Friday, November 22, 2024

గాలిలో ప్రాణాలు… ఎందుకిలా

విమానయానం ఎంత సుఖ ప్రదమో,అంత రిస్క్‌తో కూడినది అని ఇటీవల సంఘటనలు రుజువు చేస్తున్నాయి..అయినా ఎప్పటికప్పుడు విమాన ప్రయాణీకుల సంఖ్య,ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒక చోట నుంచి మరొక చోటకు ఆగమేఘాలపై వెళ్ళాలంటు విమానమే అందుబాటులో ఉన్న సాధనం. మన దేశంలో విమానయాన శాఖలో విదేశీ ప్రత్యక్ష పెట్టు బడుల శాతాన్ని పెంచిన తర్వాత విదేశీ సంస్థలే కాకుండా, దేశంలోని సంస్థలు ఈ రంగంలో ప్రవేశించాయి. విమానయాన సంస్థల సంఖ్య పెరుగుతోంది. మన దేశంలో ఒకప్పుడు ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ మాత్రమే ఉండేది. పౌరవిమానయాన శాఖ దీనిని నిర్వహించేది.ఈ శాఖలో స్తబ్దత,అలక్ష్యం, జవాబుదారీ లేకపోవడం వంటి సమస్యల కారణంగా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తే పోటీ పెరిగి సర్వీసులు మరింత మెరుగు పడతాయని ప్రభుత్వం భావించింది. కానీ, ప్రైవేటు విమాన సంస్థల్లో కూడా అవే లక్షణాలు కనిపిస్తున్నాయి. 18 నెలల్లో ఎనిమిది విమాన ప్రమాదాలు సంభవించడమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా స్పైస్‌జెట్‌ విమానాలు తరచుగా సాంకేతిక లోపాల వల్ల అత్యవసర ల్యాండింగ్‌ అవుతున్నాయి. బుధవారం బ్యాంకాక్‌కి బయలుదేరిన ఈ సంస్థ విమానం సాంకేతిక లోపం వల్ల తిరిగి న్యూఢిల్లి కి చేరుకుంది. ఇంజన్‌లో సాంకేతిక లోపం వల్ల ఈ విమానం వెనక్కి తిరిగి వచ్చినట్టు,దీనిపై ఆ సంస్థను డిసిజిఏ వివరణ కోరినట్టు సమాచారం. అయితే,అన్ని ప్రమాదాలు కేవలంసిబ్బంది అలక్ష్యం వల్లనే జరిగాయని చెప్పలేం. రాడార్లపై విమానాలు కనిపించకపోవడం వంటి సాంకేతిక కారణాలు కూడా కారణం. తరచూ ఆకాశం మేఘావృతం కావడం,ఓ మాదిరి నుంచి అతిభారీ వర్షాలు పడుతుండటం కూడా కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ప్రైవేటు వైమానిక సంస్థల మధ్య పోటీ పెరిగింది. సర్వీసులను పెంచుకోవాలనే ఆకాంక్ష పెరిగింది. అయితే,అదే సందర్భంలో ప్రయాణీకులను వారి గమ్య స్థానాలకు సురక్షి తంగా చేర్చాలన్నబాధ్యత తమపై ఉందన్న విషయం ఆ సంస్థలు మరిచిపోతున్నట్టు ఉంది.

పౌరవిమాన సంస్థల్లోనే కాకుండా రక్షణ శాఖకు చెం దిన హెలికాప్టర్లు కూడాఈ మధ్య తరచుగా కూలి పోతున్నాయి.వీటిలో అత్యంత విషాదకరమైన సంఘ టన సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌,ఆయన సతీమణితో సహా 14 మంది తమిళనాడులో వెల్లింగ్టన్‌ సమీపంలో మరణించిన హెలికాప్టర్‌ ప్రమాద సంఘటన. సాదార ణం గా వివిఐపీలు ప్రయాణించే విమానాలు, హెలికాప్టర్ల విషయంలో ఎన్నోజాగ్రత్తలు తీసుకుంటూ ఉంటా రు. వెల్లింగ్టన్‌ ఆర్మీ స్థావరానికి వెళ్తున్న సమయంలో ఈ చాపర్‌ కోయంబత్తూరు మధ్య కుప్పకూలింది.ఈ చాపర్‌ని నడిపిన పైలట్‌ అత్యుత్తుమ పైలట్‌గా పేరొం దారు.అలాగే,చాపర్‌లో ఎటువంటి లోపం లేదని నిపు ణులు పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేశారు. విమాన ప్రమదాలు తరచూ జరుగుతున్నా, ప్రముఖులు మరణించిన ప్రమాదాల గురించే ఎక్కువ ప్రచారాన్ని పొందుతాయి.

అది సహజం. స్వాతంత్య్రం రావడానికి ముందే నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ తైవాన్‌ విమాన ప్రమాదంలో మరణించిన సంఘటన భారతీయులను ఇప్పటికీ కలవరపెట్టే సంఘటన.అసలు ఆయన విమాన ప్రమాదంలో మరణించలేదనీ, ఎక్కడో సజీవంగానే ఉన్నా రన్న కథనాలు ఏడున్నర దశాబ్దాలు దాటినా ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. నలభై ఏళ్ళ క్రితం ఇంది రాగాంధీ రెండవ కుమారుడు సంజయ్‌ గాంధీ తేలిక పాటి విమాన ప్రమాదంలో మరణించాడు. అలాగే, విమానయాన శాఖ మంత్రి మాధవరావు సింధియా 21 ఏళ్ళ క్రితం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు వెళ్తుండగా విమాన ప్రమాదానికి లోనయి కన్నుమూశారు. అలాగే, లోక్‌సభ స్పీకర్‌ బాలయోగి,ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిలు వేర్వేరు హెలికాప్టర్‌ ప్రమాదాల్లో మరణించారు.టాలీవుడ్‌ అగ్రశ్రేణి నటి సౌందర్య బెంగళూరు సమీపంలోని జక్కూరులో విమాన ప్రమాదంలో మరణించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అసలు విమాన ప్రమాదాలకు మూల కారణాలను కనుగొనడంలో విఫలమవుతున్నారన్న అభిప్రాయం సర్వత్రావినిపిస్తోంది. విమాన ప్రమాణం సంభవించినప్పుడు బ్లాక్‌ బాక్స్‌ దొరికితే అసలు కారణం తెలుస్తుందని అంటారు.బ్లాక్‌ బాక్స్‌ దొరికినప్పటికీ కారణాలను గోప్యంగా ఉంచుతున్నారు. దేశ భద్రతకు సంబంధించిన కారణాలను వెల్లడించడానికి వీలు లేదని ఒక్క ప్రకటనతో జనం నోళ్ళు మూయిస్తున్నారు. ఇందులో అసత్యం ఉండకపోవచ్చు. విమాన ప్రయాణాలపై జనం విశ్వసనీయత దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వంమీద ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement