నేపాల్ ప్రధానిగా సిపిఎన్ – మావోయిస్టు సెంటర్ నాయకుడు పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. నేపాల్‌లో రాచరిక వ్యవస్థ అంతరించిన తర్వాత రాజకీయ అస్థిరత అనివార్యమైనట్టుగా కనిపిస్తోంది. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీలు సంకీర్ణాలుగా ఏర్పడి ప్రభుత్వంలో కొనసాగుతున్నాయి. అయితే, సంకీర్ణం లోని భాగస్వామ్య పక్షాల మధ్య ప్రధాన మంత్రి పదవిపై తరచూ గొడవలు తలెత్తుతుండటంతో రాజకీయ అస్థిరతకు దారితీస్తోంది. నేపాల్ పార్లమెంటుకు గత నెలలో ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీకీ స్పష్టమైన మెజా రిటీ రాలేదు. పార్లమెంటులో మొత్తం స్థానాల సంఖ్య 275 కాగా, ప్రభుత్వం ఏర్పాటుకు138 సీట్లు అవసరం. సాధారణంగా సంకీర్ణ కూటముల్లో మెజారిటీ పార్టీ నాయకునికే పదవి దక్కుతూ ఉంటుంది. కానీ, ప్రచండ ప్రాతినిధ్యం వహిస్తున్న సీపీఎన్ మావోయిస్టు సెంటర్‌కి 32 స్థానాలు మాత్రమే వచ్చాయి. నేపాలీ కాంగ్రెస్ పార్టీకి 89 సీట్లు రాగా, సీపీఎన్ యూఎంఎల్ పార్టీకి 78 స్థానాలు లభించాయి. నేపాల్ రాజకీయాల్లో మాజీ ప్రధానులు ఎక్కువ మంది ఉండటానికి కారణం సంకీర్ణాలు ఎక్కువ కాలం నిలవకపోవడమే.
నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవుబాకీ ప్రచండకీ మధ్య ప్రధానమంత్రి పదవి పంపకం విషయంలో అంగీకారం కుదరకపోవడం వల్ల ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు ప్రచండ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని సీపీఎస్ యూఎంఎల్ మద్దతుతో ప్రచండ ప్రధాని పదవిని చేపట్టారు. వీరిద్దరికీ రాజకీయంగా పొసగదు. ప్రచండ భారత్‌కి అనుకూలం కాగా, ఓలి చైనాకి అనుకూలం. ఓలీ చైనా మద్దతుతో భారత్‌పై దాదాపు యుద్ధాన్నే చేశారు. కాలాపానీ ప్రాం తం తమ దేశంలోనిదేనని వాదించారు. భారత్‌కి వ్యతిరేకంగా చైనాతో జత కట్టారు.ఓలీ మొదటి నుంచి అనుసరిస్తున్న తీరు వల్ల ఇరుదేశాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు ప్రచండకు తక్కువ స్థానాలున్నా, ఆయనకు మద్దతు ఇస్తున్న ప్రచండ ద్వారా భారత్‌తో ఘర్షణకు తలపడాలన్నది ఓలీ ఉద్దేశ్యం కావచ్చు. ఓలీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కి సన్నిహితుడు. ఓలీ ప్రధానిగా ఉన్నప్పుడే నేపాల్ మీదుగా మహామార్గాన్ని నిర్మించేందుకు జిన్‌పింగ్ పథకాన్ని రూపొందించారు.నేపాల్‌లో ఓలి తప్ప మిగిలిన పార్టీల్లో అధిక సంఖ్యాకులు చైనాకు సన్నిహితం కావడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
మహామార్గం నిర్మాణానికి భూటాన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి చైనా ప్రయత్నిం చింది. డోక్లామ్ వద్ద ఘర్షణకు అదే కారణం. భూటాన్‌కి మన దేశం ఇచ్చిన అభయం కారణంగా చైనా ప్రయత్నాలు నెరవేరలేదు. భారత మిత్ర దేశాలను, భారత పొరుగుదేశాలను సహాయం పేరిట తన వైపునకు తిప్పుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. అలాగే, సాయం పేరిట ఆయా దేశాలను శాశ్వతంగా తనపై ఆధారపడేట్టు చేస్తోంది. నేపాల్‌లో ప్రధాని పదవి నుంచి ఓలీ దిగిపోయిన తర్వాత అధికారంలో ఉన్న ప్రభుత్వం చైనాతో అంటీఅంటనట్టుగా వ్యవహరించింది. ఇప్పుడు ఓలీ ఒత్తిడి కారణంగా, ప్రచండ ప్రభుత్వం తన అభిప్రాయాలకు విరుద్ధంగా చైనాతో సానుకూలంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. నేపాల్‌లో రాజకీయ సంక్షోభం వెనుక చైనా హస్తం ఉందనే అనుమానాలు నిరాధారం కాదు. నేపాల్ మీదుగా రహదారులు నిర్మించడం, సహజవనరులను దోచుకోవడం చైనా లక్ష్యంగా కనిపిస్తోంది. భారత్‌తో సన్నిహితంగా ఉన్న దేశాలను భారత్‌కి దూరం చేసి ఆధిపత్యాన్ని సాధించడమే చైనా ఎత్తుగడ.
అయితే, ఓలీ ఒత్తిడిని ప్రచండ ఎంత వరకూ తట్టుకుని నిలబడతారో వేచి చూడాలి. కిందటిసారి ప్రధానిగా ప్రమాణం చేసిన వెంటనే ప్రచండ చైనా పర్యటనకు వెళ్లలేదని జిన్‌పింగ్ ఆగ్రహించారు. ఈసారి అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ప్రచండ జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ప్రచండకు మన దేశంలోని కమ్యూనిస్టు పార్టీలు, ఇతర లౌకిక పార్టీలతో పాటు మన ప్రధాని మోడీతో మం చి సంబంధాలున్నాయి. ప్రచండకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని మోడీ ఆకాంక్షించారు. మోడీతో సత్సంబంధాలను జిన్‌పింగ్ ఎంతవరకూ అంగీకరిస్తారో వేచి చూడాలి. అంతేకాకుండా చైనాకి వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేసిన క్వాడ్ కూటమిలో భారత్ భాగస్వామి కావడం చైనాకు కంటకింపుగా ఉంది. ఈ నేపథ్యం నుంచి పరిశీలిస్తే నేపాల్‌ని కంట్రోల్ చేయడానికి చైనా ప్రయత్నించవచ్చు. ప్రచండ భారత్‌కి అనుకూలుడే అయినా ఓలీ ఒత్తిడి కారణంగా దూరం కావచ్చు. పొరుగుదేశంలో పరిణామాల ప్రభావం మన దేశంపై ఉండవచ్చు.