ప్రభన్యూస్ : పెరుగుతున్న అసమానతలను తగ్గించడానికి తక్షణ మే చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ప్రభుత్వానికి సూచించింది. దారిద్య్రరేఖకు దిగువున జీవిస్తున్నవారి సంఖ్య బాగా పెరిగిందనీ,టోకు ద్రవ్యోల్బణం ప్రభావం రిటైల్ ద్రవ్యోల్బణంపై క్రమంగా పెరుగుతుండటం వల్ల నిరుపేదల సంఖ్య పెరుగుతోంది. కరోనాకి ముందు సరైన ఆదాయం లేని వారు 40 శాతం ఉంటే, లాక్‌డౌన్ తర్వాత వారి శాతం 70కి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో కన్నా,గ్రామాల్లో నిరుపేదల సంఖ్య బాగా పెరుగుతోంది. ఆహార ధాన్యాలు, కూరగాయలు, పాలు వంటి నిత్యావసరాలన్నిటి ఉత్పత్తి కేంద్రాలు గ్రామాలే అయినా అక్కడ అవి దొరకడంలేదు.ఒక వేళ దొరికినా హెచ్చుధర చెల్లించాల్సి వస్తోంది. కరోనా తగ్గి పోయిందనీ, టీకాల కార్యక్రమం విజయవంతమైందని సంబర పడటం సరికాదు. కరోనా మిగిల్చిన కష్టాలను తీర్చడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదన్న విషయం జాతీయ, అంతర్జాతీయ సంస్థల సర్వేల్లో వెల్లడవుతోంది. ఎవరి అజెండా ప్రకారం వారు ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వాల్లో ఉన్నత పదవుల్లోఉన్నవారు సైతం తమ అజెండా ప్రకారమే నడుుచుకుంటున్నారే తప్ప, ధరలు, ద్రవ్యోల్బణం తగ్గింపు వంటి అంశాలపై దృష్టిని కేంద్రీక రించడం లేదని సామాజిక విశ్లేషకులు పేర్కొంటున్నారు.
రెండేళ్ళ తర్వాత జరిగే ఎన్నికల గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితి అంతా బాగుందనే ధోరణితోనే వారు ఎన్నికలు, పొత్తులు, మొదలైన అంశాల గురించి మాట్లాడుతున్నారు. నిజాని కి ప్రజలకు తిండి, గుడ్డ, ఆవాసం వంటి కనీస అవసరాలను తీర్చాల్సిన బాధ్యత పాలకపక్షాలపైఉంది.ఆ పార్టీలు వీటిని విస్మరిస్తే గుర్తు చేయాల్సిన బాధ్యక ప్రతిపక్షాలపై ఉంది. కానీ, మన దేశంలో విచిత్ర మేమంటే పాలక పక్షాలతో పాటు ప్రతిపక్షాలు కూడా ఎన్నికలకు సిద్ధమే నంటూ ప్రకటనలు చేస్తున్నాయి.ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం గ్రామాల్లో సక్రమంగా అమలు జరిగేట్టు చూడాల్సిన బాధ్యత ప్రభు త్వాలపై ఉంది. కానీ,ఈ పథకానికి ప్రస్తుతం అధికారం లో ఉన్న ప్రభుత్వం నిధుల్లో కోత పెట్టినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న మాట నిజమే కానీ, వాటిని తిరిగి సాధించేం దుకు ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు లేవు.కోవిడ్ సమయంలో పేదలు మరింత నిరుపేదలుగా మారిపో యారు. అప్పులు పుట్టక చిన్న వ్యాపారులు కూలీలుగా, ఉద్యోగులుగా మారిపోగా, సంపన్నులు మరింత సంపన్నులై ఆర్థిక అసమానతలు పెరుగుదలకు సాక్షీ భూతంగా నిలుస్తున్నారు.
ఈ పరిస్థితి మన దేశంలోనే కాదు,సంపన్న దేశాల్లోనూ ఉంది. అమెరికాలో ద్రవ్యోల్బణం బాగా పెరిగి పోయినట్టు తరచూ వార్తలు వస్తున్నాయి. అయితే, అక్కడి వారికి ఇలాంటి పరిస్థితు లను తట్టుకునేందుకు వివిధ కార్యక్రమాలు అమలులో ఉన్నాయి. మన దేశంలోఉన్న కార్యక్రమాలకు నిధులు లేక అవి ఆగిపోతున్నాయి. అసమానతలపై ఆర్థిక సలహా మండలి సూచనల తర్వాతనమో ప్రధానమంత్రి చమురు, గ్యాస్ ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. అయితే, పెంచిన ధరల దామాషాతో పోలిస్తే ఈ తగ్గింపు ఏ పాటిదని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అలాగే, కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ ఊసే లేదు..ముఖ్యంగా, గ్యాస్ ధర తగ్గింపు ఉజ్వల పథకం లబ్ధిదారులకే వర్తిస్తుంది. మరి మధ్యతరగతి వారి మాటేమిటి? ఉజ్వల పథకాన్ని ప్రధానమంత్రి గ్రామీణ ప్రాంతాల్లో మహిళల కష్టాలకు చలించి పోయి ప్రవేశపెట్టి న పథకం. మరి పట్టణాలు, నగరాల్లో మధ్యతరతి వర్గా ల ఎంతోకాలంగా గ్యాస్‌పై ఆధారపడుతున్నారు. వారి సంగతి ఏమిటి?గ్యాస్ ధర వారికికూడా వర్తిస్తుందా? ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి, అలాగే, వంటనూనెలు ఇతర నిత్యావసరాల ధరలను తగ్గిస్తామంటూ ప్రభుత్వం నుంచి ప్రకటనలు వెలువడుతున్నాయి.
ముందుగా ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించాల్సింది ఆ అంశంపైన. యువకులు, మహిళలకు కోవిడ్‌కి ముందు ఉపాధి అవకాశాలను పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పై ఉంది. అంతా బాగానే ఉందని అనుకోవడం తప్పు లేదు, కానీ, ఆ భ్రమలో ఉంటూ సమాజంలో పెరిగిపో తున్న అసమానతలను గురించి పట్టించుకోకపోతే మన దేశంలో కూడా పొరుగు దేశాల్లో మాదిరిగా పరిస్థితులు దిగజారి పోయే ప్రమాదం ఉంది. ద్రవ్యోల్బణం పెరుగుదలకు పండ్లు,కూరగాయల ధరల పెరుగుదల కారణమని చెప్పడంతోపాలకులు సరిపెడుతున్నారు. అయితే, వేసవి కాలంలో ప్రతిసారి ఈ పరిస్థితి అనివా ర్యం. నిత్యావసరాల సంగతేమిటి? తెలుగురాష్ట్రాల్లో గతంలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరాలను అందించేవారు. నిత్యావసరాల పంపిణిపై కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..