ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు జరగాలని అమెరికా నుంచి అతి చిన్న దేశం వరకూ అన్ని దేశాలు కోరుతున్నాయి. అయినా ఎందుకు జరగడం లేదు? కేవలం చైనా అడ్డుపడుతుండటం వల్ల భారత్‌కి ఆ సభ్యత్వం లభించడం లేదు. ఈ విషయమై మన దేశం ఎన్నో సార్లు అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించినప్పటికీ ఫలితం కనిపించడం లేదు.
తాజాగా, టెస్లా కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ ఈ ప్రతిపాదన చేశారు. దీనిపై అమెరికా విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి వేదాంత్ పటేల్ స్పందిస్తూ సమితిలో సంస్కరణలు జరగాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గత జనవరిలోనే సూచించారని అన్నారు. రష్యాకూడా పలు సందర్భాల్లో భారత్‌కు భద్రతా మండలిలో స్థానం కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. అయినా, దౌత్య పరంగా చైనాతో గల సంబంధాలను దృ ష్టిలో ఉంచుకుని రష్యా మన దేశం తరఫున పోరాడలేక పోతోందనే అనుకోవాలి.
ప్రపంచంలో అతి పెద్ద ప్రజా స్వామిక దేశమైన భారత్‌కి భద్రతా మండలి సభ్యత్వాన్ని పొందే హక్కు ఉందని అన్నారు. అత్యధిక జనాభా కలిగిన భారత్‌కి మండలిలో సభ్యత్వం లేకపోవడాన్ని మస్క్ తప్పు పట్టారు. ఆయనే కాదు. పలు దేశాల అధినేతలు కూడా భారత్‌కి సభ్యత్వం విషయంలో తమ అభి ప్రాయాలను ఇప్పటికే నిష్కర్షగా వెల్లడించారు. చైనాకి భద్రతా మండలిలో సభ్యత్వం ఉంది. భారత్ విషయంలో మోకాలడ్డుతోంది.ఇందుకు కారణం ఏమిటో అందరికీ తెలిసిందే. చైనా ఆసియాలో అగ్రరాజ్యంగా ఎదిగేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు, ప్రపంచంలోనే అగ్రరాజ్యస్థానాన్ని కైవసం చేసుకునేందుకు, అమెరికాను పక్కకు నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆసియాలో భారత్ తనకు పోటీదారుగా ఉందని చైనా భావిస్తోంది. ఆసియాలోని చిన్న దేశాలను బులిపించి, తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చైనా అంది స్తున్న సాయానికి ఆ చిన్న దేశాలు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. చైనా నుంచి సాయం పొందిన చిన్న దేశాలు తమ భౌగోళిక ,ప్రాదేశిక హక్కులను వదు లు కోవడమో, చైనా ఒత్తిళ్ళకు లొంగడమో చేయాల్సి వస్తోంది. ఆయా దేశాలు స్వశక్తిపై ఆధారపడేందుకు వీలుగా భారత్ సాయం చేస్తోంది. ఈ విషయమై చైనాకు భారత్ పట్ల గుర్రుగా ఉంది.
భద్రతామండలిలో భారత్‌కి స్థానం లభిస్తే తన అక్రమాలను అడ్డుకుంటుందనే భీతి చైనాకు ఉంది.మండలిలో మన దేశానికి సభ్యత్వం రాకుండా పాకిస్తాన్‌ని ఉసిగొల్పుతోంది. పాక్‌కీ, మన దేశానికీ పోలికే లేదు.అటువంటి పాకిస్తాన్ కూడా మండలి సభ్యత్వం కోసం చేస్తున్న డిమాండ్‌ని సమర్ధి స్తోంది. అంతేకాక, పాక్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్ర వాదులపై వేటు పడకుండా భద్రతామండలిలో అండగా నిలబడుతోంది. ఈ విషయాలన్ని అమెరికాకి తెలుసు. అమెరికా తల్చుకుంటే, భారత్‌కి చైనా కల్పిస్తున్న అడ్డంకులను తొలగించడం పెద్ద కష్టమేమీ కాదు. అమెరికా కూడా ఈ విషయంలో ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోంది. పాకిస్తాన్ అఫ్గాన్‌లో తాలిబన్లతో పోరుకు సాయం పేరిట అమెరికా నుంచి బాగా లబ్ధి పొందింది. ముషార్రఫ్ పాక్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో అమెరికా అందించిన సాయాన్ని పాక్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలకు భారీగా పంపిణీ చేశారు. అంటే భారత్‌కి వ్యతిరేకంగా ఉగ్రవాదకార్యకలాపాలు సాగించే సంస్థలకు అందించారన్న మాట.ఈ విషయం ఆనాటి అమెరికా పాలకులకు తెలుసున్నా పాక్‌కి సాయం ఆపలేదు.ఇప్పటికీ కొనసాగిస్తోంది.
పాక్‌ని అమెరికా వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటోంది. మండలి లో పాక్ ఉగ్రవాదులపై వేటుకు సంబంధించిన తీర్మా నాన్ని చైనా వీటో చేసినా అమెరికా ఏమీ చేయకపోవడం కూడా అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి కారణం. మండలిలో భారత్‌కి శాశ్వత సభ్యత్వం లభిస్తే రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేయడం,ఇజ్రాయెల్, పాలస్తీనా ల మధ్య దాడులు వంటి అవాంఛనీయ పరిస్థితులను నివారించేందుకు కృషి చేసి ఉండేది. అమెరికాకి చెందిన ఆయుధాల ఉత్పత్తిదారుల మార్కెట్ పడిపోయి ఉండేది. శాంతి వచనాలు పలకాలే కానీ, శాంతిని నెల కొనేట్టు చిత్తశుద్ధిగా కృషి చేయ కూడదు. అందుకే, మండలి సభ్యత్వం విషయంలో పైకి భారత్‌కి మద్దతు ప్రకటిస్తూనే, ఆచరణలో అమెరికా అడ్డుకుంటోంది. మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలకే వీటో అధికారం ఉంటుంది.భారత్‌కి వీటో అధికారం రాకుం డా చైనా బహిరంగంగానే అడ్డు కుంటుండగా, అమెరికా, రష్యాలు పైకి మాత్రం మద్దతు ప్రకటిస్తూ ఆచరణలో మోకాలడ్డుతున్నాయి.