ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు కేంద్ర, రాష్ట్ర సంబంధాల అంశాన్ని తెరమీదికి తెచ్చాయి. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు చాలా సున్నితమైనవి. గీత తప్ప కుండా ఎవరి హద్దుల్లో వారు పని చేసుకుంటూ పోతే ఎటువంటి వివాదాలు ఉండవు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇరవై ఏళ్ళ పాటు అలాగే ఉండేది. కేంద్రంలో, రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలు అధికారంలోకి వస్తుండటంతో వివాదాలు మొదలయ్యాయి. నిజానికి ఇవి రాజకీయ వివాదాలే. కేంద్రం ఏది చెబితే అది చేయడం తమ ధర్మంగా గతంలో రాష్ట్రాలు భావించేవి. నిధుల కేటాయింపు విషయంలో కూడా సరిపెట్టుకునేవి. కేంద్రం అన్నీ చూసుకుంటుందన్న ధీమాతో ఉండేవి. కనుక నిధుల కేటాయింపులో కొద్దిగా తేడా చూపించినా, రాష్ట్రాలు పట్టించు కునేవి కావు. పైగా కేంద్రం పట్ల ఎంతో విధేయతను ప్రదర్శించేవి. అరవైవ దశకం ద్వితీయార్థంలో రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడిన నాటి నుంచి తమ హక్కుల కోసం రాష్ట్రాలు గొంతెత్తుతున్నాయి. కేంద్రం పరిధిలో వంద అంశాలు, రాష్ట్రాల పరిధిలో 66 అంశాలు, ఉమ్మడి పద్దులో 56 అంశాలు ఉన్నాయి. కేంద్రానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో గతంలో 32 శాతాన్ని రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేసేది. ఇప్పుడు 42 శాతాన్ని పంపిణీ చేస్తోంది.
అయితే, ఈ కొత్త విధానం వల్ల రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని రాష్ట్రాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ప్రతిపాదిత పథకాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తోందని రాష్ట్రాలు ఆరోపించేవి. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఇదే మాదిరి ఆరోపణలు చేసేది. కేంద్రంలో ప్రణాళికా సంఘం ఈ నిధుల పంపిణీ వ్యవహారాన్ని పర్యవేక్షించేది. అంతేకాకుండా రాష్ట్రాలు చేస్తున్న ఖర్చులపై కన్నేసి ఉంచేది. దీనివల్ల రాష్ట్రాలు అప్పులు పాలు కాకుండా చూసేందుకు వీలుండేది. ఇప్పుడు కేంద్ర ప్రణాళికా సంఘం స్థానే ఏర్పడిన నీతిఆయోగ్ కూడా రాష్ట్రాల వ్యయాలపై పర్యవేక్షిస్తున్నప్పటికీ కేంద్రం ఆదేశాల మేరకు పనిచేస్తోందన్న భావన ప్రజలకు కలుగుతోంది. కేంద్ర ప్రతిపాదిత పథకాలకు రాష్ట్రాలకు ఇచ్చే నిధుల విషయంలో కేంద్రం ఇప్పుడు కోత కోస్తోందని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ మిత్ర పక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఎన్‌డీఏ మొదటివిడత పాలనలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆనాటి ఉపప్రధాని అద్వానీ సమస్యను పరిష్కరించేవారు. ఇప్పుడు అలాంటి చొరవ తీసుకునే ద్వితీయశ్రేణి నాయ కత్వం లేదు. ప్రధాని నరేంద్రమోడీయే అన్ని విషయాలనూ స్వయంగా చూసుకుంటున్నారు. గతంలో నిధుల పంపిణీ విషయంలో మాత్రం వివాదాలు ఉండేవి. ఇప్పుడు ఇంకా పలు అంశాల విషయంలో కేంద్రం జోక్యం ఎక్కువైందనే విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యంగా రాష్ట్రాల పాలనావ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటోందని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగడం లేదని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పార్టీ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి తరచూ ఢిల్లి పర్యటనలు జరిపేవారు. ఇప్పుడు బీజేపీయేతర ముఖ్యమంత్రులు నిధుల కోసం ప్రధానినీ, ఆర్థిక, తదితర శాఖల మంత్రులను కలుసుకో వడానికి ఢిల్లి వెళ్తున్నారు. కేంద్ర నిధుల్లో వాటా తమ హక్కు అనీ, వాటి కోసం దేబిరించాల్సిన అవసరం లేదని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిధుల విషయంలో ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తున్న కేంద్రం, రాష్ట్రాలు పదే పదే మొత్తుకుంటే తప్ప నిధులను విడుదల చేయడం లేదని బీజేపీయేతర ముఖ్యమంత్రులు ఆరోపిస్తున్నారు. బీజేపీయేతర ముఖ్యమంత్రులు గళమెత్తకుండా అణగిఉండటానికి దశాబ్దాల కాలం నాటి కేసులను దుమ్ము దులుపుతోందని కేంద్రంపై బీజేపీయేతర ముఖ్య మంత్రులు ఆరోపిస్తున్నారు. రాజ్యాంగంలోని 282 అధిక రణం కింద ప్రజల కోసం ఖర్చు చేసే అధికారం, ఆర్థిక సహాయ సంస్థల నుంచి నిధులను తెచ్చుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. రాష్ట్రాలు పరిధిని మించి అప్పులు చేస్తున్నాయని కేంద్రం అంటోంది.
బీజేపీ పాలిత రాష్ట్రాలకూ, రాజకీయంగా తమకు అనుకూలంగా ఉన్న పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల కూ రుణాల సేకరణ విషయంలో లేని ఇబ్బందులన్నిం టినీ తమకు వర్తింపజేస్తోందని బీజేపీయేతర రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. రాయల్టి విషయంలో కూడా కేంద్రం ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని ఆరోపిస్తున్నాయి. ప్రశ్నించే సీఎంలపై కేసులు బనాయించి అభద్రతా భావాన్ని సృష్టిస్తోందని బీజేపీయేతర ముఖ్యమంత్రులు ఆరోపిస్తున్నారు.