ప్రపంచంలో మూడింట ఒకవంతు ప్రజానీకం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడటం ఖాయమని అంతర్జాతీ య ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. కొత్త సంవత్సరంలో కొత్త విషయాలను చెప్పి ప్రజలను ఆనందింప జేయాల్సిన అంతర్జాతీయ ఆర్థికసంస్థ ఈ వార్తను మోసు కుని వచ్చి కోట్లాది ప్రజలను ఉస్సూరుమనిపించింది. అమెరికా, యూరోపియన్ యూనియన్‌లలో పరిస్థితి గత ఏడాది కన్నా మరింత తీవ్రంగా ఉండవచ్చని ఐఎం ఎఫ్ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పెరగడానికి ఉక్రెయిన్‌పై రష్యాజరుపుతున్న దాడి ప్రధాన కారణమన్నది వాస్తవమే కానీ, చైనాలో కరోనా మళ్ళీ తిరగబెట్టడం, అక్కడి తయారీ రంగం పూర్తిగా దెబ్బతినడం ఒక కారణంగా భావించవచ్చు. మన దేశంలో తయారీ రంగం కొద్దిగా కోలుకున్నా రష్యా దిగుమతుల పై ఆధారపడిన ఇతర రంగాల్లో పరిస్థితి దారుణంగానే ఉంది. పాకిస్తాన్ తరహాలో ఆర్థిక మాంద్యంలోకి నెట్ట బడిన శ్రీలంకలో పరిస్థితి భారత్ ఇచ్చిన సహాయంతో కొంత తేరుకుంది. ఐఎంఎఫ్ అధినేత్రి క్రిష్టినా జార్జియేవా ఆదివారం అమెరికాకి చెందిన ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా, బ్రిటన్‌లలో కూడా పరిస్థితి ఏమంత సవ్యంగా లేదని అన్నారు. అగ్రరాజ్యంలో కూడా కోట్లాది మందిపై మాంద్యం ప్రభావం ఉందని ఆమె అన్నారు. అమెరికా ఎక్కువగా చైనా దిగుమతులపై ఆధారపడిందనీ, చైనాలో పరిస్థితి దిగజారడంతో దాని ప్రభావం అన్ని దేశాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని ఆమె అన్నారు.
భారత్‌లో పరిస్థితి క్రమంగా మెరుగవుతున్న తరుణంలో మళ్ళీ కరోనా విజృంభించడం ఆందోళన కలిగించే విషయం. మన దేశంలో తరచూ జరిగే ఎన్నికలవల్ల ఆర్థిక వ్యవస్థ పై వాటి ప్రభావం కనిపిస్తోంది. ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటీవల గుజరాత్, ఢిల్లి, హిమాచల్ ప్రదేశ్‌లలో జరిగిన ఎన్నికల్లో కోట్లాది రూపాయిలు చేతులు మారాయి. నల్ల ధనాన్ని అరికడితామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అది ప్రభుత్వం వల్ల కావడం లేదు. తీసుకున్న రుణాలను చెల్లించడంలో విఫలమవుతున్న కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేక పోతోంది. మొండి బకాయిలనేవి మనం ఎంతో గొప్పగా చెప్పుకునే అమెరికాలో సైతం ప్రభుత్వ ఆర్థికవ్యవస్థపై గుదిబండగా మారాయి. అమెరికా అధ్యక్షుడు బిడెన్ దేశంలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంలో విఫలమయ్యారనే మాట అందరిలోనూ వినిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వృద్ది రేటు 2021 నుంచి పరిశీలిస్తే క్రమంగా తగ్గుతోంది. దీనికి కోవిడ్ వ్యాప్తి కారణంగా చెబుతున్నా, వివిధ దేశాల్లో ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల్లో అవి నీతి, సంపన్న వర్గాల చేతుల్లోకి ఈ పథకాల సొమ్ము చేరడం మొదలైన అంశాలే కారణమని ప్రపంచ ఆర్థిక సంస్థ అంచనా వేసింది.
చమురు ఉత్పత్తి దేశాలు అనుసరిస్తు న్న వైఖరి వర్థమాన, అభివృద్ధి చెం దుతున్న దేశాల్లో ఆర్థిక మాంద్యాన్ని సృష్టిస్తున్నది. చైనాలో జీరో కోవిడ్ విధానంపై వెల్లువెత్తిన నిరసనల కారణంగా ఆర్థిక, వాణిజ్య రంగాల్లో పరిస్థితి దెబ్బతినడంతోనూ, ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తడంతోనూ జీరో కోవిడ్ విధానాన్ని చైనా ఎత్తేసింది. దాని ప్రభావంతో లక్షలాది కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. దీని ప్రభావం చైనా ఆర్థికవిధానంపై పడవచ్చు. చైనాలో పరిస్థితిని మనకు అనుకూలంగా మలుచుకునేందుకు భారత కమ్యూనికేషన్ల రంగం ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుం ది. మన దేశంలో మొబైల్ ఫోన్ల ఎగుమతిని 49 వేల కోట్ల నుంచి లక్షకోట్లకు పెంచాలన్న లక్ష్యంతో టెలికమ్యూనికే షన్ శాఖ పని చేస్తోంది. చైనాలో ప్రస్తుతం నెలకున్న పరిస్థితులను బట్టి మొబైల్, కంప్యూటర్ రంగాల్లో మన ఉత్పత్తులను పెంచుకోవాలన్న లక్ష్యాలను ప్రధాని నిర్దే శించినట్టు ఐటి శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఐటి రంగంలో ఎగుమతులను రెట్టింపు చేయాల న్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు ఆయన చెప్పారు. మరో ఐదేళ్ల వరకూ టెక్ ఆధారిత స్టార్టప్ కంపెనీలకు ఎటువంటి ఢోకా ఉండదని ఆయన స్పష్టం చేశారు.
అలాగే, ఇతర రంగాల్లో సాంకేతిక విలువలను మెరుగు పర్చు కుంటూ అంతర్జాతీయ మార్కెట్‌లలో మన వస్తువులకు గిరాకీ పెంచేందుకు మన కమ్యూనికేషన్ల రంగం కృషి చేస్తోంది. అంతర్జాతీయంగా మాంద్యం ప్రభావం మన దేశంపై పడకుండా ఐటి రంగాన్నీ, కమ్యూనికేషన్ల రంగా న్ని బాగా ప్రోత్సహిస్తోంది. ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో 23 శాతం వృద్ది సాధించడం కూడా మనదేశానికి సంబం ధించి శుభ పరిణామమే. మేక్ ఇన్ ఇండియా కార్యక్ర మం వల్ల కూడా ఇతర దేశాల ప్రభావం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాలను ఊపేస్తున్నప్పటికీ భారత్ జి-23 దేశాల కూటమి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం చాలా గొప్ప విషయమే. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేసి భారత సంస్కృతికి అనుగుణంగానే ఉందన్నారు.