ప్రతికూల పరిస్థితుల మధ్య ధైర్యంగా నిలిచి పోరాడి విజయం సాధించడమే జీవితం అని స్వామి వివేకానంద అన్నారు. కాలగమనంలో కలుస్తున్న సంవత్సరం కష్టాలు, కడగండ్లనే మిగిల్చింది.. అవి ఆర్థిక పరమైనవే కాదు,ఆరోగ్యపరమైనవి కూడా. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కూడా అన్నారు. కష్టాలను ఎదుర్కొన్నప్పుడే మనిషిలో ధీరత్వం వస్తుంది. అనుభవం మనిషిని నిలబెడుతుంది.నడిచేట్టు చేస్తుంది.అందుకు మనోధైర్యం కావాలి. 2021 సంవత్సరం మనకు ఆ ధైర్యాన్ని ఇచ్చింది. కష్టాలకు కుంగిపోకూడదు, సుఖాలకు పొంగి పోకూడదు, గీతాచార్యుడు అర్జునునికి బోధ పేరిట యావత్ మానవాళికి అందించిన గీతా సారం ఇదే. అలాగే, ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధం సహా అన్ని మతాల సారం కూడా అదే.
కరోనా సమ యంలో మనం ఎన్నో కష్టాలు పడ్డాం,ఇప్పటికీ పడుతున్నాం.అయినా మనలను నిలబెడుతున్నది ఆత్మవిశ్వాసమే. ఆత్మవిశ్వాసంఅనే ఆయుధం మన వద్దఉంటే ఎటువంటి కష్టాన్ని అయినా ఎదుర్కోవచ్చు.కులాలు, మతాలు, వర్గాలు,ప్రాంతాలనే తేడా లేకుండా ్టఅందరినీ ఏక తాటిపై నిలిపింది. కొత్త సంవత్సరంలోనైనా కరోనా పీడ విరగడ కావాలని యావత్ మానవజాతి కోరుకుంటోంది. కోటి ఆశలతో ఎదురు చూస్తున్న కొత్త సంవత్సరం రానే వచ్చింది.ఆశించడమే కాదు.అందుకు ప్రాతిపదికను కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. కరోనా,ఇతర వైరస్‌లు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని కాకుండా, మన కోసం మనం శ్రమించాలి.మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందనే ఇంగితాన్ని తెలుసుకుని మసలుకోవాలి. అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసం ఉంటే పోగొట్టుకున్న వాటన్నింటినీ తిరిగి సాధించుకోవచ్చని వివేకానంద అన్నారు. అలాగే, ప్రతి మనిషిలో మంచిని చూడగలిగితే మనలో మంచి పెరుగుతుందని కూడా స్వామిజీ బోధించారు.
ప్రస్తుతం జాతీయ,అంతర్జాతీయ రంగాల్లో ఎదుర వుతున్న పరిస్థితులన్నింటికీ పరస్పర విశ్వాసం,ప్రేమ లోపించడమే.మనుషుల్లో ప్రేమనీ, సత్యాహింసలను పెంపొందించడానికి గౌతమ బుద్ధుని నుంచి ఆధునిక కాలంలో మహాత్మాగాంధీ వరకూ అందరూ మనకు బోధించింది అదే. అయితే, మనం వారి బోధనలను విని ఊరుకుం టున్నాం.ఆచరించకపోవడంవల్లనే కష్టాలు పాలవుతున్నాం. భారత్‌లో ఆధ్యాత్మిక సంపద ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. 2021వ సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిల బడిన భారత్‌ని ప్రశంసిస్తున్నాయి.కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక రంగం మళ్ళీ ఊపం దుకుం టోంది.మన దేశాన్ని కవ్విస్తున్న పొరుగుదేశాలు మన సత్తా తెలుసుకుని మసులు కుంటున్నాయి. 2021లో చైనా, పాకిస్తాన్‌లు మన దేశాన్ని ఇక్కట్లలోకి పడతోవబోయి వెల్లకిల పడ్డాయి. ఈ రెండు దేశాలూ ఇప్పటికీ భారత్‌ని కవ్వించేందుకు కుట్రలు, కుహకాలు పన్ను తున్నాయి. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా సాగుతున్న భారత్‌ని ఇవి ఏమీ చేయలేవని ప్రతి సంద ర్భంలోనూ రుజువు అవుతోంది. మనకున్న సైనిక శక్తి,అపారమైన మేధా సంపత్తి అమెరికా సహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో మన ప్రభ వెలిగేట్టు చేస్తున్నాయి.
అమెరికా అధ్యక్ష పదవిలో ఎవరున్నా భారత్‌తో సత్సంబంధాలు కోరుతున్నారు. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో కూడా మన దేశం ఎటువై పూ మొగ్గకుండా అలీన విధానంతో తన ప్రతిపత్తిని నిలబెట్టుకుంది. భారత్ తన తటస్థ వైఖరితోనే అన్ని దేశాలనూ కలుపుకుంటూ పోతున్నది. అలాగే,జాతీయంగానూ దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. ముఖ్యంగా,దాదాపు ఏడాది పాటు సాగిన రైతుల ఆందోళన ముగియడం కొత్త సంవత్స రంలో ఊరట కలిగించే విషయం. అకాల వర్షాల వల్ల కొన్ని చోట్ల పంటలు దెబ్బ తిన్నప్పటికీ ,దేశం మొత్తం మీద ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆశాజనకంగానే ఉంది.కరోనా కాలంలొ సైతం వ్యవసాయ రంగంలో ఎప్పటి మాదిరిగా ఉత్పత్తులు సాగడం చెప్పుకోదగిన విషయం. అలాగే,పారిశ్రామికఉత్పత్తులకు మొదట్లోకొంత ఇబ్బందులు ఎదురైనా, మళ్ళీ అవి పుంజు కున్నాయి.
ఆర్థికపరిస్థితి మళ్ళీ పుంజు కుంటోందని ప్రభుత్వమే చెబుతోంది. పారిశ్రామికరంగంలో చిన్న, మధ్యతరగతి, పరిశ్రమల్లో ఉత్పత్తి ఆశాజనకంగా ఉందని ప్రధాని ఇటీవల ప్రకటించారు. అలాగే,స్టార్ట్ అప్‌లు కూడా బాగా పని చేస్తున్నట్టు ఆయన వెల్లడిం చారు.అయితే, గత సంవత్సరం అంతా రైతుల ఆందోళన యావత్ దేశం దృష్టినే కాకుండా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది.ఈ ఆందోళనకు స్పందించిన ప్రధానమంత్రి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించి పెద్ద మనసును చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు ముగియడం, తెలంగాణలో ధాన్యం కొనుగోలు వ్యవ హారం పరిష్కారం కావడం, ఆంధ్రప్రదేశ్‌లో అమ రావ తి సమస్యపై ప్రభుత్వం వెనక్కు తగ్గడం కొత్త సంవత్సరం ఆరంభంలో శుభ పరిణామాలే.