కాశ్మీర్‌లో ఉగ్రవాదులు తిరిగి పడగవిప్పారు. మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్నారు. తాజా పరిస్థితి చేజారి పోకుండా చూడటం కోసం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గురువారం నాడు కేంద్ర భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్‌తో చర్చలు జరిపారు. కాశ్మీర్ విభజన తర్వాత పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టుగానే కనిపించి మళ్ళీ ఉగ్రవాదం విజృంభించడం ఆందోళన కలిగించే విషయమే. మే ఒకటవ తేదీ నుంచి ఇంతవరకూ 16 మంది మరణించారు. వీరంతా మైనారిటీ వర్గానికి (హిందువులే) చెందిన వారే. ముఖ్యంగా కాశ్మీర్ పండిట్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడులు జరుపుతున్నారు. తాజాగా, గురువారం ఉదయం ఒక బ్యాంకు మేనేజర్‌ని అతి సమీపం నుంచి కాల్చి చంపారు. అలాగే, మంగళవారం నాడు గోపాల్ పౌరా ప్రాంతంలో ఒక పాఠశాలలోకి ఉగ్ర వాదులు చొరబడి ఒక ఉపాధ్యాయురాలిని కాల్చి చంపారు. ఆమె కూడా కాశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందినవారు. కాశ్మీరీ పండిట్‌లను తిరిగి స్వస్థలాలకు రప్పించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కల్పించ డానికి ఉగ్రవాదులు కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. కాశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని కాశ్మీరీ పార్టీలైన నేషనల్ కాన్పరెన్స్, పీపుల్స్ డెమో క్రాటిక్ పార్టీ (పీడీపీ)లు ఇప్పటికే వ్యతిరేకించాయి.
కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లాకు ఎన్‌ఫోర్స్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులు జారీ చేయడం కలకలాన్ని రేపింది. గురువారం ఉగ్రవాదుల కాల్పులలో మరణించిన బ్యాంకు మేనేజర్ విజయ్ కుమార్ రాజస్థానీ కొద్ది రోజుల క్రితమే ఆయన కాశ్మీర్‌లోని కుల్గామ్‌కి బదిలీ అయ్యాడు. రాష్ట్రంలో పరిస్థితి 1990 దశకాన్ని గుర్తు చేస్తున్నదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కాశ్మీర్ విభజన జరిగిన తర్వాత పౌర హక్కులు, సాధారణ జన జీవనం పునరుద్ధరణ జరిగిన తర్వాత కొంతకాలం ఎటువంటి దాడులు లేకుండా గడిచిన ప్పటికీ పూర్వపు పరిస్థితి వెంటాడటం దురదృష్టకరం. ప్రధానమంత్రి ప్యాకేజీలో నియమితులైన ఉద్యోగులు, అధికారులు తాము వెనక్కి వెళ్ళిపోతామనీ, తమకు రక్షణ కల్పించమని వేడుకుంటున్నారు. కాశ్మీర్ విభజన తర్వాత పండిట్లకు సంపూర్ణమైన రక్షణ కల్పిస్తున్నట్టు కేంద్రం చెబుతున్నప్పటికీ రాష్ట్రంలో పని చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కేంద్రం కాశ్మీర్ విషయంలో పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ స్థానే ప్రధాని పదవిని చేపట్టిన షెహబాజ్ షరీఫ్ కూడా కాశ్మీర్ విభజనకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు. ఆ తర్వాతే కాశ్మీర్‌లోపండిట్లపై దాడులు పెరిగాయి. షెహబాజ్ ఇటీవల లండన్ వెళ్ళితన సోదరుడు, మాజీప్రధాని నవాజ్ షరీఫ్‌తోసుదీర్ఘంగా చర్చలు జరిపారు. అక్కడి ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొనేందుకు కొత్తగా పన్నులు, సెస్‌లు విధించడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. దీంతో భారత్‌కి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టే పథకాన్ని అమలు జేయాలని ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. కాశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను హడావుడిగా జరిపించడాన్ని ఫరూక్, మెహబూబ్ ముఫ్తీ తదితర నాయకులు వ్యతిరేకిస్తున్నారు.
బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రం ఈ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని జరిపిస్తోందని ఈ రెండు పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇంతవరకూ కాశ్మీర్‌లో మైనారిటీల పునరా వాసం కోసం కేంద్రం కేటాయించిన నిధులన్నీ అధికారంలో ఉన్న పార్టీలు, ఉన్నతాధికారులు కాజేశారనీ, అసలైన మైనారిటీ వర్గాలకు అవి చేరలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాశ్మీర్‌కి నిధులు మంజూరు చేస్తే చాలుననే భావం కేంద్ర ప్రభుత్వంలో ఉందనీ, గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా ఇదే మాదిరిగా వ్యవహరించిందని వారు ఆరోపిస్తున్నారు. ప్రజల్లో భావసమైక్యతను పెంచే కార్యక్రమాలేవీ చేపట్టడం లేదని వారు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ విషయంలో తలుపులు మూసుకుని కూర్చుంటే లాభం లేదని మన ప్రభుత్వం కాబూల్‌లో సాధారణ స్థాయిలో దౌత్య సంబంధాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటోంది. కాశ్మీర్ ఉగ్రవాదులను తాలిబన్లు ఉసిగొల్పకుండా చూడటానికి అఫ్గాన్లకు మానవీయ కోణంలో సాయంఅందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆ విధంగా పాక్ ఉగ్రవాదుల నుంచి తాలిబన్లను వేరు చేయడం ఒక వ్యూహంగా ప్రభుత్వంభావిస్తోంది. భద్రతావ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ ఇచ్చిన సలహా మేరకే అఫ్గాన్‌పై మన ప్రభుత్వం వ్యూహం మార్చినట్టు కనిపిస్తోంది. నరేంద్ర మోడీ ప్రధానిగా వచ్చినప్పటి నుంచి కాశ్మీర్ విషయంలో చేస్తున్నవన్నీ ప్రయోగాలే. ఈ ప్రయోగమైనా విజయ వంతం కావాలని కోరుకుందాం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..