Tuesday, November 19, 2024

నేటి సంపాద‌కీయం – ఐరాస పిలుపు సందర్భోచితం!

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించి 72 రోజులు అయింది. ఇప్పటికే ఇరువైపులా వేలాది మంది మరణించారు. లక్షలకోట్లలో ఆస్తి నష్టం జరిగింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, మరియాపోల్‌ సహా ప్రధాన నగరాలన్నీ మరుభూుములను తలపిస్తున్నాయి. ఈ యుద్ధానికి ఇప్పటికైనా ముగింపు పలకాల్సిందేనంటూ ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపు ఎంతో విలువైనది. ఎంతో సందర్భోచితమైనది. మరెంతో స్ఫూర్తిదాయకమైనది. యుద్ధాన్ని ఎవరూ కోరుకోరు. యుద్ధాన్ని సాగదీయాలని అంతకన్నా కోరుకోరు. సర్వేజనా సుఖినోభవంతు అనే ఆర్యోక్తిని నమ్మిన భారత్‌ ఇంతకుముందే ఇరు పక్షాల వారూ సంయమనాన్ని పాటించి యుద్ధాన్ని విరమించాలని రష్యా, ఉక్రెయిన్‌లకు విజ్ఞప్తి చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ యూరప్‌ పర్యటన సందర్భంగా చేసిన ప్రసంగాల్లో భారత్‌ ఆత్మను ప్రపంచ దేశాల ముందు ఉంచారు. రష్యాకు మనకు దశాబ్దాలుగా మిత్ర దేశంగాఉన్న కారణంగా, ఆ దేశంతో మనం వ్యవ హరించే తీరులో ఎంతో మెలకువ, సంయమనం ఉండాలి. మోడీ ప్రదర్శించింది అదే. యూరప్‌లో ఆయన పర్యటన సందర్భంగా చేసిన ప్రసంగాలు అందరి మనసులను హత్తుకున్నాయి. భారత్‌ తమమిత్ర దేశమని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్‌ భావించేట్టు సాగాయి ఆయన ప్రసంగాలు. అంతేకాకుండా, ప్రస్తుత ప్రపంచ పరిస్థితు లు యుద్ధాలకూ, సంఘర్షణలకూ సమస్త దేశాలకూ ఎంత చేటు తెస్తాయో ఆయన ఎంతో హృద్యంగా వివరించారు. ఎవరినీ నొప్పించకుండా అందరిలో ఆలోచనలు రేకెత్తించే రీతిలో ఆయన ప్రసంగాలు సాగాయి. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరెస్‌ ఇంతకాలం మౌనంగాఉండి ఇప్పుడు ఉచ్ఛస్వరంతో ఇక చాలు యుద్ధాన్ని ఆపండి అంటూ ఇరుదేశాలకు పిలుపు ఇచ్చేందుకు ఆయనకు మోడీ ప్రసంగాలే స్ఫూర్తిని ఇచ్చి ఉంటాయనుకోవడం అత్యుక్తి కాదు.

ప్రపంచంలోని అన్ని దేశాలూ కరోనా మహమ్మారి వల్ల ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాయి. ప్రాణనష్టం కూడా అన్ని దేశాలనూ కలచి వేసింది. ఆ విలయాన్ని ఎదుర్కొని నిలదొక్కుకుంటున్నవేళ, ఉక్రెయిన్‌ యుద్ధం వచ్చింది. ఇది కేవలం ఉక్రెయిన్‌కీ, రష్యాకీ సంబంధించిన సమస్య అయినా, ఈ యుద్దం వల్ల యావత్‌ ప్రపంచ దేశాలూ భారీగానే దెబ్బతిన్నాయి. ముఖ్యంగా, రష్యా నుంచి చమురు, వంటనూనెలు, రక్షణ సామగ్రి దిగుమతులు ఆగిపోవడం వల్ల చమురు, వంటనూనెల ధరలు బాగా పెరిగాయి. అలాగే, యుద్ధం పేరు చెప్పి ప్రతి వస్తువు ధరనూ పెంచుకోవడానికి వాణిజ్యవేత్తలు ఎప్పుడూ సిద్ధంగాఉంటారు. యుద్ధాన్నిఒక సాకుగా తీసుకుని ధరలు పెంచేస్తుంటారు. యుద్ధం పేరు చెప్పి ధరలు పెంచితే ఎవరూ అడగరన్న ధైర్యం వారిలో ప్రవేశిస్తుంది. ప్రస్తుతం ధరలు పెరగడానికి అదే కారణం. అయితే, ఉక్రెయిన్‌-రష్యాల మధ్య యుద్ధం వల్ల ధరల భారాన్ని తామెందుకు మోయాలని ప్రశ్నించే చైతన్యం ప్రజల్లో వచ్చింది. అది సహేతుకమైనదే అయినా, ప్రపంచీకరణ పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా, దాని ప్రభావం అన్ని దేశాలపై ఉంటోంది. యుద్దాన్ని ప్రారంభించిన రష్యా కూడా ఏమంత ఆనందంగాలేదు. రష్యన్‌ సైన్యంలో చాలాకీలకమైన పదవుల్లోఉన్న వారితో సహావేలాది మంది నేలకొరిగారు.

యుద్ద విమానాలు, క్షిపణులు, ఇంకా లెక్కలేనంతగా యుద్ద సామగ్రిని రష్యా కోల్పోయింది. ఉక్రెయిన్‌ సంగతి సరేసరి. ఉక్రెయిన్‌ మళ్ళీ మామూలు రూపు సంతరించుకోవడానికి పాతికేళ్ళు పైన పట్టవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. రష్యాలోని తమ ప్రధాన కార్యాలయాలు బహుళ జాతి సంస్థలు అబూధాబీకీ, ఇతర గల్ఫ్‌ దేశాలకూ తరలిస్తున్నాయి. ఆ దేశాల్లో ఉగ్రవాదుల బెడద తీవ్రంగాఉన్నప్పటికీ, ముందు ఈ దాడుల హోరునుంచి బయటపడితే చాలనుకుంటున్నాయి. గుటెరెస్‌ చెప్పినట్టు ఒక్కరోజు యుద్ధానికి విరామం ఇస్తే కొన్నివందల మందిని మృత్యు వాత నుంచి రక్షించవచ్చు. యుద్ధ నష్టాల గురించి మీడియాలో వస్తున్నం కథనాల్లో వాస్తవికత కొంతే ఉంటోంది. అంతకు ఎన్నో రెట్లు నష్టాలు సంభవిస్తున్నాయి. రష్యా కూడా మింగలేక, కక్కలేక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలు తమ అధీనంలోకి వచ్చాయని రష్యా గొప్పలు చెప్పుకుంటున్నా, ప్రపంచం దృష్టికి రాని నష్టాలు చాలా ఉన్నాయి. భౌతికంగా రష్యా తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నప్పటికీ నైతికంగా బాగాదెబ్బతింది. భవిష్యత్‌లో ద్వైపాక్షిక వాణిజ్యానికీ, సంబంధాలకూ ఇతర దేశాలూ ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. విధ్వంసాన్ని లెక్కగట్టడం, లేదా అంచనావేయడం సాధ్యం కానప్పుడు అవి మాత్రం ఎన్నిరోజులకు సరిపోతాయి.? సరైన సందర్భం చూసుకుని ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరెస్‌ ఇచ్చిన సలహాను పాటించాల్సిన బాధ్యత రెండు దేశాలపైనా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement