Friday, November 22, 2024

నాడు.. నేడు అవే అస్త్రాలు

దర్యాప్తు సంస్థలు గత కొద్దికాలంగా వివాదాస్పదమై నంతగా చరిత్రలో ఎన్నడూ కాలేదు. దేశంలో దర్యాప్తు సంస్థలన్నింటినీ గుప్పిట పట్టి రాజకీయ ప్రత్యర్ధులను శంకరగిరి మన్యాలు పట్టించిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా ఇంత అతిగా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్ప లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను పూర్తిగా కొట్టివేయలేం. పౌర హక్కుల ఉల్లంఘన, ప్రతిపక్షాల ఆందోళనల అణచివేత మొదలైన అంశాల ప్రస్తావనకు వచ్చినప్పుడు అలనాటి ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులను ప్రతిపక్షాలు గుర్తు చేస్తుంటాయి. అది సహజమే. కానీ, అప్పుడు కూడా మీసా, పీడీ చట్టాల పేరుతో ప్రతి పక్షాలను అరెస్టు చేసి కొద్ది కాలం పాటు జైళ్లల్లో ఉంచే వారే తప్ప, సీబీఐ, ఈడీ సంస్థలను ఉసిగొల్పలేదని ప్రతి పక్షాలు ఆక్రోసిస్తున్నాయి. అయితే, యూపీఏ హయాంలో ఆనాటి పాలకులు ఇంత కన్నా దారుణంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రత్యర్ధులను వేధించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని బీజేపీ నాయకులు అంటున్నారు. వారు చేశారు ఇప్పుడు బదులు తీర్చుకుంటున్నామనడం రాజకీయ వాదనకు పనికొస్తుందే తప్ప, నైతికంగా ఒప్పదు. కాంగ్రెస్‌ నాటి అణచివేతలను అరికడతామన్న వాగ్దానంతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీ కూడాఅలాగే చేస్తే ఆ పార్టీ విలక్షణత ఏముంటుంది?. గవర్నర్ల నియామకం దగ్గర నుంచి ప్రత్యర్ధులపై కేసుల బనాయింపు వరకూ అన్ని విషయాల్లోనూ కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ విధానాలనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అనుసరిస్తోందన్న వాదన జనవాహినిలో ప్రబలుతోంది. యూపీఏలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉండేవి. వాటి ఒత్తిడికి లోనై ఆనాటి ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్ధులపై కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నించిన మాట నిజమే.

ప్రస్తుత హోం మంత్రి అమిత్‌ షాని గుజరాత్‌లో బూటకపు ఎన్‌ కౌంటర్ల కేసుల విచారణ సమయంలో జైలులో పెట్టిన సంగతి నిజమే. యూపీఏ హయాంలో స్పెక్ట్రమ్‌, బొగ్గుగనుల కుంభ కోణాల్లో సీబీఐ దర్యాప్తు చేసింది. ఆ సందర్భంగా కూడా మధుకోడా వంటి యూపీఏకి సన్నిహితులైన వారు జైలుకి వెళ్ళారు. ప్రధానంగా యూపీఏ ప్రధాన భాగస్వామ్య పక్షమైన డిఎంకె సీనియర్‌ నాయకుడు ఎ రాజా, పార్టీ ఎంపీ కనిమొళి జైలుకి వెళ్ళారు. వారిని జైలులో పెట్టినందుకు ఆనాటి డిఎంకె అధ్యక్షుడు కరుణానిధి ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను నిరంతరం వేదనకు గురి చేశారు. అప్పుడు బీజేపీ వారితోపాటు యూపీఏ భాగ స్వామ్య పార్టీల పైనా దర్యాప్తు జరిపించాల్సి వచ్చినప్పు డు సీబీఐ, ఈడీ సంస్థలను యూపీఏ నియోగించింది. బీజేపీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందనీ, కేవలం ప్రత్యర్ధులను వేధించేందుకే ఈ రెండు సంస్థలను ఉసి గొల్పుతోందన్న ఆరోపణలు అసత్యం కాదని బాలీవుడ్‌ బాద్షాగా పేరొందిన షారూఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టువిషయంలో రుజువైంది.అలాగే,ఇప్పుడు నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకీ, ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీకీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) అధికారులు సమన్లు పంపడం రాజకీయ కక్షగా కాంగ్రెస్‌ వారుభావిస్తున్నారు. అయితే, ఈ కేసులో వారినుంచి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి మాత్రమే పిలిచామని ఈడీ అధికారులు అంటున్నారు. మన దేశంలో ఏ చిన్న ఘర్షణ, లేదా అవినీతి ఘటన చోటు చేసుకున్నా సీబీఐ, ఈడీ అధికారు లచే దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్‌ ఈ మధ్య కాలంలో అందరి నోట వినిపిస్తోంది.

నేషనల్‌ హెరాల్డ్‌ నిధుల విషయంలో మనీ ల్యాండరింగికి పాల్పడకపోతే సోనియా కానీ, రాహుల్‌ కానీ విచారణకు హాజరై తమ వాదాన్ని వినిపించవచ్చు. సోనియా వయసు పై బడటం వల్ల, కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందువల్ల ఆమె హాజరుకాలేదు. రాహుల్‌ని పిలవడంలో అసహజం లేదు. ఆయనను ఈడీ ఆఫీసులో ప్రశ్నిస్తున్న సమయంలో ఢిల్లిలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా ఈడీ కార్యాలయాల వద్ద ధర్నాలకు, బైఠాయింపులకు కాంగ్రెస్‌ పిలుపు ఇవ్వడం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నది. రాహుల్‌ని అరెస్టు చేస్తారే మోనని ముందస్తు ఆందోళనకు కాంగ్రెస్‌ పూనుకు న్నదేమోననిపిస్తోంది. నిజానికి ఇవన్నీ రాజకీయ పరమై న ఆందోళనలే, వీటి ద్వారా ప్రయోజనం పొందేందుకు ప్రధాన రాజకీయ పార్టీలే కాకుండా, ప్రాంతీయ పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయి. మొత్తం మీద ఈపరిణామాలు, ఈవాతావరణమే సహజంగాను, సమంజసంగానూ అనిపించడం లేదు. అలాగే, రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓట్లను చీల్చేందుకు సీబీఐ, ఈడీలను వినియోగించుకోవాలని బీజేపీ చూస్తోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, బెంగాల్‌ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement