సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నేడు పదవీ విర మణ చేయనున్న జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఆ పదవిలో కొనసాగింది స్వల్ప కాలమే అయినా ఆ పదవికి వన్నె తెచ్చారు. 2021 ఏప్రిల్ 24వ తేదీన పదవీ స్వీకారం చేసిన ఆయన ఈ స్వల్ప కాలంలో ఎన్నో కీలక మైన అంశాలపై విచారణ జరిపి తీర్పులు ఇచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని అధిష్టించిన తెలుగువారిలో ఆయన రెండో వ్యక్తి. 1966-67 ప్రాంతం లో జస్టిస్ కోకా సుబ్బారావు ఈ పదవిని అలంకరించారు. ఆయన వలెనే జస్టిస్ రమణ స్వతంత్ర భావాలు కలవారు. ఆయనకు తెలుగు భాషపై మమకారం ఎక్కువ. అంతమాత్రాన ఇతర భాషలనూ, ఇతర ప్రాంతాలనూ నిర్లక్ష్యం చేయలేదు. ఎంత పెద్ద పదవిలో ఉన్నా నిరాడం బరత, నిగర్వం, నమ్రత, మృదు మధుర భాషణ ఆయన సొంతం. మాతృభాషలోనే మాట్లాడాలని బోధించ డమే కాదు, ఇప్పటికీ ఆచరిస్తున్నారు. ఆయనకు న్యాయశాస్త్రంలో మంచి ప్రావీణ్యం ఉంది. ఏ అంశంపైనైనా అనర్గళంగా ప్రసంగించగల సామర్థ్యం ఉంది. తెలుగు వారి ప్రత్యేకతను సర్వోన్నత న్యాయస్థానంలో చాటిన న్యాయశాస్త్ర కోవిదుడు. అన్ని పాఠ్యాంశాలూ తెలుగులోనే ఉండాలని సూచించిన మాతృభాషాభిమాని. తెలుగులో కేసులు వాదించడానికి సిగ్గుపడనవసరం లేదని ఆయన న్యాయవాదులకు ఉద్బోధించేవారు. దాని వల్ల కేసుల్లో ఎవరేమి వాదిస్తున్నారనేది ఎదుటి వారికి సులభంగా గ్రాహ్యం అవుతుందని ఆయన తరచూ అంటూంటారు. తెలుగు భాషకు తగినంత ఆదరణ లభించడం లేదని ఆయన పలు సందర్భాల్లో తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ఆయన పైకి ఎంత మొహమాటంగా కనిపించేవారో అవసరమైనప్పుడు అంత నిష్కర్షగానూ వ్యవహరించేవారు. ముస్లిం రిజర్వేషన్లపై విచారణ జరిపిన ఐదుగురు ధర్మాసనంలో ఆయన ఉన్నారు. కుల, మతాల వారీగా రిజర్వేషన్లు సమాజాన్ని చీలుస్తాయని ఆయన నిష్కర్షగా స్పష్టం చేశారు. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో మెజారిటీ సభ్యులతో ఆయన విభేదించారు. జస్టిస్ రమణ పదవీ స్వీకారం చేసిన వెంటే బాధ్యతలు స్వీకరించారు. అలాగే, పదవీ విరమణకు ముందు రోజున కూడా చాలా ముఖ్యమైన కేసులపై విచారణ జరిపారు. వాటిలో జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలకేసు ప్రధానమైనది. గురువారం ఆయన విచారణ చేపట్టిన కేసులలో బిల్కీస్ బానో అత్యాచార నిందితుల కేసు, పెగాసెస్ కేసు, కార్తీ చిదంబరం మనీల్యాండరింగ్ కేసు, ప్రధాని భద్రతా వైఫల్యం కేసు, తీస్తా సెతల్వాడ్ కేసు ముఖ్యమైనవి. ఆయన సాధించిన ముఖ్యమైన విషయాల్లో ఆర్బిట్రేషన్ విచారణ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయించడం. విదేశీ సంస్థలతో వివాదాలున్న కేసుల మధ్యవర్తి పరిష్కారం కోసం సింగపూర్ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండానే హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ బెంచ్‌ని ఏర్పాటు చేయించారు. ఇది పూర్తిగా ఆయన కృషి ఫలితమే. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల హైకోర్టులలో ఖాళీల భర్తీ కోసం ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలను పెంచాల్సిన అవసరాన్ని పలుసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళారు. కొద్ది రోజుల క్రితమే విజయ వాడలో కోర్టు భవనాల సముదాయాన్ని ప్రారంభించారు. అనధికార కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ప్రజల్లో ఒకనిగా ఉండేందుకు ప్రయత్నించేవారు. ఏ విధమైన పటాటోపం, ఆడంబరం, దర్పం లేకుండా అందరితో కలసిమెలిసి ఉండటం ఆయనలోని గొప్పదనం. ముఖ్యంగా తెలుగు భాషపై జరిగే సభల్లో ఆయనలో మాతృ భాషాభిమానం ఉప్పొంగేది. న్యాయ స్థానాలను ప్రజలకు చేరువ చేసిన న్యాయమూర్తిగా ఆయన పేరొందారు. మాతృభాషలో వాదనలు, తీర్పులు ఇవ్వడం వల్ల ప్రజల్లో అపోహలు తొలుగుతాయనీ, తెలుగు భాషలో దిగువస్థాయి నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకూ అన్ని న్యాయస్థానాల్లో తెలుగులోనే విచారణలు జరగాలని ఆయన సూచించారు. అలాగే, కళాశాలలు, యూనివర్శిటీల్లో తెలుగులోనే పాఠ్యాంశాలు బోధించాలనీ, ఆంగ్లంలో చదవకపోతే విదేశాల్లో అవకాశాలుు రావనేది దురభిప్రాయమనీ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఎంతోమంది తెలుగువారు మాతృభాషలో విద్యాభ్యాసం చేసిన వారేనని ఆయన ఓ సందర్భంలో అన్నారు. అంతేకాకుకండా మధ్య వర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలనీ, పనితీరులో భారతీయత ఉట్టి పడాలని ఆయన సూచించేవారు. ఆయన తెలుగు రాష్ట్రాల్లో పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యంగా తిరుపతి, శ్రీశైలం వంటి పవిత్ర క్షేత్రాలను దర్శించినప్పుడు పంచె కట్టుతో వచ్చే సంప్రదాయాన్ని ఆయన ఇప్పటికీ పాటిస్తారు. జస్టిస్ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగుజాతికి ఎంతో పేరు తెచ్చారు. సమాజ సేవ పట్ల పలు సందర్భాల్లో ఆసక్తిని కనబర్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement