ములాయం సింగ్ యాదవ్… ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడైనప్పటికీ, యావద్దేశంగుర్తెరిగిన… గుర్తుంచు కోదగిన నేత. దేశంలో అతి పెద్ద రాష్ట్రమైనఉత్తరప్రదేశ్‌కి మూడు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ములా యం సింగ్ యాదవ్ దేశ రాజకీయాల్లో నిబద్ధత గల రాజకీయ వేత్తగా పేరొందారు. పదిసార్లు ఎమ్మెల్యేగా, ఏడుసార్లు ఎంపీగా వ్యవహరించారు. ఆయన రాజకీ యాలు ఉత్తరప్రదేశ్‌కే పరిమితమైనప్పటికీ, కేంద్రంలో కొద్ది కాలం పాటు అధికారంలో ఉన్న మూడవ ఫ్రంట్‌లో కీలక పాత్ర వహించారు. మాజీ ప్రధాని దేవె గౌడ మంత్రి వర్గంలో కేంద్ర మంత్రిగా కొద్ది నెలల పాటు వ్యవహరించారు. అంతకుమించి జాతీయస్థాయి రాజకీయాల్లో ఆయన పాత్ర ఏమీ లేదు. అయితే, ముఖ్యమైన జాతీయ ప్రాధాన్యం గల అంశాల్లో ఆయన సలహాలను ఇస్తూ ఉండేవారు. అలాగే, పార్లమెంటు సభ్యునిగా తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉండేవారు. ఆ విధంగా ఆయన జాతీయ నాయకునిగా గుర్తింపునూ, గౌరవాన్ని పొందారు. ములాయం లౌకిక వాది అయినప్పటికీ, ఆనాడు వాజ్‌పేయి తీసుకున్న నిర్ణయాలనూ, ఇప్పుడు మోడీ నిర్ణయాలనూ వాటి మంచి సెబ్బరలను బట్టి మద్దతు ఇచ్చారు. నెహ్రూ కాలంనాటి రామమనోహర్ లోహియా శిష్యునిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ములాయం లౌకిక సిద్ధాంతాల విషయంలో ఎన్నడూ రాజీ పడలేదు.
బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో లౌకిక వాద శక్తులకు అండగా ఉండే, ఎమర్జెన్సీ సమయంలో బీజేపీతో కలిసి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీతో కలిసి పోరాటం చేసి జైలుకెళ్ళారు. ఆయన బీజేపీ మతతత్వాన్ని ఎంత వ్యతిరేకించేవారో, కాంగ్రెస్ నియంతృత్వ పోకడలను అంతగానూ వ్యతిరేకించేవారు. ఆయన యవ్వనంలో తాలింఖానాను నిర్వహించడం వల్ల ఆయనను అప్పట్లో అంతా వస్తాద్ అని పిలిచేవారు. జాతీయ స్థాయిలో కుస్తీ పోటీలను నిర్వహించేవారు. అలాగే, రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నాయకునిగా ఎదిగిన తర్వాత ఆయనను నేతాజీ అని పిలుస్తుండేవారు. అదే స్థిరపడిపోయింది. వారసత్వ రాజకీయాలకు ఆయన వ్యతిరేకమైనా, స్వంత కుటుంబంలో ఒత్తిడి కారణంగా కుమారుడు అఖిలేష్ యాదవ్‌ని ముఖ్యమంత్రిగా చేశారు. రాజకీయంగా ఆయన ఎదగలేకపోవడానికి కుటుంబ రాజకీయాలే కారణం. దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం భార్య మరణించడంతో సాధన అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. కుటుంబ కలహాలు రచ్చకెక్కడం వల్ల ఆయన ఇమేజ్ దెబ్బతింది. ముఖ్యంగా, ఆయన రెండో భార్య సాధన జోక్యంవల్ల ఆయనకు రాజకీయంగా ఎన్నో చిక్కులు ఎదురయ్యాయి. ఆయనకు ముస్లింలలో మంచి ఆదరణ ఉంది. ముస్లింలు ఆయనను మౌలానా అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న అపప్రథ వచ్చినా ఆయన వెరవలేదు. మన ప్రధానమంత్రుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్ వారు కావడం వల్ల తాను కూడా ప్రధాన మంత్రి కావాలని ఆయన కలలు గన్నారు.
దేవెగౌడకు బదులు ఆయన పేరు ప్రతిపాదనకు వచ్చినప్పటికీ, ఆయన నేపథ్యం అంతా గ్రామీణ వాతావరణానికి చెందినది కావడం వల్ల సాధ్యం కాలేదు. ములాయం సింగ్ ఉర్దూ భాషను ఎక్కువ ప్రోత్సహించారు. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండేది. అబ్బాయి-బాబాయ్‌లు తరచు తగాదా పడుతుండేవారు. వారి మధ్య తగువును పరిష్క రించే బాధ్యత ములాయంపై ఉండేది. ఆ సమయం లోఆయన ఇరుకున పడేవారు. అలాగే, ఆయన రెండో భార్య సాధన కోడలు బీజేపీకి సన్నిహితంగా వ్యవహరించడం, ఆ పార్టీ టికెట్‌పై పోటీ చేయడాన్ని ములాయం సరిపెట్టుకోలేకపోయేవారు. కుటుంబంలో కలహాలు పెరగడం, వయసుపైబడటం వల్లఆయన రాజకీయాలకు దూరమయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో ములాయం, బీహార్ లో లాలూ ప్రసాద్‌లు ఇద్దరూ జాతీయ స్థాయిలో బీజేపీని ప్రతిఘటించడంలో ఎప్పుడూ ముందుండేవారు, కానీ, సీబీఐ కేసుల కారణంగా ములాయం బీజేపీ పాలకులతో కొంత మేర రాజీపడేవారన్న ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ లౌకిక వాదానికి ఎన్నడూ దూరం కాలేదు. అనారోగ్యం కారణంగానే ఆయన జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించలేకపోయారు.ఏమైనా ఆయనకు ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి అనుచర వర్గం ఉంది. రాజకీయాల్లో అనుకున్నది సాధించాలన్న పట్టుదల, దీక్ష ఉన్నప్పటికీ ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల విఫల మనోరథుడయ్యారు.