పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మంగళవారం తన మంత్రివర్గ సహచరుడు విజయ్ సింగ్లాని బర్తరఫ్ చేయడం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వ్యవస్థాపకుడు,ఆ పార్టీ సారథి అరవింద్ కేజ్రీవాల్‌కే దిగ్భ్రాంతి కలిగించింది.అవినీతిని అంతం చేస్తామంటూ వేదికలెక్కి వాగ్దానాలు చేయడం కాదు.ఆచరణలో చూపిన ఘనత మాన్‌కి దక్కుతుంది.మాన్ చర్యను చూసి ఎంతో గర్విస్తున్నానని కేజ్రీవాల్ అన్నారు. ఇంతకీ ఆ మంత్రిపై అభియోగం ఏమిటంటే, ఆరోగ్య శాఖ పిలి చిన టెండర్లలో ఒక శాతం కమిషన్ ఇవ్వాలని మంత్రి విజయ్ సింగ్లా డిమాండ్ చేసినట్టుపది రోజుల క్రితం ఫిర్యాదు వచ్చింది.దానిపై విచారణ జరిపించిన ముఖ్య మంత్రి మాన్ మంగళవారం నాడు విజయ్ సింగ్లాని బర్తరఫ్ చేస్తున్నట్టు ప్రకటించారు.ఈ ప్రకటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించింది.అవినీతిపై పోరాడుతున్నామని అందరూ ప్రకటనలు చేసేవారే. కానీ, ఆచరణలో చూపేవారు అసలు ఎక్కడా కనిపించ రు. పాలకుల్లో ఈ మాదిరి నిర్లిప్తతా భావంవల్లనే అవినీతి హిమాలయాలంత ఎత్తున పెరిగిపోతోంది. ఒక రాష్ట్రంలో, ఒక ప్రభుత్వంలో అని కాకుండా దేశ వ్యాప్తం గా అన్ని స్థాయిల్లో అవినీతి వ్యవస్థీకృతమైంది.మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఓ సందర్భంలో పార్లమెంటులో మాట్లాడుతూ అవినీతి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో నూ తిష్ట వేసిందని అన్నారు.దానిపై తీవ్రమైనవిమర్శలు చేసిన ఆనాటి భారతీయ జనసంఘ్ (ఇప్పటి బీజేపీ) నాయకులు ఆమె అవినీతిని ఆమోదిస్తున్నారంటూ పల్ల వించారు.దాంతో పార్లమెంటులో రోజుల తరబడి గందరగోళం,వాయిదాల పర్వం నడిచాయి.మన దేశం లో అవినీతి వల్ల బర్తరఫ్ అయిన మంత్రులు చాలా అరుదు. ఆరోపణల అగ్ని చల్లారిన తర్వాత సంబంధిత మంత్రి చేత రాజీనామా చేయించి విచారణ కమిటీనీ నియమించేయడం, జనం మరిచి పోవడం అలవాటుగా మారింది. ఇటీవల కర్నాటకలో ఈశ్వరప్ప అనే సీనియర్ మంత్రి పంచాయతీ రాజ్ శాఖలో పనుల మంజూరుకు నాలుగు శాతం కమిషన్ డిమాండ్ చేశారన్న ఆరోపణపై ఆందోళన తీవ్రతరం కావడంతో ముఖ్యమంత్రి బసవ రాజ్ బొమ్మై ఆ మంత్రి చేత రాజీనామా చేయించారు.
ఢిల్లి ముఖ్యమంత్రి,ఆప్ సారథి కేజ్రీవాల్ 2015లో అవినీతి ఆరోపణను ఎదుర్కొంటున్న ఒక మంత్రిని బర్తరఫ్ చేశారు. అసెంబ్లి లోనూ, వెలుపల తీవ్ర ఆందోళ న అనంతరమే ఆ మంత్రిపై కేజ్రీవాల్ చర్యతీసుకున్నారు. సాధారణంగా అన్ని చోట్లా ఇలాగే జరుగుతోంది. అయితే, పంజాబ్ ముఖ్యమంత్రి మాత్రం తన మంత్రిపై ఆరోపణలకు ఆధారాలు అందిన వెంటనే తానే స్వయంగా ఆ విషయాన్నీ, మంత్రి బర్తరఫ్ విషయాన్ని ఒకే సారి ప్రకటించడం అందరికీ విస్మయాన్ని కలిగించింది.ఒక్క శాతం అవినీతిని కూడా సహించబోనని ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకటించారు. ప్రభుత్వ శాఖల లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఒక నినాదంగా మిగిలిపోతున్న ఈరోజుల్లో ఇటీవల అధికారంలోకి వచ్చిన పంజాబ్ ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. అయితే, త్వరలో గుజరాత్,హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఎన్నికలకు ఆప్ సంసిద్ధమవుతున్న దృష్ట్యా, కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి చేత కావాలనే ఈ బర్తరఫ్ తతంగాన్ని నడిపించి ఉంటారని ఆయన ప్రత్యర్ధులు ఆరోపించారు.అయితే, కేజ్రీవాల్ నేపథ్యాన్ని పరిశీలిస్తే, అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ప్రారంభించిన ఉద్యమంలో కార్యకర్తగా ప్రజాజీవితాన్ని ప్రారంభించిన ఆయన అవినీతి లేని పాలనను అందిం చాలన్న దృఢ సంకల్పంతోనే ఉన్నట్టు స్పష్టం అవుతోంది. తమ పార్టీ క్లీన్ ఇమేజ్‌ని కాపాడుకుందామన్న ఉద్దేశ్యంతోనే దీనిని నడిపించి ఉండవచ్చు కదా! అలా తీసుకున్నా తప్పులేదు. అవినీతి నిర్మూలన ఎక్కడో ఒక చోట, ఎవరో ఒకరి ద్వారా ప్రారంభం కావాలి. యూపీఏ హయాంలో పర్యావరణ శాఖ మంత్రి జయంతి నట రాజన్‌పై రాహుల్ గాంధీకి ఫిర్యాదులు అందడంతో ఆయన కొత్త మంత్రి వస్తున్నారంటూ రాహుల్ ప్రకటిం చగానే, జయంతిని ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ బర్తరఫ్ చేశారు. పోనీలే అనే క్షమాగుణం, ఉదాసీన భావం పాలకుల్లో పెరిగిన నాటి నుంచి అవినీతి మొక్క ఇప్పుడు వటవృక్షమైంది.,దీనిని పెకలించడం ఎవరి తరం కాదు. దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే వచ్చాయి. పాత పార్టీలలో ఈ రుగ్మతను నిర్మూలించడం కష్టం కనుక,కొత్త పార్టీలలో నైనా దీనిని నిర్మూలించేందుకు అధినేతలు కంకణం కట్టుకుంటే అది గొప్ప ప్రారంభం అవుతుంది.పంజాబ్ ముఖ్యమంత్రి తీసుకున్న చర్య ఏ విధంగా చూసినా సమర్ధనీయమే. ఆయన బాటలో మిగిలిన ముఖ్యమంత్రులు అవినీతిపై తక్షణ చర్యలు తీసుకుంటే కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..