Tuesday, November 26, 2024

రష్యా స్వయంకృతం!

రష్యా సరిహద్దుల్లో ఉన్న పట్టణాన్ని ఉక్రెయిన్‌ దళాలు చేజిక్కించుకోవడం ఆరునెలలుగా సాగుతున్న భీకర యుద్ధంలో కీలక మలుపు.ఇది రష్యన్‌ సైనికుల నైతిక స్థయిర్యాన్నీ దెబ్బతీస్తుంది.రష్యాపతనానికి ఇది నాంది ప్రపంచ దేశాల హెచ్చరికలనూ, సలహాలను పెడ చెవిన పెట్టి ఆరు నెలల నుంచి దాడులు చేస్తున్న రష్యాకు ఎదురు దెబ్బ. ఇది పూర్తిగా రష్యా స్వయంకృతం. ఆయుధ, సైనిక బలగాల్లో అగ్ర దేశమైన రష్యాను ఉక్రెయిన్‌ దళాలు ఎదిరించి పోరాడటం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ఘట్టం. ఉక్రెయిన్‌కి అమెరికా, దాని మిత్రదేశాలూ ఆయుధ సంపత్తిని సమకూర్చుతున్న మాట నిజమే కానీ, రష్యన్‌ దళాలతో పోలిస్తే ఉక్రెయిన్‌ దళాల సంఖ్య తక్కువ. అయితే, పోరాట పటిమలో రష్యాను మించిన యోధులు ఉక్రెయిన్‌లో ఉన్నారు. వారి దేశ భక్తి, జాతీయాభిమానం ఉక్రెయిన్‌ దళాలకు నిరంతరం స్ఫూర్తిని ఇస్తున్నాయి. ఎంతో మంది వీరులు నేలకొరిగినా, ఏమాత్రం వెనుదిరగకుండా ఉక్రెయిన్‌ దళాలు జరుపుతున్న పోరు కారణంగానే కొద్ది నెలల క్రితం రష్యా స్వాధీనం చేసుకున్న ఖార్ఖీవ్‌ సమీపంలోని కుపియాన్‌ స్క్‌ నగరాన్ని తిరిగి కైవసం చేసుకున్నారు. ఖార్ఖీవ్‌ని చేజార్చుకున్నట్టు రష్యన్‌దళాలు అంగీకరించాయి. రష్యన్‌ దళాల్లో నిరాశా నిస్పృహలు చోటు చేసుకుంటున్నాయి.

ఆరు మాసాలుగా భార్యాబిడ్డలకు దూరంగా రష్యన్‌ దళాలు పోరాడుతున్నాయి. రష్యన్‌ సైనికుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యన్‌ దళాలు ఇప్పుడు నష్టాన్ని తగ్గించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆయుధపరంగా, సైనిక పరంగా రష్యా బాగా దెబ్బతింది. అమెరికా, దాని మిత్ర దేశాలు విధించిన ఆంక్షల కారణంగా ఆదాయం బాగా తగ్గిపోయింది. గతంలో రష్యా ఆయుధాలు, ఆహార ధాన్యాలు, చమురు కోసం ఎదురు చూసినదేశాలన్నీ ఇప్పుడు ప్రత్యామ్నా యమార్గాలను చూసుకున్నాయి. తూర్పు ప్రాంతంలోని స్వాథేని కూడా ఉక్రెయిన్‌ దళాలు కైవసం చేసుకోవడంతో వెనుదిరగాలని రష్యా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. స్వాథే వ్యూహాత్మకంగా కీలకమైనప్రాంతం. రష్యాకు జరిగే సరఫరాలన్నీ ఈ ప్రాంతం నుంచే జరుగుతాయి. అంతేకాక, అణు విద్యుత్‌ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తే అంతకు అంత బదులు ఇవ్వాలని ఉక్రెయిన్‌ దళాలు నిర్ణయించాయి. రష్యా అధీనంలో ఉన్న ఝాపోర్జియో అణు విద్యుత్‌ కేంద్రాన్ని ముందు జాగ్రత్త కోసం మూసివేసింది. ఈ కేంద్రంపై దాడి జరిగితే యావత్‌ యూరప్‌కీ విద్యుత్‌ ఆగిపోతుంది. రష్యాపై యూరప్‌ దేశాల ఒత్తిడి కూడా రష్యా నిర్ణయానికి కారణమై ఉంటుంది.

ఖార్కీవ్‌ నుంచి డోనేస్టెక్‌ కు రష్యన్‌ దళాలు తిరుగు ముఖం పట్టాయనీ, వారిలో చాలా మంది స్వస్థలాలకు ఎప్పుడు వెడదామా అనే ఆత్రుతలో ఉన్నారనీ, సైనిక నష్టాన్ని తగ్గించేందుకు మూడురోజుల పాటు రష్యన్‌ సేనల ఉపసంహరణను రష్యన్‌ సైనికాధి కారులు పథకం ప్రకారం నడిపిస్తున్నారని రష్యా రక్షణ దళ ప్రతినిధి తెలియజేశారు. సైనికులకు ఇంతకాలం అందించిన సాయాన్ని కొనసాగించలేని స్థితిలో రష్యా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. అన్నింటికీ మించి రష్యన్‌ సైనికులలో చాలా మంది హోమ్‌ సిక్‌ అయినట్టు భోగట్టా. రష్యా సీనియర్‌ అధికారులను ఇప్పటికే కోల్పోయింది. మిగిలిన సీనియర్‌ అధికారులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపేందుకు ఉక్రెయిన్‌ సైన్యంలో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేశారు. మామూలు సైనికులను రిక్రూట్‌ చేసుకోవడం సులభమే. కానీ, మేజర్‌ స్థాయి సీనియర్‌ అధికారులను పోగొట్టుకుంటే కష్టమే. అందుకే, రష్యా పునరాలోచన చేసి ఉంటుంది. అందుకే, ఖార్కీవ్‌ నుంచి సేనలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుని ఉండవచ్చు. అంతేకాక, అమెరికా, దాని మిత్ర దేశాల ఒత్తిడి ఇటీవల బాగా పెరిగింది. డోన్‌స్టెక్‌ ప్రాంతంలో పరిస్థితి విషమంగా ఉందనీ, అడుగు పెట్టడానికి వీలు లేకుండా భీకరమైన పోరు సాగుతోందని ఒక మేజర్‌ తెలిపారు.

పరిస్థితిని బట్టి వెనక్కి తగ్గడంలో తప్పేమీ లేదని ఆయన సమర్ధించుకున్నారు. గత మే నెలలో రష్యా చేజిక్కించుకున్న పలు ప్రాంతాలను ఉక్రెయిన్‌ తిరిగి స్వాధీనపర్చుకునే క్రమంలో ఉంది. అక్కడ రష్యన్‌ సైనికులు ఉక్రెయిన్‌ సైనికులకు గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నారు. డోన్‌స్టెక్‌లోని లుగాన్‌స్క్‌, లేమాన్‌ వంటి ప్రాంతాలను 2014లో రష్యా చేజిక్కించుకుంది. అప్పటి నుంచి ఆ ప్రాంతాలను తిరిగి కైవసం చేసుకునేందుకు ఉక్రెయిన్‌ పట్టుదలతోఉంది. ఉక్రెయిన్‌ సేనలకు స్థానికుల మద్దతు లభిస్తోంది. పుతిన్‌ తలబిరుసు తనం వల్లనే రష్యా అవమానం పాలైందని వారు వ్యాఖ్యానించారు. రష్యా వెనుదిరగడాన్ని యూరప్‌కి చెందిన మేథావులు స్వయంకృతంగా పేర్కొంటున్నారు. రష్యా ఎన్ని బలగాలను మోహరించినా ఖార్ఖీవ్‌లో ఓటమి తప్పలేదనీ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement