ప్రభుత్వరంగంలోని చమురు, సహజవాయు సంస్థ (ఓఎన్‌జీసీ) కృష్ణా-గోదావరి బేసిన్‌లో తిరిగి చమురు ఉత్పత్తిని ప్రారంభించిందన్న వార్త తెలుగువారందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. దశాబ్దాలుగా తెలుగు వారు, భారత ప్రభుత్వం చేస్తున్న నిరీక్షణ ఫలించింది. ఓఎన్‌జీసీ తన డి-5 బ్లాక్‌లో ఉత్పత్తిని ప్రారంభించినట్టు ఆ సంస్థ సోమవారం వెల్లడించింది.
ఇది దేశానికే కాకుండా, రాష్ట్రానికి శుభవార్త. కేజీ బేసిన్‌లో చమురు ఉత్పత్తి కోసం ఎంతో కాలం స్థానికులు ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తీరానికి 35 కిలోమీటర్ల దూరంలో రిలయె న్స్ బ్లాక్-6 పక్కనే ఈ బ్లాక్ ఉంది. సముద్ర మట్టానికి 3,000 నుంచి 3,200 మీటర్ల లోతున ఉన్న ఈ బ్లాక్ అభివృద్ధి కోసం ఓఎన్‌జీసీ ఇప్పటికే 512 కోట్ల డాలర్లను ఖర్చు చేసింది. ఈ క్షేత్రంలో 2.35 కోట్ల టన్నుల చమురు, 50.71 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిక్షేపాలు ఉన్న ట్టు అంచనా. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి ఈ వివరాలు తెలియజేస్తూ రోజుకు 45 వేల బారళ్ల చమురు,10 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజవాయువును ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉందని వివరించారు.
ఈ ఏడాది మే-జూన్ నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవచ్చని ఆయన వివరించారు. ఇది ఆచరణలోకి వ స్తే చమురు, గ్యాస్ రంగంలో మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలు చాలా మటుకు పరిష్కారం అవుతాయి. మన దేశంలో వినియోగం అయ్యే పెట్రోలి యం ఉత్పత్తుల్లో 80 శాతం విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలపై వీటి కోసం ఆధారపడటం వల్ల ఆ దేశాల్లో ఘర్షణలు, యుద్ధాలు అనివార్యమైనప్పుడు చమురు, సహజ వాయువుల ధరలు ఆకాశాన్ని అంటడం సహజంగా జరుగుతోంది. చమురు ఎగుమతులను రాజకీయ అస్త్రంగా అగ్ర, సంప న్న దేశాలు వినియోగించుకుంటున్నాయి. దీనివల్ల వర్థమాన దేశాలపై ఆర్థిక భారం పెరుగుతోంది. కేజీ బేసిన్‌లో సహజవాయువు ఉత్పత్తి ప్రారంభమైతే అదనంగా 7 శాతం గ్యాస్ నిల్వలు జమ అవుతాయి.
కేజీ బేసిన్‌లో చమురు, గ్యాస్ ఉత్పత్తి ఇంధనరంగంలో గొప్ప ముందడుగు అని ప్రధాని నరేంద్రమోడీ అభివ ర్ణించారు. సహజ వనరులకు మన దేశం పెట్టింది పేరు. వాటిని వినియోగించుకుని వీలైనంత వరకు దిగుమతు లను తగ్గించుకోవాలన్న పిలుపును ఆయన అధికారం లోకి రాగానే ఇచ్చారు. అందుకు అనుగుణంగానే విదేశీ పరిజ్ఞానంతో మన దేశంలోనే రక్షణ రంగ సామగ్రిని, ఇతర సాంకేతిక ఉపకరణాలను తయారు చేసుకోవడా నికి మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ఇచ్చారు. ఇది చాలా వరకూ ప్రతిఫలించింది. ఓఎన్‌జీసీలో క్లస్టర్-2లో ఉత్పత్తులు 2021లోనే ప్రారంభం కావల్సి ఉండగా, కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. సముద్ర గర్భం నుంచి చమురును వెలికి తీసేందుకు ఆర్మ్‌డ్ స్టెర్లింగ్ -వీ అనే కదలాడే నౌకను ఓఎన్‌జీసీ తీసుకుని వచ్చింది. అది షాపూర్‌జీ-పల్లోంజీ ఆయిల్ కంపెనీకి చెందినది. రిలయెన్స్ కేజీ-డీ-6 బ్లాకు పక్కనే ఓఎన్‌జీసీ కంపెనీకి చెందిన డీ డబ్ల్యూన్ 98బై -2బ్లాక్ ఉంది. వీటి పక్కనే ఇంకా చమురు బావులు ఉన్నట్టు గుర్తించారు. వీటిని మూడు క్లస్టర్లుగా విభజించారు.
తృతీయ ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న కృషి కి ఈ ఇంధన వనరులు ఎంతో దోహదం చేస్తాయి. విదేశా ల నుంచి చమురును దిగుమతి చేసుకోవడం వల్ల కరెంట్ ఖాతా లోటు పెరిగిపోతోంది. ఏటా వేల కోట్ల విదేశీ మార క ద్రవ్యాన్ని వ్యయపర్చాల్సి వస్తోంది. స్వదేశంలో ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. అంతేకాక, ఓఎన్‌జీసీ బావులు, ఇతర కార్యాల యాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. రాజ మహేంద్రవరంలో మోరంపూడి రోడ్డులో ఓఎన్‌జిసీ కార్యాలయాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. గ్యాస్ నిక్షేపా లు పెరగడం వల్ల ఇంధన వనరులకోసం మన దేశం దిగు మతులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. వంట గ్యాస్, సహజ వాయువు ఉత్పత్తి పెరిగితే, ఇళ్ళల్లో ఇంధన ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. వాహనాలకు వంటగ్యాస్‌ని ఇప్పటికే వినియోగిస్తున్నారు.
దేశీయ పరిశ్రమల్లో గ్యాస్ వినియోగం పెరుగుతుంది. గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు మరిన్ని ప్రారంభం కావచ్చు. మనదేశంలో ఇప్పటికే బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు కూడా పెరిగితే విద్యుత్‌కి లోటు ఉండదు. సరళీకృత ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన తర్వాత ఓఎన్‌జీసీలో పెట్టుబడులు పెరిగాయి. రిలయెన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈ రంగంలో ప్రవేశించి ఉత్పత్తులను పెంచేందుకు కృషి ప్రారంభించింది. దేశం లో చమురు, సహజవాయువుల ఉత్పత్తికి ఇప్పుడు మార్గాలు బహుముఖంగా విస్తరించాయి. ఈ రెండింటికీ కొరత తీరనున్నది. పారిశ్రామికంగా దేశం అభివృద్ధిని సాధించడానికి చమురు, సహజవాయువులు ఎంతో దోహదం చేస్తాయి.