాలింపును మరింతపెంచారు. కాశ్మీర్‌లో సాయుధ దళాలకు మరిన్ని అధికారాలివ్వడం తో ఈశాన్య రాష్ట్రాల్లోని అసోం రైఫిల్స్‌ దళాలకు కూడా హెచ్చు అధికారాలు లభించాయి. దీనిని నాగాలు,ఈశాన్య రాష్ట్రాల్లోని ఇతర తీవ్రవాదులు వ్యతిరేకిస్తున్నారు.ఈ సంఘటన తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లో సాయుధ దళాలు మరింతగా గాలింపును జరుపుతున్నాయి. నాగాలాండ్‌ కాల్పులపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌ను) ఏర్పాటు చేస్తున్నట్టు అమిత్‌ షా ప్రకటించారు. సరిహద్దు రాష్ట్రాలలో శాంతిభద్రతల అంశం సున్నితమైన అంశం. దానిపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement