ప్రధానమంత్రి నరేంద్రమోడీ యూరప్ పర్యటన సందర్భంగా బెర్లిన్ చేరుకుని జర్మనీ అధ్యక్షుడు ఓలాఫ్ స్కూల్జ్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతర్ ప్రభుత్వ సమస్యలపైనే కాకుండా అంతర్జాతీయ పరిస్థితులపై ఇద్దరూ చర్చలు జరిపారు. ఉక్రెయిన్ యుద్ధంపై వ్యాఖ్యా నిస్తూ ప్రధానమంత్రి మోడీ యుద్ధం అనేది అందరికీ అనర్ధమేననీ, ఉక్రెయిన్ యుద్ధంలో విజేత లవరూ ఉండరని స్పష్టం చేశారు. భారత్ మొదటి నుంచి శాంతినే కోరుకుంటోందనీ, ఈ యుద్ధం ఆరంభం నుంచి భారత్ ఇదే మాటను స్పష్టంచేస్తోందని చెప్పారు. ప్రధాని భారత్ విధానాన్ని చాలా విపులంగా, సమయస్ఫూర్తితో వివరించారు. యూరప్ పర్యటనలో సహజంగా ఉక్రెయిన్ యుద్ధం ప్రధాన చర్చనీయాంశం అవుతుందనీ, ప్రధాని మోడీ ఏ విషయం చెబు తారోనని యావత్ ప్రపం చంఎదురు చూసింది. భారత్ మొదటి నుంచి అలీన విధానాన్ని అనుసరిస్తోంది. అలీనవిధానాన్ని మించిన విదేశాంగ విధానం మరొకటి లేదు. మహాత్మాగాంధీ అహింసావిధానం అడుగుజాడల్లోనే అలీన విధానాన్ని తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆచరించారు. ప్రచ్ఛన్నయుద్ధ స మయం నుంచి భారత్ ప్రపంచ దేశాల్లో మన్ననలను పొందడానికి తటస్థ విధానమే కారణం. యూరప్‌లోని దేశాల్లో కూడా ఉక్రెయిన్ యుద్ధంపై భిన్నాభిప్రాయాలున్నాయి. రష్యాను వ్యతి రేకించే వారంతా ఉక్రెయిన్‌ను సమర్ధి స్తుండగా,ఇతర దేశాలు రష్యాకు అండగా నిలుస్తున్నాయి.
అయితే, ఈయుద్ధం వల్ల రష్యా ఆశించిన లక్ష్యాలను చేరు కోగపోగా తీవ్రమైనా, అనూహ్యమైన నష్టాలను ఎదుర్కొంది. ఇప్పటికీ ఎదుర్కొంటోంది. ఏవో కొన్ని ప్రాంతాలను ఆక్రమించినట్టు రష్యా చెప్పుకుంటున్నప్పటికీ, సైనికంగా, ఆయుధ పరంగా రష్యాకు వాటిల్లిన నష్టాలతో పోలిస్తే అవేమీ పెద్ద లెక్కలోకి రావు. అందుకే, ఈ యుద్ధంలో విజేతలెవరూ లేరంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యం నూరు పాళ్ళు నిజం. మానవజాతి చరిత్రలో వినాశకరమైన యుద్ధాలు, ఘర్షణలు ఎన్నో జరిగాయి.అవన్నీ ఆయా దేశాల, దేశాధినేతల అహంకోసమే జరిగాయి. ఇప్పుుడు ఉక్రెయిన్ యుద్ధం కూడా రష్యా అహం కోసం జరుగుతున్నదే. ఈ విషయాన్ని ప్రపంచంలో శాంతిని ఆశించే దేశాలన్నీ స్పష్టం చేశాయి. అయితే, వాణిజ్య అవసరాల కోసం రష్యాను అమెరికా రెచ్చగొడుతోంది. ఈ యుద్ధం పేరు చెప్పి అమెరికా ఉక్రెయిన్‌కు ఆయుధాలు అమ్ముకుంది. చైనా పరోక్షంగా రష్యాకు అండగా నిలిచినట్టు కనిపిస్తున్నా, చైనా కూడా వాణిజ్య ప్రయోజనాలను ఆశించే ఈ యుద్ధంలో తన వంతు పాత్ర వహిస్తోంది. బెర్లిన్‌తో అంతర్ ప్రభుత్వ సహకార సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ ఇరుదేశాలూ ఇప్పటికే పెక్కు రంగాలలో సంపూర్ణ అవగాహనతో పనిచేస్తున్నాయనీ, కోవిడ్ సంభవించినప్పుడు, ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడూ ఇరుదేశాల మధ్య సహాయసహకారం చెక్కు చెదరకపోవడం ఇరుదేశాల మధ్య పటిష్టమైన బంధానికి నిదర్శనమని అన్నారు.
భారత్‌లో పెట్టుబడులకు జర్మన్ కంపెనీలను ఆయన ఆహ్వానించారు. సుస్థిరమైన ఆర్థిక విధానాలతో భారత్ ఇతర దేశాలతో భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని ప్రధానమంత్రి అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచంలో పెక్కు దేశాలు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ నష్టాలు ఎంతవరకూ ఉంటాయో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. భారత్‌కి సంబంధించినంతవరకూ వంటనూనెలు, చమురు ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల సామాన్యునిపై భారం పడుతోంది. చమురు ధరలు యుద్ధాలు లేకపోయినా పెరుగుతున్నాయి. వంటనూనెల ధరల పెరుగుదల వల్ల సామాన్యులపై పెను భారం పడుతోంది. భారత్ వినియోగిస్తున్న వంటనూనెల్లో అధిక భాగం ఉక్రెయిన్, ఇండో నేషియాల నుంచే కావడం వల్ల ఈ రెండుదేశాల్లో అ స్తవ్యస్త పరిస్థితుల ప్రభావం భారత్ ఆర్థిక పరిస్థితిపై పడుతోంది. ఇతర దేశాల్లో కూడాఇదే మాదిరిగా చమురు, వంటనూనెల ధరల ప్రభావం ఆయా దేశాల ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి మోడీ స్థూలంగా యుద్ధం అందరికీ అనర్ధమేనని అన్నారు. ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు డోలాయమానంలో పడటానికి కోవిడ్ మహమ్మారి చాలా వరకూ కారణం కాగా, ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం దేశాలను కుంగదీస్తోంది. 2000సంవత్సరం నుంచి జర్మనీ భారత్‌లో నేరుగా పెట్టుబడులు పెడుతోంది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 18 బిలియన్ యూరోలు ఉంది|మన దేశం నుంచి జర్మనీకి పళ్ళు, గ్రెయిన్, బేస్ మెటల్ ఎగుమతి అవుతున్నాయి. జర్మనీ నుంచి మన దేశం దిగుమతి చేసుకునే వాటిలో అణురియాక్టర్లు ముఖ్యమైనవి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..