Saturday, November 23, 2024

స్వీయ నియంత్ర‌ణే క‌వ‌చం…

సామాజిక మాధ్యమాలను నిషేధించాలన్న పిటిషన్‌ను పురస్కరించుకుని గతంలో సుప్రీంకోర్టు అది సాధ్యం కాదని స్పష్టంచేస్తూ,ఆ మాధ్యమాలు స్వీయనియంత్ర ణను పాటించాలని సలహాఇచ్చింది.స్వీయ నియంత్రణ అంటే లక్ష్మణరేఖ. ప్రతిపనిలోనూ స్వీయనియంత్రణను పాటిస్తే ఏ గొడవా ఉండదు. ఆవేశకావేశా లు పెల్లుబకడానికి విశృంఖలమైన స్వేచ్ఛ కారణమన్న అభిప్రాయంలో వాస్తవం ఉంది. వాక్‌ స్వేచ్ఛ అనేది రెండు వైపుల పదును ఉన్న కత్తి లాంటిది. దానిని మంచికి ఉపయోగించినట్టే, చెడుకూ ఉపయోగించవచ్చు.స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో వాక్‌ స్వేచ్ఛను ఆచితూచి వినియోగించేవారు. పరులను దూషించడం, నిందలు వేయడం,ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వంటివి ప్రస్తుత కాలంలోనే చూస్తున్నాం.మైండ్‌ గేమ్‌ పేరిట ఆవలి వ్యక్తుల మనసులో ఉన్న భావాలనూ, అభిప్రాయాల ను వెల్లడింపజేసేందుక చీకట్లో రాయి వేసే ధోరణి పూర్వం కూడా ఉండేది కానీ,ఈ మధ్య కాలంలో అదే ప్రధానంగా వ్యక్తం అవుతోంది.రాజకీయ రంగంలో వార్తలకు సంబంధించి సామాజిక మాధ్యమాలు అతిని ప్రదర్శించే ధోరణి కూడాఈ మధ్యనే పెరిగింది. ఎదుటి వారిపై ఎంత తీవ్ర స్థాయిలోవిరుచుకుని పడితే అంత దమ్మున్నట్టుగా చెప్పుకోవడం కూడా ఈ మధ్యనే ప్రారంభమైంది.అదే రీతిలో తమ వ్యక్తిగత విషయాల్లోకి ఇతరులు చొచ్చుకుని వస్తే తమ హక్కులకు భంగం కలుగుతోందంటూ తమ వనరులద్వారా ధ్వజమెత్తే వారు, ఇతరులపై తాము చేసిన దాడి వల్ల వారికి కూడా అలాంటి నష్టమే జరుగుతోందనే ఇంగితా న్ని గ్రహించడం లేదు.సామాజిక మాధ్యమాల్లో పార్టీలు, వ్యవస్థల ఆంతరంగిక విషయాల గురించే కాకుండా వ్యక్తుల ఆంతరంగిక జీవితాల గురించి కూడాజోరుగా వార్తలువస్తున్నా యి. పెళ్ళి కాని ఆడపిల్లలపై అనుచితమైన, అవాస్తవమైన కథనాలు రావడంతో వారు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనల గురించి నిరంతర వార్తా స్రవంతుల్లో నిత్యం చూస్తూనే ఉన్నాం. అలాగే, ఫేస్‌బుక్‌ పరిచయాలు ఆడపిల్లల జీవితాలను ఏవిధంగా బుగ్గిపాలు చేస్తున్నాయో కూడా కథనాలను చదువుతూనే ఉన్నాం.ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దేశ సమగ్రత,సమైక్యతకు భంగం కలిగించే రీతిలో సమాచారం ఈ మాధ్యమాల ద్వారా ప్రసారమవుతోంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందిస్తున్న వారి ట్విట్టర్‌ ఖాతాలను రద్దు చేయాలని ట్విట్టర్‌ యాజ మాన్యాన్ని ఈ నెలారంభంలో కేంద్ర ప్రభుత్వం కోరింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకం గా సాగుతున్న ఆందోళనను ఆసరాగా చేసుకుని ప్రభుత్వంపై విద్వేషాన్ని పెంచే రీతిలో పాకిస్తాన్‌, ఖలిస్తాన్‌ వాదులు ప్రచారం చేస్తున్నట్టు వేగుల ద్వారా సమాచారం రావడంతో కేంద్రం ట్విట్టర్‌ యాజమాన్యాన్ని ఈ విధంగా ఆదేశించింది.ఖలిస్తాన్‌ మద్దతుదారులకు చెందిన 1178 ఖాతాలను రద్దు చేయాలని కేంద్రం ట్విట్టర్‌ ను కోరింది. అయితే, ఆ సంస్థ ఆ ఖాతాలను లోతుగా పరిశీలన జరిపి 500 ఖాతాలను నిషేధించింది. ట్విట్టర్‌ సంస్థ తన చర్యలన్నింటినీ బ్లాగ్‌లో చేర్చడంపట్ల మన దేశం తీవ్ర నిరసన తెలిపింది. ట్విట్ట ర్‌లో ఖాతా లు తొలగించడమో,డిలీట్‌ కావడమో జరుగుతుండటంతో ఇటీవల చాలా మంది స్వదేశీ యాప్‌ క్యూలో చేరుతున్నారు.కేంద్రమంత్రులు కూడా ఈ కొత్త యాప్‌లో చేరుతున్నారు. ట్విట్టర్‌కే కాదు వాట్సాప్‌కు కూడా స్వదేశీ యాప్‌లను రూపొందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో స్వీయనియంత్రణ లేకపోవడం వల్ల విపరిణామాలు సంభవిస్తున్నాయని మైక్రో సాఫ్ట్‌ అధినేత సత్య నాదెళ్ళ కూడా అంగీకరించారు. ట్విట్టర్‌లో పోస్టు చేసేటప్పుడు ఎవరైనా జాగ్రత్తలు పాటించాలనీ, స్వీయ నియంత్రణను పాటించాలనీ, అలాగే,ట్విట్టర్‌ యంత్రాంగం కూడా ఈ విషయమై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. వ్యక్తుల పరువు ప్రతిష్టల విషయంలో సమాచారాన్ని ఎటువంటి ఆరోపణలూ,విమర్శలూ రాకుండా అందించాలని ఆయన సూచించారు. ట్విట్టర్‌ యాజమాన్యం స్వయం నియంత్ర ణను పాటించేట్టు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ఖాతాను సైతం నిలిపివేసిన ఉదంతాన్ని ట్విట్టర్‌ గుర్తు చేసింది. ట్రంప్‌ తిరిగి అధ్యక్షుడు అయినా ఆయన ఖాతాను పునరుద్ధరించే ప్రసక్తి లేదని స్పష్టంచేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement