Saturday, November 23, 2024

నేటి సంపాదకీయం – పెట్రో మంటకు ఊరటేది?

పెట్రో ధరల నుంచి ఇప్పట్లో ఊరట లభించే సూచనలు కనిపించడం లేదు. ప్రతి రోజు పెట్రో వాత తప్పడం లేదు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎప్పుడో సెంచరీని దాటేశాయి. తాజాగా ఆదివారం నాడు పెంచిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.09కి, డీజిల్‌ ధర రూ.103.18 చేరుకున్నది. అదే సమయంలో విమానాలలో వినియోగించే ఎయిర్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌) ధర కన్నా ఇది ఇంచు మించు 27 రూపాయలు ఎక్కువ అంటూ వచ్చిన వార్తలు సగటు జీవిని ఆలోచనలో పడేశాయి. కరోనా కష్ట కాలంలో పన్ను ఆదాయం తగ్గిపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలియం అమ్మకం ద్వారా వచ్చే నిధులపైనే గంపెడాశలు పెట్టుకున్నాయి. అందుకే.. కరోనా సమయంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధర తగ్గినా… దేశీయంగా రేట్లు తగ్గించకుండా నష్ట నివారణకు పూనుకున్నాయి. దాదాపు 80 రోజులు ఎలాంటి సవరణలు చేయలేదు. ఆ తరువాత కరోనాకు టీకాలు వస్తున్నాయని, ఆంక్షల సడలింపులు ప్రారంభం కావడంతో పెట్రోలియం వినియోగం కూడా పెరిగి ముడి చమురు ధరలు మళ్లిd రాజుకున్నాయి. దీంతో దేశంలోని చమురు విక్రయ సంస్థలు పెట్రో రేట్లను సవరించడం మొదలు పెట్టాయి. గతంలో పెట్రోలియం ధరలను ప్రభుత్వమే ఖరారు చేసేది. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ఈ అధికారాన్ని ప్రభుత్వ రంగ పెట్రోలియం సంస్థలకే కేంద్రం దఖలు పరిచింది. అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్‌ ధర, రూపాయి – డాలర్‌ మారకం రేటు ప్రాతిపదికగా ఈ ధరలను లెక్కగడుతున్నాnయి. ఇప్పుడు రోజూ వారీగా ఈ రేట్ల సవరణ ప్రక్రియ సాగుతున్నది. అయితే… ఈ ప్రక్రియలో ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఒక వేళ తగ్గినా అది నామమాత్రమే. పెట్రోల్‌ ధరలు ఇంతగా పెరగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న ఎక్స్‌యిజ్‌ సుంకాలు, వ్యాట్‌ పన్ను, ఇతర సెస్‌లే ప్రధాన కారణం. పెట్రోల్‌ ధరలో దాదాపు 63 శాతం వాటా ఈ పన్నులదే అని ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయి. డీజిల్‌ ధరలో కూడా పన్నుల వాటా అటూఇటుగా ఇంతే ఉంటుంది. 2019-20లో పెట్రో ఉత్పత్తుల ద్వారా కేంద్రం రూ. 3,34,314 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. అదే సమయంలో రాష్ట్రాలకు 2,21,055 కోట్ల ఆదాయం అందింది. 2014-15లో ఇది 1,72,065 కోట్లు (కేంద్రం), రూ. 1.60,554 కోట్లు (రాష్ట్రాలు) ఉండేది. నాలుగేళ్లలోనే అంటే 2018-19 నాటికి ఈ ఆదాయం రెట్టింపు అయింది. ప్రభుత్వాల దొంగ దెబ్బను గమనించిన పలువురు నిపుణులు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్‌ చేయడం ప్రారంభించారు. జీఎస్టీ పరిధిలోకి తెస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చాలా వరకు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. కానీ… పెట్రోలియం ఆదాయంపై ఆధారపడిన రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు సిద్ధపడడం లేదని ఆ మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఏతావాతా… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సామాన్యుడికి పెట్రో మంట పెడుతున్నాయి. విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) కిలో లీటర్‌ (1000 లీటర్లు) గరిష్ట ధర రూ.83 వేలు మాత్రమే కావడాన్ని కొందరు ఈ సందర్భం గా ప్రస్తావిస్తున్నారు. వారి లెక్కల ప్రకారం విమాన ఇంధనం లీటర్‌కు రూ. 83 మాత్రమే. విమాన ఇంధనంతో పెట్రోల్‌ను సరిపోల్చలేకపోయినా.. సామాన్యులపై పెట్రో భారం తగ్గించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా గుర్తించాలి. ఇప్పటికే గ్యాస్‌ బండ భారం సామాన్యులకు మోయలేనంత స్థాయికి చేరుకున్నది. ఇప్పుడు దీనిపై ఇస్తున్న సబ్సిడీ కేవలం రూ. 40కి పరిమితమైంది. త్వరలోనే అదీ ఉండకపోవచ్చు. ఒక వంక పేదలకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌ ఇస్తూ… సిలిండర్‌ ధరను మాత్రం మోయలేనంతగా పెంచితే… దాని వల్ల ఉపయోగం ఏమిటో ప్రభుత్వంలోని పెద్దలు ఆలోచించాలి. కరోనా ముందుకాలంతో పోల్చుకుంటే పెట్రోల్‌ వినియోగం 10-15 శాతం పెరిగిందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో వినియోగించే పెట్రోల్‌లో అత్యధిక శాతం దిగుమతి చేసుకుంటున్నాం. ఇందుకోసం లక్షల డాలర్ల విదేశీ మారక నిల్వలను వెచ్చిస్తున్నాం. దీనిని నుంచి విముక్తి పొందాలంటే… ప్రత్యమ్నాయ ఇంధనమే శరణ్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement