Tuesday, November 26, 2024

అవగాహనతోనే జన నియంత్రణ.. పిటిషన్​ స్వీకరించని సుప్రీంకోర్టు

ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరనున్న తరుణంలో మన దేశంలో కూడా జనాభా సమస్య తీవ్రతను తగ్గిం చడానికి పలువురు అనేక సూచనలు చేస్తున్నారు. జనాభా నియంత్రణ చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది పూర్తిగా సామాజిక సమస్య అనీ, ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవడం వాంఛనీ యం కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జనాభా పెరుగుదల మనదేశాన్ని మాత్రమే కాకుండా ఇతర దేశాలకు పెను సమస్యగా తయారైంది. ప్రపంచం లో అత్యధిక జనాభాగల దేశంగా చైనా మొదటి స్థానంలో నిలవగా, మన దేశం రెండవ స్థానంలో ఉంది. చైనాలో మొదట కుటుంబానికి ఒకే బిడ్డ నినాదం అమలులో ఉండేది. గడిచిన ఏడు దశాబ్దాల్లో అమలు జరిపిన ఈ విధానం వల్ల వయసు మళ్ళిన వారి సంఖ్య పెరిగిపోతోం దన్న కలవరం చైనా ప్రభుత్వంలో బయలుదేరింది.

దాంతో కుటుంబానికి ఇద్దరు పిల్లల్ని కనవచ్చునంటూ చైనా ప్రస్తుత అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆదేశాలు జారీ చేశా రు. అయితే, ఒక పిల్ల,లేదా పిల్లవాడుగల కుటుంబాలకు అలవాటు పడిన వారు ఇద్దర్నీ, ముగ్గుర్నీ కనడానికి నిరాసక్తిని ప్రదర్శిస్తున్నట్టు తాజా సమాచారం. ఇప్పుడు ఏం చేయాలో తోచక చైనా ప్రభుత్వం వివిధ ప్రత్యామ్నా యాలను ఆలోచిస్తోంది. మన దేశంలో మొదటి నుంచి అటువంటి ఆంక్షలు లేవు. మన కుటుంబాల్లో రెండు, మూడు తరాలు వెనక్కి వెళ్తే, ఆ రోజుల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత గొప్పగా భావించేవారు. పిల్లా, జెల్లాతో పదిమంది కలిసి మండువా లోగిళ్ళలో జీవనం సాగించడం ఒక గొప్ప సంప్రదాయంగా ఉండేది. పైగా, ఇప్పుడంటే ఆస్పత్రుల్లో ప్రసవాలు, సిజేరియన్‌ వంటి పోకడలు వచ్చాయి కానీ, అప్పట్లో పురుడు-పుణ్యాలన్నీ ఇళ్ళలోనే జరిగేవి. ఆర్థికపరమైన ఇబ్బందులేమీ ఉండేవి కావు.

స్వయం నియంత్రణను పాటించడం వల్ల ఆ కుటుంబాల్లో పిల్లలు, పెద్దలూ అంతా ఆరోగ్యవంతంగా ఉండేవారు. పాశ్చాత్య నాగరికత ప్రభావం పెరిగిన తర్వాత అన్ని విషయాల్లో కట్టు తప్పడం వల్ల ఎటు చూసినా అనారోగ్య వాతావరణం కనిపిస్తోంది. కుటుం బానికి ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనేలా ఆదేశాలివ్వాలన్న అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ జస్టిస్‌ జస్టిస్‌ ఎస్‌కె కౌల్‌, జస్టిస్‌ ఎస్‌కె ఓకాలతో కూడిన ధర్మాసనం ఇలాంటి అంశాల్లో జోక్యం చేసుకోవడం కోర్టుల పని కాద నీ, లా కమిషన్‌ మాత్రం ఏం చేస్తుందని ప్రశ్నించింది. నిజమే, జనాభా పెరుగుదల వల్ల దేశంలో ఆకలి, అనారోగ్యం పెరుగుతోంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగినా, జనావాసాల సంఖ్య పెరిగినా, కొత్తగా పుట్టుకొచ్చే తరానికి కడుపునిండా తిండి, తలదా చుకోవాడనికి గూడును ప్రభుత్వాలు సమకూర్చలేక పోతున్నాయి. ఈ సమస్య అన్ని దేశాల్లోనూ ఉంది. అయితే, జన నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు నిర్దిష్టమైన కార్యక్రమాన్ని అమలు జరుపుతున్నాయి.

మన దేశంలో కూడా కుటుం బ నియంత్రణ కార్యక్రమాన్ని 80వ దశకంలో కేంద్రం పెద్దఎత్తున చేపట్టింది. ఎమర్జెన్సీ కాలంలో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ రెండవ కుమారుడు సంజయ్‌ గాంధీ నిర్ణీత లక్ష్యాలను చేరుకోవడానికి బలవంతపు ఆపరేషన్లు చేయించారన్న ఆరోపణలు వచ్చాయి. పైగా, సమాజంలో కొన్ని వర్గాలు ఈ కార్యక్రమం పట్ల అనాసక్తి ని ప్రదర్శించాయి. తమ వర్గం జనాభా తగ్గిపోతుందేమో నన్న ఆందోళనలను వ్యక్తం చేశాయి. అలాంటి అనుమా నాలు, అపోహలు కలిగినవారు ఇప్పటికీ ఉన్నారు. కులాలు, మతాలు అనే విభజన రేఖలు గీసుకుని ప్రతి కార్యక్రమాన్నీ ఆ కోణంలో చూడటం అనేది ఇప్పటికీ సాగుతోంది. ఎన్నికల్లో కొన్నివర్గాల ప్రజల ఓట్ల కోసం వారిని బుజ్జగించేందుకు ప్రభుత్వ కార్యక్రమాలను పెడదారి పట్టించేవారు ఇప్పటికీ ఉన్నారు.

ఆనాటి సమాజం పదిమంది హితం కోరేది. ప్రస్తుత సమాజం లో స్వీయ ప్రయోజనాల కోసం పదిమందికి చేటు కలిగించేందుకు వెనుకాడని ప్రబుద్ధులు తయారయ్యా రు. నవతరంలో బాగా చదువుకున్నవారు, ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి ప్రభుత్వ పథకాల గురించి వివ రించనవసరం లేకుండానే చిన్న కుటుంబమే చింతలు లేని కుటుంబమన్న నినాదాన్ని ఆచరణలో పెడుతున్నా రు. నగరాలు, పట్టణాల్లో నివసించేవారు ఆధునిక జీవన విధానాన్ని వంటపట్టించుకుని చిన్న కుటుంబాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాక, కుటుంబంలో ఆలనాపాలనా చూసే పెద్ద తరం వారెవరూ లేకపోవడం తో ఇద్దరు పిల్లలతోనే సరిపెట్టుకుంటున్నారు.అసలు జననియంత్రణ కార్యక్రమం అవగాహన పైనే విజయ వంతం అవుతుంది. ఒత్తిళ్ల వల్ల కాదు. ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన పెంచే కార్యక్రమాల ద్వారానే ఈ కార్యక్రమాన్ని విజయవం తంగా అమలుజేస్తున్నాయి. సామాజిక చైతన్యంతోనే ఈ సమస్య పరిష్కారం కావాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement