Monday, November 18, 2024

ఓటరుగా ప్రధాని వెళితే..!

ఓటేయడానికి ప్రధానమంత్రి హంగూ ఆర్భాటంతో అట్టహాసంగా, అధికారదర్పంతో వెళ్లవచ్చా? ఇదీ తాజా సమస్య. కేంద్ర ఎన్నికల సంఘం పని తీరు ఈ మధ్య వివాదాస్పదం అయినంతగా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేదు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం ప్రధానాధికారి నియామకం విషయంలో కేంద్రం అనుసరించిన తీరును ఇటీవల తప్పు పట్టింది. దేశంలో ప్రధాన ప్రతిపక్షాలు ఎన్నికల సంఘంపై సమయం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌ ఎన్నికల రెండవ విడత పోలింగ్‌ సందర్భంగా సోమవారం నాడు ప్రధానమం త్రి నరేంద్రమోడీ అహ్మదాబాద్‌లో ఓటు హక్కు విని యోగించుకోవడానికి వెళ్తూ ప్రజలకు అభివాదం చేస్తూ, విజయ చిహ్నంగా రెండు వేళ్ళు ఊపడాన్ని పలువురు ఎత్తి చూపుతున్నారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడు ఓటును వినియోగించుకోవడానికి వెళ్ళేం దుకు అంతఆర్భాటంగా వెళ్ళాలా? అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇలాంటి దృశ్యాలు ఎన్నికల సంఘా నికి కనిపించవా అని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా చెప్పుకునే మన దేశంలో గడువు ప్రకారం ఎన్నికలను జరిపిస్తున్న మాట నిజమే.

అయితే, ఆ ఎన్నికలు పారదర్శకంగా జరగడం లేదన్న అపవాదును మన దేశం తొలగించుకోలేకపోతోంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎన్నికల సంఘా న్ని ప్రభుత్వ యంత్రాంగంలో భాగంగానే పరిగ ణిస్తున్నా యనీ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా టిఎన్‌ శేషన్‌ తప్ప మిగిలిన వారంతా కేంద్రానికి జీహుజూర్‌గానే పనిచేస్తున్నారన్న విమర్శలు తరచూ వస్తున్నాయి. నిజానికి శేషన్‌ మన ఎన్నికల వ్యవ స్థలో చాలా మార్పులు తెచ్చారు. అవన్నీ అమలు జరుగు తున్నాయని గ ట్టిగా చెప్పలేం. ఎన్నికల సంఘానికి అంత కుముందు ఒక అధికారి మాత్రమే ఉండేవారు. శేషన్‌ హయాంలో ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘం తొలి సారిగా ఏర్పడింది. ముగ్గురు సభ్యుల్లో ఒక్కరు కూడా స్వతంత్రంగా వ్యవహరించేవారు ఉండటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కనీసం ఒక్కరు కూడా డిసెంట్‌ (అసమ్మతి) చెప్పకపోవడాన్ని విమర్శకులు ఉదాహరణ గా చూపుతున్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా అస్మదీయులనే ఈ మూడు పదవులకు నియమి స్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.

అయితే, శేషన్‌ తీసుకుని వచ్చిన సంస్కరణల ప్రభావం వల్ల ఎన్నికల హింస చాలా వరకూ తగ్గింది. సమస్యాత్మక కేంద్రాలను ఎంపిక చేయడం, రెండు నుంచి ఆరు దశల వరకూ పోలింగ్‌ని నిర్వహించడం వంటి సంస్కరణలు అమలు జరుగుతున్నాయి. అయితే, నియమావళిని ఏ ఒక్క పార్టీ పాటిం చడం లేదన్న విమర్శలనూ ఇవన్నీ మామూలేనని వ్యంగ్యోక్తులు విసురుకోవడానికి జనం అలవాటు పడి పోయారు. గతంలో ఒకే రోజు పోలింగ్‌ జరగడం వల్ల కొట్లాటలు, బ్యాలెట్‌ పెట్టెలను ఎత్తుకెళ్ళి పోవడాలు, ఎన్నికల సిబ్బందిపై దౌర్జన్యానికి తలపడటాలు ఎక్కువ గా ఉండేవి. శేషన్‌ తీసుకుని వచ్చిన పోలింగ్‌ వికేంద్రీకర ణ సంస్కరణ పుణ్యమా అని అలాంటి సంఘటనలు చాలా వరకూ తగ్గాయి. పోలింగ్‌ విషయానికొస్తే గతం లో పోలింగ్‌ కేంద్రాల్లోకి నాయకులు ఎంత పెద్ద వారైనా అనుమతించేవారుకారు. కానీ, ఇప్పుడు సర్పంచ్‌ స్థాయి నాయకుడొచ్చినా ఎన్నికల అధికారులు, భద్రతా అధికా రులు అభ్యంతరం చెప్పడం లేదు. ఉన్నత పదవుల్లో ఉన్న వారు ఓటు వేయడానికి వచ్చినా వారి వెంట ఎక్కు వ మందిని రానిచ్చేవారుకారు. ఇప్పుడు అలాంటి నియమాలను ఎవరూ పాటించడం లేదు. భద్రత కోసం భద్రతా సిబ్బందిని అనుమతించడంలో తప్పేమీ లేదు.

- Advertisement -

కానీ, ప్రధాని, ముఖ్యమంత్రులతో పాటు అధికార పార్టీ అనుచరులు పోలింగ్‌ కేంద్రాల్లోకి చొచ్చుకుని రావడం, పోలీసులు అడ్డు చెబుతున్నా తోసుకుని వెళ్ళిపోవడం అన్ని చోట్లా కనిపిస్తోంది. ప్రధానమంత్రి మాత్రమే కాదు. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకుంటు న్నప్పుడు ఇలాంటి దృశ్యాలే కనిపిస్తూ ఉంటాయి. అయితే, ప్రోటోకాల్‌ ప్రకారం వారికి భద్రత కల్పించడం భద్రతాదళాల బాధ్యత అని సరిపెట్టు కోవడం మామూ లు అయింది. అందరూ కాకపోయినా కొందరు మంత్రు లు, ముఖ్యమంత్రులు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్తూ విజ య సంకేతాలను చూపడం కూడా మామూలు అయిం ది. ఇలాంటివి ఎన్నికల సంఘం అధికారులు పట్టించుకో వడం లేదు. పట్టించుకున్నా, అంత పెద్ద హోదాలో ఉన్న నాయకులకు అలా చేయకూడదని ఎలా చెప్పగలమని తమలో తాము తర్కించుకుని ఊరుకోవడం జరుగు తోంది. ఎన్నికల ప్రచార సభల్లో నాయకులు ప్రదర్శిస్తు న్న విన్యాసాల సంగతి సరేసరి. ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌ పోల్స్‌ని ప్రభుత్వం నిషేధించినా ఆ నియమాన్ని కూడా ఎవరూ పాటించడం లేదు. మొత్తం మీద ఎన్నికల నిర్వహణ అనేది ఒక తతంగంగానే మిగిలిపోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement