Tuesday, November 19, 2024

నేటి సంపాదకీయం–శుభ సూచకం!

ప్ర‌భ‌న్యూస్: బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండి బకాయిలను వసూలు చేయడానికి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తాజాగా చేసిన ప్రకటన బ్యాంకుల పరిస్థితిపై ఆశాజనకమైన పరిస్థితికి అద్దం పడుతోంది. నిజానికి బ్యాంకులను నిండా ముంచేసిన ఆర్థిక నేరగాళ్ళు ప్రస్తుతం మన దేశంలో లేరు. నల్లధనాన్ని వెలికితీస్తామనీ, విదేశీ బ్యాంకుల్లో మన వాళ్ళు దాచుకున్న కోట్లాది రూపాయిల నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోయిన మోడీ దేశంలో నల్లధనం గుట్టలు తవ్వేందుకే పెద్ద నోట్ల కరెన్సీని రద్దు చేశారు. ఆ ప్రయోగం ఫలించలేదు సరికదా పేదలను మరింత నిరుపేదలుగాచేసింది. నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటన ప్రకారం ఎగవేతదారుల ముక్కు పిండి మొండి బకాయిలను వసూలు చేసేందు కు తమ ప్రభుత్వం ఫోర్‌ ఆర్‌ (4-ఆర్‌) విధానాన్ని అనుసరిస్తోందని ఆమె చెప్పారు. ఎగవేత దారులు ఎక్కడ దాగి ఉన్నా వారిని గుర్తించడం (రికగ్నషన్‌),రిజల్యూషన్‌,రీ క్యాపిట లైజేషన్‌, రిఫార్మ్‌స్‌ విధానంతో ముందుకు వెళ్తున్నామని ఆమె వెల్లడించారు.

అయితే, ఎగవేతదారులు ఎక్కడ ఉన్నారో మీడియా ద్వారా ముఖ్యంగా, టెలివిజన్‌ చానల్స్‌ ద్వారాతెలుస్తూనే ఉంది. అలాగే,దేశంలో ఉన్న ఎగవేతదారులు ఎవరో అందరికీ తెలుసు. అలాంటప్పుడు వారిని గుర్తించేందుకు పెద్దగా తలపట్టుకోనవసరం లేదు. ఎగవేత దారులలో అధిక సంఖ్యాకులు కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలలోనే ఎక్కువగా ఉన్నారని ఎడిఆర్‌ సర్వేలో వెల్లడైంది. ఈ విషయం ప్రధానమంత్రికి సైతం తెలుసు.కొద్ది రోజుల క్రితం ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ విదేశాల్లో తలదాచు కున్న ఎగవేతదారుల పేర్లు కూడా బహిరంగంగా ప్రకటించారు. వీరు అక్కడ చట్టాలు కల్పిస్తున్న రక్షణ కారణంగా అరెస్టును తప్పించుకుంటున్నారని అన్నారు. అలాగే,మన దేశంలో కూడ ఎగవేతదారులు కోర్టుల్లో స్టేలద్వారా బయటపడగలుగుతున్నారు. వారిని అరెస్టు చేయడం కన్నా, వారి ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వానికి స్వాధీనం చేస్తేనే దేశానికి ఉపయోగం.

ఈ విషయంలో కూడా కేంద్ర ఆర్థిక శాఖ ఎన్‌ ఫోర్స్‌మెంటు డైరక్టరేట్‌ చురుకుగా పనిచేస్తోంది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లధనం గుట్టలు కరుగుతున్నాయన్న ఆర్థికమంత్రి ప్రకటనలో అత్యుక్తి లేదు. యూపీఏ హయాంలో కొత్తగా విద్యుత్‌ ప్రాజెక్టులు, కాలుష్య రహితమైన పర్యావరణ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు బ్యాంకులు భూరిగా రుణాలు ఇచ్చాయి. ఉత్తరాఖండ్‌లో విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మించేందు కు బ్యాంకుల నుంచి అనేక మందిరుణాలు తీసుకున్నారు. ఉత్తరాఖండ్‌ వరదల్లో ఆ ప్రాజెక్టు లకు భారీ నష్టం కలిగింది.అలాగే, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో బ్యాంకు రుణాలతో కట్టిన ప్రాజెక్టులు భారీ వర్షాలకు దెబ్బతినడం రుణాల వసూళ్ళలో జాప్యానికి కారణం కావచ్చు. అయితే, ఉద్దేశ్య పూర్వకంగా రుణాలను ఎగ్గొట్టే వారిపైన ప్రభుత్వం గట్టి నిఘా వేసిందనీ, వారి ఆస్తులను జప్తు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్థికమంత్రి చెప్పారు. బ్యాంకుల్లో ఇటీవల ప్రవేశపెట్టిన సంస్కరణలు పాతబకాయిల వసూళ్ళకు ఉపయోగ పడితే అంతకన్నా కావల్సిందేమీ లేదు.

బ్యాంకుల నిర్వహణ భారాన్ని తగ్గించేందుకు పెద్ద బ్యాంకుల్లో చిన్న బ్యాంకులను విలీనం చేసే కార్యక్రమాన్ని చేపట్టినట్టు మంత్రి చెప్పారు. కానీ, దీని వల్ల మేలు కన్నా నష్టాలే ఎక్కువ జరుగుతున్నాయి. దశాబ్దాలుగా ప్రజలకు నమ్మకమైన సేవలను అందిస్తున్న బ్యాంకులు కనుమరుగు అవుతున్నాయి. నిజానికి ఇవ న్నీ ఇప్పటికీ లాభాలతో నడుస్తున్నాయి.రిజర్వు బ్యాంకులోనూ, బ్యాంకింగ్‌ రంగంలోనూ అదనపు సిబ్బందిని తగ్గించడం ద్వారా సంస్కరణలను మరింత మెరుగైన రీతిలో అమలు జరపవచ్చని ఈ రంగానికి చెందిన నిపుణులే పేర్కొంటున్నారు. బకాయిల వసూళ్లకు రాజకీయ నాయకుల ఒత్తిడే అవరోధంగా నిలుస్తున్నాయి. ఈ విషయంలో గత ప్రభుత్వా లు ఈ ఒత్తిడులకు తలొగ్గాయి. ప్రస్తుత ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తే మొండి బకాయిలను వసూలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించినట్టు ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలు ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించేవిగానే ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement