భూతాపం పెరగడం, పర్యావరణ అసమతుల్యత, వాతావరణ మార్పులు వంటి కారణాలవల్లే ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. మానవ తప్పిదాలే ఈ పరిస్థితికి కారణం. ప్రస్తుతం అమెరికాను కుదిపేస్తున్న బాంబ్ మంచుతుపాను సృష్టిస్తున్న కల్లోలానికి కూడా పరోక్షంగా ఈ పరిస్థితులే కారణం. గడచిన వందేళ్ళలో కనీవినీ ఎరుగని మంచు తుపాను అమెరికాను అతలాకు తలం చేస్తోంది. అనేక రాష్ట్రాల్లో వాహనాలన్నీ మంచుతో కప్పబడి పెద్ద కొండల్లా కనిపిస్తున్నాయి. ఇళ్ళపై మంచు గుట్టలు పేరుకుని పోయాయి. ఎక్కడి వారు అక్కడే బందీలైనారు. న్యూయార్క్వద్ద బఫెలో సమీపంలోని నయాగరా జలపాతాన్ని చూడటానికి వెళ్ళిన పర్యా టకులు మంచు గుట్టల్లో చిక్కుకునిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని పెద నందిపాడు సమీపంలోని ఒక గ్రామానికి చెందిన నారా యణ,అతడి భార్య ఇద్దరూ మంచు తుపాను కారణంగా గడ్డకట్టిన సరస్సుపై నడుస్తూ ప్రాణాలు కోల్పోయారు. అలాగే, విశాఖ, రాయలసీమ ప్రాంతాలకు చెందినవారు కూడా ఈ మంచు తుపానులో చిక్కుకున్నారు. బఫెలో ప్రాంతంలో జనం ఆహారం లేక మాడిపోతున్నారు. ఒక్కొక్కరిది ఒక కథ.. ఒక్కో వ్యథ.
అమెరికా అంటే భూతల స్వర్గంగా భావించేవారు ఈ మంచుతుపాను బీభత్సపు వార్తలు, చిత్రాలను చూసి అవాక్కవు తున్నారు. బంధుమిత్రుల క్షేమ సమాచారం కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. సమాచారం అందని వారు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. మంచు తుపాను కష్టాలు అను భవిస్తున్న వారిలో ప్రవాస భారతీ యులు ఎక్కువ మంది ఉన్నారు. వారిలో తెలుగువారి సంఖ్య అత్యధికం. ఈ మంచు తుపానుకు బాంబ్ సైక్లోన్ అని పేరు పెట్టారు. న్యూయార్క్ నగరంలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ ఎక్కువ మరణాలు సంభవించినట్టు అధి కారులు తెలియ జేశారు. న్యూయార్క్ పశ్చిమ ప్రాంతం లో 8 అడుగుల లోతున మంచులో కూరుకునిపోయి కొందరు మరణించినట్టు అనుమానిస్తున్నారు. ఎడతెరి పిలేని మంచు వర్షంవల్ల ప్రజలు వీధుల్లోకి రాలేకపో తున్నారు. నిత్యావసరాలు నిండుకోవడంతో ఇళ్లల్లో ఉండలేకపో తున్నారు. వారిని ఆదుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని న్యూయార్క్ గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది జీవిత కాలంలో ఒకసారి వచ్చే మంచు తుపాను అని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా 15 వేల విమానాలు రద్దయ్యాయి.
దేశం లోని హైవేలన్నీ మూసివేశారు. దీంతో చికాగో, డెన్వర్, డెట్రాయెట్, న్యూయార్క్, అట్లాంటా తదితర విమా నాశ్రయాల్లో అనేక మంది ప్రయాణీకులు చిక్కు బడిపోయారు. వివిధ రాష్ట్రాలలో ప్రజలు డీప్ ఫ్రిజ్‌లో ఉన్నట్టు కాలం గడుపు తున్నారని నేషనల్ వెదర్ సర్వీసెస్ తెలియజేసింది. కొలరాడో, కెంటకీ, మిస్సోరీ, ఓహియా తదితర రాష్ట్రా ల్లో రెండు లక్షల మందిపైగా విద్యుత్ సరఫరా లేక నానా యాతనలు పడుతున్నారు. 48 రాష్ట్రాల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సబ్స్టేషన్లు 18 అడుగుల మంచులో కూరుకుని పోవడంతో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పటికి సాధ్యమవుతుందో చెప్పలేని పరిస్థితి. ఎప్పటికి వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఆర్కిటిక్ బ్లాస్ట్ కారణంగా ఈ శీతాకాలంలో ఎన్నడూ లేని విధంగా తుపాను బీభత్సం దేశంలోని పలు ప్రాంతాలను గిజగిజ లాడిస్తోంది. తుపాను ప్రభావం ఈ ఏడాది క్రిస్మస్ సంబ రాలపైనా పడింది. రోడ్లపైనా, రన్‌వేల పైనా మంచు గుట్టలుగా పేరుకునిపోయింది. ప్రజలెవరూ వీధుల్లోకి రావద్దని అధికారులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
పర్యావరణ పరి రక్షణ, భూతాపం వంటి అంశాలపై అంతర్జాతీయ సదస్సులు నిర్వహించి తీర్మానాలు ఆమోదించే సంపన్న దేశాలు పర్యావరణ పరిరక్షణపై వీసమెత్తు శ్రద్ధ చూపక పోవడం వల్లనే ఈ తుపానులు, వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడు తున్నాయని శాస్త్రవేత్తలు చెబు తున్నారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యతను సంపన్న దేశాలు వర్థమాన దేశాలపైకి నెట్టేసి తమ బాధ్యత లేదని తప్పించుకోజూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తాజా పరిస్థితులు నిదర్శనం. ఫలానా రుతువులోనే ఎండలు కాయాలి , వర్షాలు పడాలనే ఋతు చక్రం ఇప్పుడు పని చేయడం లేదు. ఈ విషయాన్ని అగ్రదేశాలు ఇప్పటికైనా గ్రహిస్తే ప్రకృతి విపత్తులు పునరావృతం కాకుండా ఉం టాయి. ప్రపంచం ఎలా పోయినా పర్వాలేదనే ధోరణితో వ్యవ హరిస్తే ఇలాంటి ఘోర విపత్తులు పునరావృతమవుతూ ఉంటాయి. చైనాలో కరోనా, అమెరికాలో మంచు తుపా ను, రష్యా- ఉక్రె యిన్లలో తెచ్చి పెట్టుకున్న యుద్ధం ఎంతో మంది ప్రాణాలను బలిగొన్నాయి. వీటిలో మానవ కల్పితమైన ప్రమాదాలను నివారించ గలిగితే అదే గొప్ప.