Friday, November 22, 2024

రాహుల్‌ విసుర్ల ఆంతర్యం!

రాజస్థాన్‌లోని ఉదయ్‌ పూర్‌లో మూడు రోజుల పాటు జరిగిన కాంగ్రెస్‌ చింతన్‌ శిబిరంలో అసలు విషయాన్ని పక్కన పెట్టి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టేందుకే పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ తమ ప్రసంగాలను కేంద్రీకరించారు. పార్టీ నాయకులు, ప్రతినిధులు స్వేచ్చగా తమ అభిప్రాయాలను తెలపాలని వారు అన్నప్పటికీ, ముందో ఊహించినట్టు పార్టీకి కొత్త నాయకత్వం అంశంపై ఎవరూ నోరుమెదపలేదు. మూడు రోజుల సమావేశాలు బీజేపీ ఆర్థిక,మత,రాజకీయాలను ఎండ గట్టేందుకే కేటాయించారు.రాహుల్‌ గాంధీ బీజేపీని గద్దె దించే సత్తా కాంగ్రెస్‌ పార్టీకే ఉందని స్పష్టం చేశారు. అదే సందర్భంలో ప్రాంతీయ పార్టీలపైన విమర్శలు గుప్పించారు. ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం ఉండదనీ, ప్రాంతీయ ప్రయోజనాల గురించే అవి ఆలోచిస్తాయని అన్నారు. ఆయన వాదాన్ని పార్టీ సీనియర్‌ నాయకుడు శశిథరూర్‌ సమర్ధించారు. ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఢీ కొనలేవన్న రాహుల్‌ అభిప్రాయం సరైనదేనని ఆయన అన్నారు.రాహుల్‌ తన ప్రసంగాన్ని ప్రాంతీయ పార్టీల వైపు మళ్ళించడానికి కారణం ఉంది. పదేళ్ళ పాటు కేంద్రంలో అధికారంలో కొనసాగిన యూపీఏలో భాగస్వామ్య పక్షాలు ఇప్పుడు కాంగ్రెస్‌ నేతృత్వాన్ని అంగీకరించడం లేదు.

ముఖ్యంగా, రాహుల్‌ గాంధీని కూటమి నాయకునిగా అంగీకరించేందుకు సిద్ధంగా లేవు. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాంతీయ పార్టీలతో కూటమిని కట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. యూపీఏ కూటమి విచ్ఛిన్నమైనట్టు ప్రకటించక పోయినా కొత్త కూటమి రావాలన్న ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ సారథ్యాన్ని అంగీకరించేట్టు చేయడం కోసం వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ అటూ,ఇటూ రాయ బారాలు నెరిపారు. అవి ఫలించలేదు. రాహుల్‌ తప్పుకుని మరొకరికి నాయకత్వం అప్పగించాలన్న సూచనలు కూడావచ్చాయి. కాంగ్రెస్‌లో సీనియర్ల వాదన కూడా అదే ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే ప్రాంతీయ పార్టీలపై రాహుల్‌ విసుర్లు విసిరి ఉంటారు. ప్రాంతీయ పార్టీలు ఫ్రంట్‌గా ఏర్పడితే నాయకత్వం ఎవరు వహించాలన్న ప్రశ్న తలెత్తుతుంది. ప్రాంతీయ పార్టీలు ఐక్యమైనా కూటమిని కట్టలేవన్నది రాహుల్‌ గాంధీ అభిప్రాయం. బీజేపీని గద్దెదింపగానే సరిపోదు, కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి,అందుకు అవసరమైన సత్తా కాంగ్రెస్‌కు మాత్రమే ఉందన్నది రాహుల్‌ అభిప్రాయం. ఎన్నికల ముందు మమతా బెనర్జీ ప్రధాని నరేంద్రమోడీకి దీటైన అభ్యర్ధిగా బీహార్‌ ముఖ్యమంత్రి,జనతాదళ్‌ (యు) నాయకుడు నితీష్‌ కుమార్‌ని నిలబెట్టేందుకు సాగించిన ప్రయత్నాలు ఫలించలేదు. నితీశ్‌ కుమార్‌కి బీహార్‌ ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం ద్వారా ఆయన ఇతర ప్రాంతీయ పార్టీలతో కలవకుండా మోడీ చేయగలిగారు. మమతా బెనర్జీ పేరును ఇప్పుడు కొందరు సూచిస్తున్నప్పటికీ ఆమెకుప్రాంతీయ పార్టీల్లోనే ఎక్కువ మంది మద్దతు లేదు.

అందువల్ల ప్రత్యామ్నాయ కూటమికి కాంగ్రెస్‌ పార్టీయే నేతృత్వంవహించాలని ఆ పార్టీ నాయకులు కోరుతున్నారు, రాహుల్‌ ఉద్దేశ్యం కూడా బహుశా ఇదే కావచ్చు. యూపీఏకి సారథ్యం వహించినప్పుడు కాంగ్రెస్‌లో మన్మోహన్‌సింగ్‌,ప్రణబ్‌ ముఖర్జీ వంటి హేమాహేమీలు ఉండేవారు. మన్మోహన్‌సింగ్‌ ఏ పదవులనూ నిర్వహించే స్థితిలో లేరు.ఉత్తరాదిన కాంగ్రెస్‌ పార్టీకి సమర్ధులు,నమ్మకస్తులైన నాయకులు లేరు.అందువల్ల యూపీ ఏ కూటమిని పునరుద్ధరించడం జరిగే పని కాదు. ఎవరు అంగీకరించినా, అంగీకరించక పోయినా రాహుల్‌ గాంధీయే పార్టీకి తదుపరి నాయకుడన్న సంకేతాలను సోనియా ఇప్పటికే ఇచ్చారు. అక్టోబర్‌ లో భారత్‌ జోడో యాత్రకు ఆయనే నేతృత్వం వహిస్తున్నట్టు ప్రకటన వెల్లడైంది.ఆయన ఇప్పటికే సోనియా పేరిటఆదేశాలను జారీ చేస్తున్నారు.ఆయన ఆదేశాలు జారీ చేయడం ఇష్టం లేక కేరళ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కెవి థామస్‌ పార్టీ నుంచి వైదొలగారు,అలాగే, పంజాబ్‌ ముఖ్యమంత్రి పదవి ఎంపిక విషయంలో తనను పావుగా వాడుకుని వదిలేసినందుకు జాఖడ్‌ కుమారుడు ఇటీవల పార్టీ నుంచి వై దొలగారు. 50 శాతం పదవులు యువకులకేనంటూ ప్రతిపాదనలు చేసిన ఉదయ్‌పూర్‌ శిబిరంలోనే తనకు తగిన ప్రాధాన్యం దక్కనందుకు రాజస్థాన్‌ యువనాయకుడు సచిన్‌ పైలెట్‌ అసంతృప్తితో ఉన్నారు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలతో సంబంధాలను పెంచుకోవాలన్న రాహుల్‌ సూచన సరైనదే కానీ, కొద్ది మంది తప్ప పీసీసీ అధ్యక్షుల్లో ఎంత మంది క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తున్నారు. వారికి పార్టీ లో అన్ని వర్గాల నుంచి సహకారం లభిస్తోందా అన్నది ప్రశ్న.అందువల్ల తీర్మానాలు చేయడం వేరు వాటిని ఆచరణలో పెట్టడం వేరు.ఈ స్థితిలో ఉన్న కాంగ్రెస్‌ నేతృత్వంలో పని చేసేందుకు ప్రాంతీయ పార్టీలు ముందుకురావడం లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement