పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిీఎఫ్‌ఐ) అనే సంస్థ పదహారేళ్ళ క్రితం కేరళలో పుట్టి ఇప్పుడు దేశంలోని 11 రాష్ట్రాలకు విస్తరించింది. అణచివేతకూ, దోపిడీకీ వ్యతిరేకంగా పోరాడటమే తమ లక్ష్యమని చెప్పుకుంటున్న ఈ సంస్థ ఇప్పుడు మతపరమైన ఘర్షణలకు కారణం అవుతోంది. అందుకే, ఈ సంస్థ కార్యకలాపాలపైనా, దీనిని నిర్వహిస్తున్న వ్యక్తులపైనా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నిఘాను తీవ్రతరం చేసింది. ఈ సంస్థకు విదేశాల నుంచి విరాళాలు అందుతున్నాయని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. ఈ సంస్థకు చెందిన 106 మందిని దేశంలోని 11 రాష్ట్రాల్లో అరెస్టు చేసినట్టు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. ఆర్థిక శాఖ ఎన్‌ఫోర్స్‌మెంటు డైరక్టర్ (ఈడీ) అధికారులు జరిపిన దాడుల్లో అనేక రహస్య పత్రాలను, ఇతర ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కేరళ కేంద్రంగా పనిచేస్తున్న కార్యకలాపాలు 70వ దశకం రెండవ భాగంలో స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ (సిమి) కార్యకలాపాలను గుర్తు చేస్తున్నాయి. ఆ సంస్థ అలీగఢ్‌లో పుట్టినప్పటికీ, కేరళలోనే తన కార్యకలాపాలను ఎక్కువగా సాగించేది. ఆ సంస్థ కూడా విద్యార్థుల్లో వివక్షకు వ్యతిరేకంగా పోరాడేందుకే ఏర్పడి నట్టు మొదట ప్రకటించినప్పటికీ, యూనివర్శిటీల్లో, విద్యా సంస్థల్లో విధ్వంసకర కార్యకలాపాలను నిర్వహించి బీజేపీ విద్యార్థి విభాగమైన అఖిల భారత విద్యార్థి పరిషత్‌తో తరచూ ఘర్షణలకు దిగేది.
ఇప్పుడు పీఎఫ్ ఐ కూడా అణగారిన వర్గాల దోపిడీకి వ్యతిరేకంగా పోరాట మే లక్ష్యంగా చెప్పుకుంటున్నప్పటికీ, రూపు మార్చుకుని మతపరమైన ఘర్షణలకు ఊతం ఇస్తోంది. అయితే, అసమ్మతిని వ్యక్తం చేసే వర్గాల నోళ్ళు నొక్కడానికి కేంద్రం తన దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని పీఎఫ్‌ఐ నాయకులు ఆరోపిస్తున్నారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో అశాంతిని సృష్టిస్తోందన్నది పీఎఫ్‌ఐపై ప్రభుత్వం ఆరోపణ. ఈ సంస్థకు ముస్లింలీగ్, సెక్యులర్ పార్టీల మద్దతు ఉంది, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత కేరళలో ఏర్పడిన నేషనల్ డెవలెప్‌మెంట్ ఫ్రంట్ ముస్లిం సంస్థల రక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు పలు రాష్ట్రాల్లో శాఖలను ఏర్పరిచింది. కేరళలో వివిధ సంస్థల శాఖలన్నీ కలిసి కేంద్రీకృత సంస్థగా ఏర్పడ్డాయి. ఈ విధంగా వెలుగు చూసినదే పీఎఫ్‌ఐ. ఈ సంస్థ వ్యవ స్థాపక సభ్యుడు ప్రొఫెసర్ పి.కోయా తమ సంస్థపై బీజేపీ నాయకులు బురద జల్లుతున్నారని ఆరోపించారు. పీఎఫ్‌ఐకి నిషేధిత సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌తో సంబంధాలున్నాయని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. అంతేకాదు. కర్నాటకలో హిజాబ్ ధరించాలని విద్యార్థినులను ప్రోత్సహిస్తున్నది ఈ సంస్థ సభ్యులేనని బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపి ఆరోపిస్తోంది. వర్శిటీల ఆవరణల్లో ఈ సంస్థ ఘర్షణలను సృష్టిస్తోందనీ, విద్యా ర్థుల్లో విభజనలను సృష్టిస్తోందని కూడా ఆరోపిస్తోంది.
పీఎఫ్‌ఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనే రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థగా పనిచేస్తోంది.ఈ పార్టీ కేరళ ఎన్నికల్లో పోటీ చేసింది కానీ, సీట్లు గెలవ లేదు. అయితే, చెప్పుకోదగిన ఓట్లను సాధించింది. ఈ పార్టీ, ఈ సంస్థ రెండూ కూడా కేరళకే పరిమిత మయ్యాయనీ, దేశంలోని ఇతర ప్రాంతాలకు దీనిని గురించి పెద్దగా తెలియదని ఢిల్లిలోని జామియా, మిలియా యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆదిల్ అహ్మదీ అభిప్రాయం. ఈ సంస్థపై ఎన్ ఐఏ దాడులు నిర్వహించడం దారుణమనీ, ముస్లిం ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏర్పడిన సంస్థలను కేంద్రం ఏవేవో సాకులతో అణచివేస్తోందని ఆయన ఆరోపించారు. అయితే, ఈ సంస్థ పెద్ద ప్రణాళికతోనే ముందుకు సాగుతోందనీ, కేరళలో బలమైన రాజకీయ పార్టీగా ఉన్న ఇండియన్ ముస్లింలీగ్‌కి రాజకీయంగా తోడ్పడేటందుకే ఇది పని చేస్తోందని ఆరోపణలు ఉన్నా యి. కేరళలో ముల్లాపురం, కొట్టాయం తదితర జిల్లాల్లో ముస్లిం జనాభా ఎక్కువ. ఆ జిల్లాల్లో ముస్లింలీగ్‌కి అండగా ఉండేందుకే పీఎఫ్‌ఐ అవతరించిందన్న వాదన కూడా వినిపిస్తోంది. కేరళలో ముస్లింలీగ్ మద్దతు లేనిదే అటు యూడీఎఫ్(కాంగ్రెస్ ఫ్రంట్), ఇటు ఎల్‌డీఎఫ్ (మార్క్సిస్టు ఫ్రంట్) ఎన్నికల బరిలోకి దిగలేవన్నది దశా బ్దాలుగా నిరూపితం అవుతున్న వాస్తవం. ఇతర ప్రాంతా ల్లో మతతత్వ బీజేపీ ప్రాబల్యం పెరిగిపోతున్నదంటూ గగ్గోలు పెట్టే మార్క్సిస్టు పార్టీ కేరళలో ముస్లింలీగ్ ప్రాబ ల్యం పెరగడంపై నోరు విప్పకపోవడం రాజకీయమే. అంతేకాకుం డా, మత పరమైన మైనారిటీ సంస్థలకు ప్రభుత్వ నిధులను అందజేయడంలో కూడా ఈ రెండు ఫ్రంట్‌లు అవకాశ వాద వైఖరిని అనుసరిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా కేరళలో క్రైస్తవ, ముస్లిం సంస్థలకు ఎక్కువ ప్రోత్సాహం లభిస్తోందని బీజేపీ నేత లు తరచూ చేస్తున్న ఆరోపణల్లో అసత్యం లేదు. కేరళ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు పీఎఫ్‌ఐ ప్రయ త్నిస్తున్నదన్న ఆరోపణ నిరాధారం కాకపోవచ్చు.