అగ్రరాజ్యం ఏ నిర్ణయం తీసుకున్నా, దాని ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపైనా ఉంటుంది. ఆర్థికరంగానికి సంబంధించిన నిర్ణయాలైతే తక్షణ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాటి కరెన్సీపై తప్పనిసరిగా ఉంటుంది. అమెరికాలో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడానికి ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచక తప్పలేదని ఆ బ్యాంకు చైర్మన్ జరోమ్ పావెల్ ప్రకటించడంతో మన రూపాయి విలువ పతనం ప్రారంభమైంది. అయితే, ఫెడ్ వడ్డీ రేట్లను ఎప్పుడో 2008లో పెంచామనీ, ప్రస్తుతం నెలకొన్న ద్రవ్యోల్బణం దృష్ట్యా పెంచక తప్పలేదని పావెల్ ఇచ్చిన వివరణ అమెరికా వైఖరిని సమర్థించుకోవడమే తప్ప వేరు కాదు. అమెరికాలో ద్రవ్యోల్బణం 1970వ దశకంలోనూ,1980 దశకంలోనూ గరిష్ట స్థాయికి చేరింది. మళ్ళీ అటువంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకే ఫెడరల్ బ్యాంకు వడ్డీరేట్లను పెంచాల్సి వచ్చిందని ఆ బ్యాంకు చైర్మన్ ఇచ్చి న వివరణ కేవలం సహేతుకంగానే ఉంది. అసలు ఆర్థిక మాంద్యం ఎందుకు పెరుగుతోంది? ఈ ప్రశ్నకు సమా ధానం చెప్పవల్సింది అమెరికా, ఒకనాటి రాజ్యమైన రష్యా, అగ్రరాజ్య స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న చైనా.
ఈ మూడు దేశాలు తమ స్వీయ రాజకీయ ప్రయో జనాల కోసం ప్రపంచ దేశాల, ముఖ్యంగా వర్ధమాన దేశాల ఆర్థిక పరిస్థితులతో చెలగాటమాడుతున్నాయి. అమెరికాలో ఆర్థిక సంక్షోభం ముంచుకు వస్తోంది. పేద దేశాల కడుపు కొట్టి తన సంపదను వృద్ధి చేసుకోవడానికి అలవాటుపడిన అమెరికాను ఇప్పుడు చైనా, రష్యాలు అనుసరిస్తున్నాయి. అమెరికాలో అంచనా కంటే ఆగస్టు నెలలో వినియోగదారుల ధరల సూచి 20 శాతం పెరిగిం దని మరో కారణం చెబుతున్నారు. వినియోగ వస్తువుల ధరలు పెరగడానికి అమెరికాలో సామాన్యులకు అందు బాటులో లేకుండా తయారీ దారులు, నిత్యావసరాల దిగుమతి దారులు ధరలు పెంచేయడమే కారణం. అన్నింటికీ అసలు కారణం ఆయుధాల సరఫరా. ఉక్రెయి న్‌లో, సిరియాలో తిరుగుబాటుదారులకు ఆయుధాలను సరఫరా చేస్తున్నది అమెరికాయేనన్న సంగతి బహిరంగ రహస్యం. అమెరికాలో ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్ల ప్రభావం వల్ల మన దేశం నుంచి విదేశాలకు చదువు కోసం వెళ్ళే విద్యార్థుల వ్యయం భారీగా పెరుగుతుంది. అంతేకాకుండా ఫారిన్ ఫోర్టిఫోలియో ఇన్వెస్టర్లు మన ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవ డం ప్రారంభించారు. దీనివల్ల డాలర్‌తో పోలిస్తే మన రూపాయి విలువ దారుణంగా పడిపోయింది.
గడచిన 3 నెలల్లో ఏకంగా మూడు రూపాయల మేర డాలర్ విలు వ పెరిగింది. మరోసారి ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే రూపా యి విలువ ఎంత పతనం అవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడవచ్చునని మార్కెట్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. జీవిత కాల కనిష్ఠానికి మారకం విలువ పడిపోయింది. అమెరికా వడ్డీ రేట్లు పెరగడ, ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు, చమురు ధరలు స్తబ్దుగా ఉండటంతో రూపాయిపై ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఫారెక్స్ ట్రేడర్స్ పేర్కొంటున్నారు. చమురు ధరను రూబుల్స్‌లో చెల్లించాలని రష్యా పట్టుపడుతున్నది. ఇది కూడా మన రూపాయిపై ప్రభావం చూపుతుంది. అమెరికాలో డాలర్ రేటు పెరిగితే మన దేశంలో పెట్టుబడులు పెట్టిన విదేశీ పోర్టు పోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసం హరించుకుంటారు. తమ దేశంలోనే ఎక్కువ వడ్డీ వస్తోంది కనుక అక్కడ పెట్టుబడులు పెడతారు. దీనివల్ల భారత్ వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వలు తగ్గిపోతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకునేవారు, అక్కడ స్థిరపడిన వారు అక్కడి వాణిజ్య సంస్థలలోనే పెట్టుబడులు పెడ తారు. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అమెరికన్ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ ప్రభావం మన దేశంలో అన్ని రంగాలపైనా పడవచ్చు. ముడిసరకును దిగుమతి చేసు కునే పరిశ్రమలకు ఈ నిర్ణయం అశనిపాతం వంటిదని ఆ పరిశ్రమకు చెందిన వర్గాలు చెబుతున్నాయి. అలాగే, ప్రజల్లో విశ్వాసాన్ని ఈ చర్య దెబ్బతీస్తుంది.
డబ్బు పెట్టు బడి పెట్టి చేతులు కాల్చుకునే కన్నా, మానేస్తేనే మంచిద న్న భావన కలుగుతుంది. నిజానికి ఇప్పటికే పెట్టుబడులు పెట్టే వారు అనేకరకాల ఆంక్షల కారణంగా వెనక్కి వెళ్ళి పోతున్నారు. రూపాయి విలువ పతనమైతే డాలర్ కోసం ఎక్కువ రూపాయిలు చెల్లించాల్సి వస్తుంది. దీని వల్ల ప్రధానంగా తయారీ రంగంలో వారు ఎక్కువ నష్ట పోతారు. వారు ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. వారు తయారు చేసే వస్తువుల ధర బాగా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో తయారీరంగం కుదేలు అవుతుం ది. ఇప్పటికే చిన్న, లఘు పరిశ్రమలు అనేక ఇబ్బందుల ను ఎదుర్కొంటున్నాయి. వాటి సంగంతి ఇక చెప్పలేం. అమెరికా ద్రవ్యోల్బణం పెరుగుదల వంకతో ఫెడ్ రేట్లు పెంచింది. అమెరికన్ పెట్టుబడుదారుల ఒత్తిడి మేరకు దేశాధ్యక్షుడు బిడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.