Sunday, November 24, 2024

నేటి సంపాద‌కీయం – మానవ జాతికే కళంకం..!

ఉక్రెయిన్‌-రష్యాల మధ్య సాగుతున్న యుద్ధంలో ఇటూ, అటూ సంభవిస్తున్న ప్రాణ, ఆస్తి నష్టాలను ప్రతిరోజూ నిరంతర ప్రసార సాధనాల్లో వీక్షిస్తున్న ప్రజలకు రోత పుడుతోంది. పరమ జుగుప్స కలుగుతోంది. ఇది మానవజాతికే కళంకం. ప్రపంచంలో మానవత్వం అనేది ఉందా అనే అనుమానం కలుగుతోంది. యుద్దంలో దాడులు, ప్రతిదాడులు మామూలే కానీ, రష్యన్‌ సైనికులు సాగిస్తున్న మారణ హోమం మానవత్వం సిగ్గుతో తలదించుకునే రీతిలో ఉంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కి అతి సమీపంలోని బుచా పట్టణంలో వందలాది మందిపౌరులను రష్యన్‌ సైనికులు తలపై తుపాకీ పెట్టి కాల్చి చంపడం, ప్రతిఘటించిన వారికళ్ళు పీకేయడం, ఆడవారిపై అత్యాచారం జరిపి కాల్చి చంపడం వంటి క్రూరాతి క్రూరమైన చర్యలకు పాల్పడటాన్ని యావత్‌ ప్రపంచంతో పాటు మన దేశమూ ఖండించింది. ఈయుద్ధానికి వ్యతిరేకంగా మన దేశం నోరు విప్పడం ఇదే మొదటి సారి. సాయుధ సంఘర్షణను విరమించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇప్పటికి ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసింది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధంలో భారత్‌ ఎటువైపు ఉంటుందన్న ప్రశ్నకు శాంతివైపు అని విదేశాంగ మంత్రి జైశంకర్‌ పార్లమెంట్‌లో సమాధానమిచ్చారు.

మహాత్మా గాంధీ అహింసా వాదానికి కట్టుబడిన భారత్‌ గతంలో వివిధ దేశాల మధ్య జరిగిన యుద్ధాల సమయంలో కూడా ఇదే వైఖరిని తీసుకుంది. రష్యాతో మనకు దశాబ్దాలుగా మంచి స్నేహ సంబంధాలున్నప్పటికీ, సమయం వచ్చినప్పుడు రష్యాకే కాదు, అమెరికాకి సైతం నిష్కర్షగా, నిర్మొహమాటంగా తన వైఖరిని తెలియజెప్పడం ద్వారా దేశంగా భారత్‌ తన స్వతంత్ర తను కాపాడుకుంటోంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో వర్చువల్‌గా మాట్లాడుతూ, రష్యాపై ఆంక్షలు విధించడంతో సరి పెట్టకుండా, మానవ జాతికి శత్రువుగా ప్రకటించి ఏకాకిని చేయాలని డిమాండ్‌ చేశారు. అలా చేయలేకపోతే ఐక్య రాజ్య సమితిని రద్దు చేయాలంటూ ఘాటైన వ్యాఖ్య చేశారు. ఆయన వ్యాఖ్యలోని తీవ్రతను మానవత్వం ఉన్న వారు ఎవరైనా అర్ధం చేసుకోగలరు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి జెలెన్‌స్కీ తన మాట వినలేదనే కోపం ఉండవచ్చు. సాధారణ పౌరులు ఏం చేశారు. ఉక్రెయిన్‌కి చదువుకోవడానికి, వ్యాపార లావాదేవీల కోసం వెళ్లిన ఇతర దేశాల పౌరులు ఏం పాపం చేశారు. అన్నింటికీ మించి అబలులైన ఆడవారిపై రష్యన్‌ సైనికులు లైంగిక దాడులు చేయడం, పాలబుగ్గల పసివారినిసైతం నిర్దాక్షిణ్యంగా చంపడం వంటి రాక్షస కృత్యాలకు వారికి ఏ శిక్ష విధించినా తక్కువే.

పుతిన్‌ ఇద్దరు కుమార్తెలపై యూరప్‌లో ఆంక్షలు విధించినప్పుడైనా ఆయనలో తండ్రి మేల్కొని ఇలాంటి హీనులపై తగిన చర్యలకు ఆదేశించి ఉండాల్సింది. ఉక్రెయిన్‌లో సామూహిక ఖననాల కోసం గత నెలలో ఓసారి, ఈనెల మొదటి వారంలో మరోసారి 45 అడుగుల లోతున గొయ్యిలు తవ్వారట. కరోనా వల్ల మరణించిన వారి మృత దేహాలను ఖనన, దహనాలపై మన దేశంలో ఎన్ని విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయో మనకి ఇంకా గుర్తుంది. కొన్నేళ్ళ క్రితం శ్రీలంకలో లిబరేషన్‌టైగర్స్‌ ఆఫ్‌ తమిళ ఈలం(ఎల్‌టిటిఈ) టైగర్లకూ, ప్రభుత్వ దళాలకూ మధ్య అంతర్యుద్ధం జరిగినప్పుుడు కూడా మృతదేహాలు సంస్కారానికి నోచుకోక చెల్లాచెదురై పడి ఉన్న ఛాయాచిత్రాల దృశ్యాలు ఇప్పటికీ మన స్మృతిలో ఉన్నాయి. అలాగే, 1976-79 సంవత్సరాల మధ్య కాంబోడియాలో (కంపూచియాలో) సైనిక నియంత పోల్‌పాట్‌ పాలనలో అసంఖ్యాకంగా ప్రజలు ఊచకోతకు గురైనప్పుడు కూడా మృతదేహాల అంతిమ సంస్కారం పెద్ద సమస్య అయింది. ఇప్పుడు ఉక్రెయిన్‌లో కూడా అలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. మానవజాతిలో క్రూరాతిక్రూరమైన సేనలుగా పేరుమోసిన సేనల జాబితాలో రష్యన్‌ సేనలు కూడా చేరాయి. ఉక్రెయిన్‌లో రష్యన్‌ సైనికుల దురాగతాలపై అంతర్జాతీయ ప్రసార సాధనాల్లో ప్రసారమవుతున్న దృశ్యాలు ప్రజల కంట తడిపెట్టిస్తున్నాయి.

తమపిల్లలు దిక్కులేని వారిగా మరణించకూడదనేమో పదేళ్ళ లోపు పిల్లల వీపులపై వారి పేర్లు, చిరునామాలను ఉక్రెయిన్‌ తల్లులు రాస్తున్నారు, ఈ ఘోరకలిని ఇప్పటికైనా చాలించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాడనికి రష్యా ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ యుద్ధం వల్ల రష్యా సాధించింది ఏమీ లేదు. వేల మంది రష్యన్‌ సైనికులు మరణించారు. వారిలో మేజర్లు, జనరల్స్‌ కూడా ఉన్నారు. ఈ యుద్ధానికి ఇంతవరకూ రష్యా రెండులక్షల కోట్ల రూబుల్స్‌ ఖర్చు చేసినట్టు అంచనా. చమురు, గ్యాస్, ఇతర సహజవనరుల ద్వారా సంపాదించిన ధనాన్ని సాటి మనుషులను చంపడానికి వినియోగించుకోవడం ఏ విధంగా చూసినా క్షమార్హం కాదు. రష్యా తన పూర్వ వైభవాన్ని సంపాదించుకోవాడనికి ఇది మార్గం కానే కాదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement