Friday, November 22, 2024

మాంద్యం ఒడిలో ప్రపంచం!

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్‌ మల్‌పాస్‌ చేసిన తాజా ప్రకటన వర్ధమాన దేశాల గుండెల్లో రాయిపడింది. ప్రపంచం ప్రస్తుతం మాంద్యానికి చాలా దగ్గరగా ఉందని అంటూ ఆయన దీని ప్రభావం చిన్న, అభివృద్ధి చెందుతున్న దేశాలపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవ ల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయా దేశాల అధిపతు లకు సూచించారు. ప్రపంచంలోని పలు దేశాలు వేటికవే తమ అజెండా ప్రకారం నడుచుకుంటున్నాయి. ఉదాహ రణకు రష్యా ఈ సంవత్సరారంభంలో ప్రారంభించిన యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఎంతగా ఉందో వేరే చెప్పనవసరం లేదు. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనడానికి అమెరికా ఫెడరల్‌ బ్యాంకు (ఫెడ్‌) సహా అన్ని దేశాల్లో సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. వీటి ప్రభావం అమెరికాకు లాభకరంగా ఉన్నా, బడుగు, వర్ధమాన దేశాలకు చాలా భారంగా తయారైంది. అమెరికాకుఈ సంగతి తెలుసున్నా, ప్రపంచానికి పెద్దన్నగా, అగ్రరాజ్యంగా ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచ దేశాలను బయటపడేయడానికి తీసుకుంటున్న చర్యలు శూన్యం. వడ్డీ రేట్ల పెంపు, పెట్టుబడుల కోత వంటివి బడుగు, బలహీన వర్గాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయన్న డేవిడ్‌ మల్‌పాస్‌ చేసిన వ్యాఖ్యల్లో అణు మాత్రం అత్యుక్తి లేదు. ఇప్పటికే, శ్రీలంక, పాకిస్తా న్‌, నేపాల్‌ వంటి చిన్న దేశాలు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటును 3 శాతం నుంచి1.19 శాతానికి కుదించారు. మన దేశం వృద్ది రేటు అంచనాలను కూడా 6.8 నుంచి 6.6 శాతానికి ప్రపంచ బ్యాంకు తగ్గించింది.

దీనివల్ల ఆయాదేశాల ప్రాథమ్యా లు దెబ్బతింటాయి. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మన దేశంలో గత నెలలో10.7 శాతం నమోదు అయింది. అదే సమయంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.41 శాతాని కి చేరింది. వస్తువుల కొనుగోళ్ళు పెరిగినప్పుడు వృద్ది రేటు పెరగాలి. కానీ, ఆ విధంగా జరగకుండా టోకు ద్రవ్యోల్బణం పడిపోతోంది. కూరగాయలు టోకు మార్కెట్‌లో ధరలు తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ వినియోగ దారులకు అవి చేరేసమయానికి గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. దీనికి కారణం దళారుల వ్యవస్థే. దళారుల వ్యవస్థను అరికట్టామని ప్రభుత్వం పదే పదే ప్రకటనలు చేస్తున్నప్పటికీ, పేద ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం తగ్గడం లేదు. ఉదాహరణకు వరి ధాన్యాల విషయాన్నే తీసుకుంటే కొనుగోళ్ళు విషయంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం చేసుకుంటున్న ప్రకటనలు ప్రసార మాధ్యమాల ద్వారా సామాన్యుల దృష్టికి వస్తున్నప్పటికీ, బియ్యం ధర ఎందుకు తగ్గడం లేదో ప్రభుత్వమే చెప్పాలి. నాణ్యమైన బియ్యం ధర దాదాపు వందరూపాయిలకు చేరుకుం టోంది. ఈ పరిస్థితికి కారకులెవరో ప్రభుత్వానికి తెలియదా? బియ్యం టోకు వ్యాపారమంతా రాజకీయ పార్టీ నాయకుల చేతుల్లో ఉందన్న విషయం బహిరంగ మే. అలాగే, కందిపప్పు, ఇతర పప్పుల ధరలు, వంట నూనెలధరలు బాగా పెరిగిపోయాయి. ఎన్నికలొస్తే బడుగు వర్గాలకు తక్కువ ధరకు బియ్యం, ఇతర నిత్యా వసర వస్తువులు దొరుకుతాయి.

మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలపై ఆ భారం పడుతుంది. అధికారంలో ఉన్న నాయకుల ఇష్టాయిష్టాలను బట్టి ధరలు పెరుగుతాయని సామాన్యులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. కాగా, భారత్‌ స్థూల దేశీయోత్పత్త్తి (జిడిపి) రేటును అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఈ ఏడాది వరుసగా రెండో సారి తగ్గించింది. ఈ ఏడాది జనవరిలో 8.2శాతంగా అంచనా వేసి, గత జూలైలో 7.4 శాతానికి తగ్గించింది. ఇప్పుడు దానిని 6.8 శాతానికి కుదించింది.ఈ తగ్గుదలకు కారణం ప్రపంచ దేశాల్లో ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక మాంద్యమే కారణమంటూ సన్నాయినొక్కులు ప్రారంభించింది. నిజానికి ప్రపంచ దేశాల్లో ఆర్థిక పరిస్థితి హెచ్చు తగ్గుల ప్రభావం భారత్‌పై ఉండాల్సిన అవసరం లేదు. ద్వైపాక్షిక వాణిజ్యం, ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల కారణంగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల ప్రభావం అంతర్గతంగా ముడిపడి ఉంటున్నాయి. కరోనా ప్రభావం అన్ని దేశాలపై ఉన్నందున దానిని నివారించడం అసాధ్యమేనని సరిపెట్టుకుంటే, ఇప్పుడు ఉక్రెయిన్‌-రష్యాల మధ్య యుద్ధం ప్రభావం ఏ మాత్రం సంబంధం లేని దేశాల ఆర్థిక వ్యవస్థలను బాగా దెబ్బ తీసింది. ఇందుకు రష్యాది ఎంత బాధ్యత ఉందో అమెరికాదీ అంతే బాధ్యత. ఈ యుద్ధాన్ని నివారించేం దుకు ఈ రెండు దేశాలు చిత్తశుద్ధితో ప్రయత్నించి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చి ఉండేది కాదు. ఉక్రెయిన్‌పై రష్యాదాడి ప్రభావం చమురు, వంటనూనెలు ఇతర నిత్యావసరాలపై తీవ్రంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. యుద్ధం పేరు చెప్పి వాణిజ్య వర్గాలు ధరలు పెంచేస్తున్నాయి. గతంలో కూడా యుద్ధం సమయాల లో ఇలా జరిగినట్టు పెద్దలు గుర్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement