Saturday, November 23, 2024

రాహుల్‌ యాత్ర…!

యాత్రలు చేస్తే కానీ అధికారంలోకి రాలేమని రాజకీయ నాయకులు గ్రహించారు. ఆనాడు స్వాతంత్య్ర సమరంలో మహాత్మాగాంధీ నిర్వహించిన పాద యాత్రలు, సత్యాగ్రహాలతో ఈనాటి నాయకుల పాద యాత్రలను పోల్చలేం. ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడానికి యాత్రలు ఉపయోగపడతాయన్న నమ్మకం నాయకుల్లో నానాటికీ పెరిగిపోతోంది. కాంగ్రెస్‌ యువ నాయకుడు రాహుల్‌ గాంధీ బుధవారం నాడు కన్యాకుమారి నుంచి ప్రారం భించిన భారత్‌ జోడో యాత్ర పన్నెండు రాష్ట్రాల మీదుగా కాశ్మీర్‌ వరకూ సాగనుంది. రాహుల్‌ గాంధీని పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని పార్టీ నాయకులు, శ్రేణులు కోరుతున్నవేళ ఆ డిమాండ్‌కి ఆయన ససేమిరా అంటూనే జోడో యాత్రకు బయలు దేరారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలనపై పెరిగిన అసంతృప్తిని ఆసరాగా చేసుకుని పాలనలోమార్పు కోసం ఆయన ఈ యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రవల్ల ఆయన ఆశించిన ఫలితం ఒనగూరుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నట్టే, దీంతో తమ పార్టీకి మంచి రోజులు రానున్నాయని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారు. రాహుల్‌ పాదయాత్ర ప్రారంభించడానికి ముందు డీఎంకె అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.

బీజేపీ ని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రుల్లో స్టాలిన్‌ది భిన్నమైన వైఖరి. ఆయన ఇంతవరకూ ప్రధాని నరేంద్రమోడీని వ్యక్తిగతంగా విమర్శించకపోయినా, మోడీ విధానాలపై సమయం వచ్చినప్పుడల్లా తన అభిప్రాయాలను స్టాలిన్‌ కుండబద్దలు కొడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లిలో జరిగిన సమావేశంలోకూడా ఆయన రాష్ట్రాలకు నిధుల విషయంలో అన్యాయం జరుగుతోందని బహిరంగంగానే విమర్శించారు. అయితే, బీజేపీయేతర ముఖ్యమంత్రులను కలవడం, మోడీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో చురుకుగా పాల్గొనడం వంటివి చేయడం లేదు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో డీఎంకె బీజేపీతో సన్ని హితంగా మెలిగింది. ఆయన కేబినెట్‌లో కరుణానిధి మేనల్లుడు మురసోలి మారన్‌ మంత్రిగా కూడా పని చేశారు. అయితే, స్టాలిన్‌ మాత్రం బీజేపీకి దూరంగానే ఉంటున్నారు. అలాగే, యూపీఏకి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌తోనూ స్టాలిన్‌ ఎక్కువ సన్నిహితంగా ఉండటం లేదు. ఈ నేపథ్యం నుంచి చూస్తే స్టాలిన్‌ రాహుల్‌కి స్వాగతం చెప్పేందుకు కన్యాకుమారికి స్వయంగా రావడమే కాక, వివిధ అంశాలపై రాహుల్‌తో చర్చలు జరపడాన్ని బట్టి బీజేపీయేతర నాయకులంతా ఏకతాటిపైకి వచ్చేం దుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం అవుతోంది.

కర్నాటకలో కూడా రాహుల్‌కి స్వాగతం చెప్పేందుకు పీసీసీ అధ్యక్షుడు డికె శివకుమార్‌, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మహారాష్ట్రలో మాజీ మంత్రులు, సీనియర్‌ నాయకులు రాహుల్‌కి స్వాగతం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని రాహుల్‌ చేపడతారా లేదా అనేది ఆ పార్టీ ఆంతరంగిక వ్యవహారం. అలాగే, రాహుల్‌ని మొదట ప్రోత్సహించిన నాయకులే ఇప్పుడు వ్యతిరేకి స్తున్నారు. ఆ విషయాల్లోకి వెళ్తే వివాదం చెలరేగే అవకాశాలు ఉన్నందున రాహుల్‌ చాలా తెలివిగానే తన యాత్రను కొనసాగించేందుకు నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కూడా రాహుల్‌ నాయకత్వాన్ని సమర్ధించేవారు ఎక్కువమంది ఉన్నారు. నెహ్రూ కుటుంబ వారసులు తప్ప మరొకరు కాంగ్రెస్‌ నాయకత్వాన్ని చేపడితే పార్టీలో చీలిక వస్తుందనే బెదురు చాలా మందిలో ఉంది. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ని చేపట్టమన్న డిమాండ్‌ స్థిరంగా కొనసాగడానికి కారణం అదే. తమిళనాడులోనే ఈ యాత్రను రాహుల్‌ ప్రారంభించడానికి శ్రీపెరుంబదూర్‌లో తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకు గురి కావడం మొదటి కారణం కాగా, ఆ రాష్ట్రంలోబీజేపీ ప్రభావం తక్కువ కావడం మరో కారణం.

అంతేకాక, సెక్యులర్‌ శక్తులను ఏకం చేయడమే లక్ష్యంగా తాను యాత్ర జరుపుతున్న దృష్ట్యా తమిళనాడు సరైనదని రాహుల్‌ భావించి ఉండ వచ్చు. కర్నాటక ఒకప్పుడు కాంగ్రెస్‌కి పెట్టని కోటగా ఉండేది. గ్రూపు రాజకీయాల వల్ల కాంగ్రెస్‌ చేజారింది. కేరళ నుంచి రాహుల్‌ లోక్‌సభలో ప్రాతి నిధ్యం వహిస్తుండటం, అక్కడ పార్టీలన్నీ సెక్యులర్‌వే కావడం కాంగ్రెస్‌ యాత్రకు సానుకూలంగా ఉంటుందని భావించి ఉండవచ్చు. గ్రూపు రాజకీయాలు అంతగా లేని రాష్ట్రాలనే రాహుల్‌ ఎంచుకుని ఉన్నారని భావించవచ్చు. ఈ యాత్రకు కాశ్మీర్‌లో ముంగిపు పలకడంలో కూడా విశేషముంది. మాజీ కేంద్ర మంత్రి గులామ్‌ నబీ ఆజాద్‌ తనను విమర్శిస్తూ పార్టీని వీడిన దృష్ట్యా పార్టీలో అందరికీ సరైన సమాధానమిచ్చేందుకు కాశ్మీర్‌ మంచి వేదిక అవుతుందని కూడా రాహుల్‌ భావించి ఉండవచ్చు. బీజేపీపై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకోవడం రాహుల్‌ చాకచక్యానికి పరీక్షే.

Advertisement

తాజా వార్తలు

Advertisement