Friday, November 22, 2024

అనాథలను ఆదుకోవడం సమాజం బాధ్యత…..

ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో దేశంలో మరణ మృదంగాన్ని మోగించిన కరోనా మహమ్మారి వల్ల తల్లితండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు నెలకు నాలుగువేల వంతున ఆర్థిక సాయాన్ని అందించే పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ తన ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి మూుడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రారంభించడం సంతోషించదగినదే, కానీ, ధరలు ఆకాశాన్ని అంటుతున్న ప్రస్తుత తరుణం లో నాలుగువేలు ఏమాత్రం సరిపోవు. మరింత పెంచితే బాగుంటుందేమో !అయితే, ప్రాథమిక అవసరాల కోసం మాత్రమే ఈ సొమ్మును విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.ఈ పథకాన్ని ప్రకటించిన చాలా రోజుల తర్వాత ప్రధానమంత్రి దీనిని ప్రారంభిం చారంటే ప్రధానమంత్రి నోటంట వచ్చిన వెంటనే పథకాలు అమలు జరిగే పరిస్థితులు లేవని స్పష్టం అవుతోంది. దేశ వ్యాప్తం గా611 జిల్లాల నుంచి 9,042 దరఖాస్తులు ఈ సాయం కోసం రాగా, వీటిలో 4,345 దరఖాస్తులను ఆమోదించారు.ఈ పథకం లబ్ధిదారులకు పాస్‌ బుక్‌ ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ కార్డును అందజేశారు. నమోదైన పిల్లలు 23ఏళ్ళు వచ్చేసరికి పది లక్షల రూపా యిలను అందజేస్తారు.కేంద్ర సాంఘిక సంక్షేమ, సాధికారత శాఖ పిఎం కేర్స్‌ చిల్డ్రన్‌ కోసం ఒక స్కాలర్‌ షిప్‌ పథకాన్ని ప్రారంభించినట్టు తెలియజేసింది. ఈ పథకం కింద పిల్లలకు సంవత్సరానికి20,000 అందజేస్తారు. ఈ పథకం కింద 2022-23 సంవత్సరంలో 3,945 మంది పిల్లలకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు.
ఏ పథకమైనా అసలైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరితేనే దాని లక్ష్యంనెరవేరినట్టు.మన దేశంలో సంక్షేమ రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపా యిలను ఖర్చు చేస్తున్నప్పటికీ అసలైన లబ్ధిదారులకు ఆ సొమ్ము చేరడం లేదన్న విషయం నిష్టుర సత్యం.అవినీతి సర్వాంతర్యామి అని మనమే అంగీకరిస్తున్నప్పుడు పథకాలకు కేటాయించిన సొమ్ము ఏమైందని అడగలేకపోతున్నాం.రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడానికి మాత్రమే ఈ పథకాల సొమ్ము వ్యయం ఉపయోగపడుతోంది.ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు.చిన్న పిల్లలకు కేటాయించే సొమ్మును కూడా ఆరగించే దయలేని కర్కశ హృదయులు మన సమాజంలో ఎంతో మంది ఉన్నారు. బాల్వాడీలకు కేటా యించే పాలపొడిని,హాస్టళ్ళకు కేటాయించే పప్పులు, బియ్యాన్ని పక్కదారి పట్టించే వారి కథలను సినిమాల్లో చూపిస్తున్నారు.సమాజంలో జరిగితేనే తాము చూపి స్తున్నట్టు సినిమావారంటున్నారు.అది నిజమే. అందు వల్ల కరోనా అనాథలకు ప్రభుత్వం అందజేస్తున్న సొమ్ము అసలైన లబ్ధిదారులకు చేరేట్టుచూడాల్సిన బాధ్యత సంబంధితఅధికారులపై ఉంది. అలాగే, రాజకీయనాయకులు ఇలాంటి పథకాల జోలికి రాకుండాఉండటం ఉత్తమం. సమాజంలో దయ, కారు ణ్యం, క్రమంగా కనుమరుగు అవుతున్నాయి. ప్రధాన మంత్రి కి కూడా ఈ విషయంతెలుసు.అందుకే ఆయన ఈ పథకాన్ని అమలు జరిపేందుకు సమయం తీసుకోవ డానికి అన్ని స్థాయిల్లో అన్ని తనిఖీలు పూర్తి అయిన తర్వాతనే దీనిని ప్రారంభించినట్టు పేర్కొన్నారు.

అంతేకాకుండా ఆరంభ శూరత్వం కాకుండా కరోనా వల్ల అనాథలైన పిల్లలు జీవితంలో స్థిరపడేవరకూ వారికి చేయూతనివ్వడం అత్యవసరం. రాష్ట్ర స్థాయిలో ముఖ్య మంత్రి సహాయ నిధి,జాతీయస్థాయిలో ప్రధానమంత్రి సహాయ నిధి ఉండగా పిఎం కేర్స్‌ నిధిని ఏర్పాటు చేయడం ఎందుకని ప్రారంభంలో ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. అయితే, కరోనా వల్ల అనాథలైన వారికి సాయం అందించేందుకు ఈ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని ప్రధాని స్పష్టం చేసి విమర్శకుల నోరు మూయించారు. రాజకీయాలకు అతీతంగా అనాథలను ఆదుకునేందుకు రామకృష్ణమిషన్‌ వంటి స్వచ్చంద సంస్థలు దశాబ్దాలుగా కృషి చేస్తున్నాయి.తుపాను, ఉప్పెన వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులకు ఇళ్ళు కట్టించి ఇచ్చే బాధ్యతను రామకృష్ణమిషన్‌ తీసుకుంటోంది. మతంతో సంబంధం లేకుండా పేద వారు ఏ కులం, మతం వారైనా ఆ సంస్థ సాయం అందిస్తోంది. అలాంటి సంస్థలు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి. అవినీతి గాలి తగలకుండా పేదలు, అన్నా ర్తులు, అనాథలకు సేవలందిస్తున్న సంస్థలు లేకపోలేదు. అలాంటి సంస్థలకు ప్రభుత్వప్రోత్సాహం ఉండాలి. అలాగే, అలాంటి సంస్థలు తమ నిజాయితీనీ, కాపాడుకు నేందుకు ప్రయత్నించాలి.కరోనా కాలం ఒక పీడ కల.దానిని తల్చుకుంటేనే వణుకు పుడుతుంది. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని ప్రార్ధిద్దాం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement