జాతిపిత మహాత్మాగాంధీ ప్రబోధించిన శాంతి, సత్యం, అహింస అనే మూడు సూత్రాలను ప్రతిబింబించే రీతిలో మూడు సింహాలను భారత ప్రభుత్వం తన అధికార చిహ్నంగా ఎంచుకుంది.మూడు సింహాల ఆకృతిని కొత్త పార్లమెంటు భవనంపై కొత్తగా ఆవిష్కరించాలనే ఉద్దేశం మంచిదే అయినా, ఎక్కడో అపశ్రుతి జరిగిపోయింది. పాత నమూనాలో కొత్తది చేయడాన్ని అభ్యంతరం పెట్టనక్కరలేదు. కానీ, జాతికి చిహ్నమైన జాతీయ చిహ్నంలో మార్పులు అభిలషణీయం కాదు.. పాత ఆకృతిలో సింహాలు రౌద్రంగా కాకుండా మామూలుగా ఉండగా, కొత్త ఆకృతిలో రౌద్రంగా ఉండటమే కొత్త ఎంబ్లమ్‌పై విమర్శలకు కారణం. స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి వినియోగంలో ఉన్న పార్లమెంటు భవనం, అమలులో ఉన్న రాజ్యాంగ సంస్థలు సహా చాలా వాటికి కొత్త రూపు ఇవ్వాలన్న మోడీ తలంపును తప్పు పట్టడానికి లేదు. అయితే పాతతరాలను కించపర్చకుండా కొత్త తరాలకు స్ఫూర్తి నిచ్చేరీతిలో వాటిని తీర్చిదిద్దితే ఎవరికీ ఆక్షేపణ ఉండదు. ఆయనకు స్వాతంత్య్రం సిద్ధించిన నాటి పరిస్థితులు, ఆనాటి వ్యక్తులపై ఎటువంటి అభిప్రాయం ఉందో తెలియదు కానీ, ఒక్కసారిగా అన్నింటినీ మార్చేయాలన్న ఆతృత ఆయనలో కనిపిస్తున్న మాట నిజం. ఆయన ఆలోచనలు, అనుసరిస్తున్నవిధానాలు దేశానికి, దేశ ప్రజలకూ మేలు చేకూరిస్తే చరిత్రలో ఆయన శాశ్వతంగా నిలిచిపోతారు. అసలు ఆయన ఆకాంక్ష కూడా అదేనేమోననిపిస్తుంది. మార్పులను ప్రవేశపెట్టడం ఎంత సులభమో, వాటిని సమీక్షించుకుని సరిదిద్దుకోవడం అంత కష్టం. మార్పులను స్వాగతించే ముందు లోతుగా పరిశీలన అవసరం. ప్రస్తుతం జరుగు తున్న మార్పులపై అటువంటి పరిశీలన, అధ్యయనం ఉన్నట్టు కనిపించడం లేదు.ఇందుకు వ్యవసాయ చట్టాలే ఉదాహరణ. ప్రతిపక్షాలనూ, మిత్ర పక్షాలను సంప్రదిం చకుండా ఆయన హడావిడిగా వ్యవసాయ చట్టాల్లో మార్పులు తెచ్చారు. ఆ మూడింటిపైనా ఏడాది పైగా దేశవ్యాప్తంగా ఆందోళన సాగింది.మిత్రులే శత్రువుల య్యారు. దాంతో దిగివచ్చి ఆ చట్టాలను ఉపసంహరిం చుకుంటున్నట్టు ప్రకటించారు. అలాగే, పాత కరెన్సీని ఉన్నపళంగా రద్దు చేశారు.
దాని వల్ల ఒనగూరిన లాభ మేమిటో పార్లమెంటు ద్వారా ప్రజలకు తెలియపర్చ లేదు. దేశంలో సమూలమైన మార్పులు తేవడానికి ప్రజ లు ఆయనకు అధికారం ఇచ్చారు. ఆ మార్పుల ఫలం గడిచిన ఏడున్నర దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని చూపడమే అయితే, అందుకు ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ, ఆచరణలో అందుకు భిన్నంగా కనిపిస్తోంది. మూడు సింహాల వ్యవహారంలో ఆయన ఎవరినీ సంప్రదించ లేదు. అసలు కొత్త పార్లమెంటు భవనం నిర్మించాలన్న ఆలోచన కూడా పూర్తిగా ఆయనదే. ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఎన్నో నిర్మాణాలు జరిగాయి. జరుగుతు న్నాయి. కానీ, ప్రతి దానికీ ఒక పరమార్ధం ఉంటుంది. దానిని అర్థం చేసుకోకుండా, తనకు ముందున్న పాలకు ల్లో కొంతమందిపై అయిష్టతతో వారి స్మృతులను చెరిపి వేయాలనుకునే హడావుడిలో ఎవరినీ సంప్రదించని ధోరణితో వ్యవహరిస్తే ఎదురు దెబ్బలు తప్పవు. మూడు సింహాలు, అశోక చక్రం మన పాలనకు అద్దం పడుతోంది, దాన్ని ప్రదర్శితం చేయడం కోసమే ఆ ఎంబ్లమ్‌ని రూ పొందించారు. కొత్త సింహాలు ఉద్వేగ భరితంగా ఉండ టానికి బదులు, ఆక్రోశానికీ, పైశాచికత్వానికీ ప్రతిరూపం గా ఉన్నాయని రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తుతున్నాయి. సింహాల నోట్లో కోరలుకనిపించడాన్ని ఎత్తి చూపుతున్నారు. శాంతిసామరస్యాల సై ద్దాంతిక ప్రాతిపదికగా నడిచే భారతదేశ జాతీయ చిహ్నంపై ఇంతటి రౌద్రం సంకేతంకాదనేది సర్వుల అభిమతం. రాజకీయ నాయకులేకాకుండా చరిత్రకారులు తప్పు పడుతున్నారు. ఈ అశోక చిహ్నాన్ని1950లో ప్రవేశపెట్టారు. దేశ సర్వసత్తాక ప్రతిపత్తికి ప్రతీకగా వీటిని పోల్చారు. అంతేకాకుండా, శాంతి, సత్యం, అహింసా విధానాలను పాటిస్తామని తెలియజేయడమే ఈ చిహ్నం లక్ష్యం. ఈ చిహ్నాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి మోడీ పార్లమెంటులో ప్రతిపక్షాలలో దేనినీ ఆహ్వానించకపోవడం ఘోరమైన అవమానంగా ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. చిహ్నాలనూ, రాజ్యాంగబద్దంగా ఏర్పాటైన సంస్థలను మార్చినందు వల్ల ప్రయోజనం లేదు. వాటి వల్ల మంచి జరిగితే ప్రజలు హర్షిస్తారు. ప్రణాళికా సంఘానికి బదులుగా నీతి ఆయోగ్‌ని ఏర్పాటు చేశారు. దానివల్ల ఏ మేరకు మేలు జరిగిందో పాలకులు ఆత్మవిమర్శ చేసు కోవాలి. ముఖ్యంగా కొత్త పార్లమెంటు వద్ద అశోక స్తంభం పై మూడు సింహాలను మార్చడం వల్ల వాస్తు పరంగా కీడుజరుగుతుందేమోనన్న భయాలు జనంలో ఉన్నాయి. వాటిని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.