కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని కేంద్ర ఆర్థిక శాఖ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ప్రశ్నిస్తున్న సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ అధికారులు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి సమన్లు పంపడం దగ్గరనుంచి సర్వత్రా ఆసక్తి మొదలైంది. మామూలుగా ఇలా సమన్లు ఇవ్వడం రొటీన్‌గా జరిగే పనే. అయితే, వీరిద్దరి ప్రాధాన్యం దృష్ట్యా ఇదొక జాతీయ రాజకీయాంశంగా మారింది. ఒక వంక ఢిల్లిలోని ఈడీ ఆఫీసులో రాహుల్‌ని ప్రశ్నిస్తుంటే, మరో వైపుఅదే సమయంలో దేశ వ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులు నిర్వహిస్తున్న ధర్నా, బైఠాయింపు సన్నివేశాలు కలగలసి కొత్త రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. నిజానికి ఆమెకూ ఈడీ నోటీసులిచ్చింది, తేదీ ఖరారైంది. తీరా కరోనా రావడంతో కుదర్లేదు. ఆమె కరోనా చికిత్స కోసం ఢిల్లిలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. రాహుల్ గాంధీ సోమ, మంగళ, బుధవారాలు విచారణకు హాజరు కావల్సి వచ్చింది. వరుసగా మూడు రోజుల పాటు రోజుకు సగటున పదిగంటల పాటు ప్రశ్నోత్తర కార్యక్రమం సాగింది. ఇదంతా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్‌పై రాజకీయ కక్ష సాధింపుతో జరిపిస్తున్న తతంగంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఉన్న తమ యంత్రాంగం ద్వారా ఢిల్లి నుంచి గల్లి దాకా నిర్వహించిన ప్రచారం కారణంగా ఇదో పెద్ద రాజకీయ సమస్య అయికూర్చుంది.
దీని గురించి తెలుసుకోవాలంటే నేషనల్ హెరాల్డ్ పూర్వాపరాలను తెలుసుకోవడం అత్యవసరం. స్వాతంత్య్రోద్యమంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఉద్యమ వార్తల ప్రచారం కోసం వల్లభాయ్ పటేల్, ఒకరిద్దరు అతిరథులతో కలిసి 1938 లో ఈ పత్రికను స్థాపించారు.. దీంతో పాటు ఖ్వామీ ఆజాద్‌అనే ఉర్దూ పత్రికనూ, నవజీవన్ అనే హిందీ పత్రికను కూడా అప్పట్లో నడిపారు. ఈ పత్రికలు స్వాతం త్య్రానంతరం కూడా నడిచాయి. తర్వాత నష్టాలు రావడంతో ఉర్దూ, హిందీ పత్రికలను మూసివేశారు. ఆంగ్ల పత్రిక అయిన నేషనల్ హెరాల్డ్ కూడామూతబడే పరిస్థితిలో 2008లో యంగ్ ఇండియా అనే సంస్థ ద్వారా సోనియాగాంధీ కొనుగోలు చేశారు. అప్పటికి ఈ సంస్థకు 50 కోట్ల రూపాయిల అప్పు ఉంది. కేవలం 50 లక్షల రూపాయిలకే ఇంతపెద్ద సంస్థను యంగ్ ఇండియా తరఫున కొనుగోలు చేసి ఆ పత్రికకు చెందిన వేల కోట్ల రూపాయిల ఆస్తులను గాంధీ కుటుంబం సొంతం చేసుకున్నదంటూ న్యాయవాది, ఒకప్పటి జనతాపార్టీ నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లి కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. యంగ్ ఇండియాలో సోనియా, రాహుల్‌లకు చెరి 38 శాతం వాటాలు ఉన్నాయి. యంగ్ ఇండియా డైరక్టర్లుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ కూడా ఉండేవారు.
వారిద్దరూ రెండేళ్ళ వ్యవధిలో కన్నుమూశారు. అందువల్ల ఈ కేసులో నిందితులుగా సోనియా, రాహుల్‌లనే చేర్చి ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నిజానికి ఈ కేసు విచారణకు ఇంత హడావుడి చేయనవసరం లేదు. ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే తాత్సారం చేయిస్తోందన్న ఆరోపణలకు బలం చేకూరేలా ఈడీ అధికారులు దీని విచారణను సాగలాగుతున్నారు. రాహుల్‌ను మూడు రోజులుగా గంటల తరబడి ఊపిరి సలపని రీతిలో ఉక్కిరిబిక్కిరి చేసే విధంగా ప్రశ్నిస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయసాగారు. దాంతో ఈడీ ఆత్మరక్షణలో పడింది. వివరణ ఇచ్చుకోవల్సి వచ్చింది. రాహుల్‌ని నిదానంగా ప్రశ్నిస్తున్నామనీ, లంచ్ విరామానికి ఆయన కోరినంత సమయాన్ని ఇస్తున్నామనీ, రాహుల్ ఇచ్చిన సమాధానాలను విశ్లేషణ చేసుకుంటున్నామని ఈడీ అధికారులు వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకూ మొత్తం ఆరున్నర గంటలే రాహుల్‌ని విచారణ జరిపామని కూడా చెప్పుకున్నారు. ఈ కేసు విచారణను అడ్డం పెట్టుకుని దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు తమ పార్టీకి మరింత ప్రచారం కోసం ప్రయత్నిస్తున్నారు.
ఈ విషయంలో ఇటు ఈడీ అధికారులు, అటుకాంగ్రెస్ శ్రేణులు అతి చేస్తున్నారు. దీనికి వార్తాప్రసార సాధనాల్లో లభిస్తున్న ప్రచారంతో సోనియా ఆరోగ్యం బాగా లేకపోయినా బీజేపీ ప్రభుత్వం ఆమెనూ, ఆమె కుమారుణ్ణి వేధిస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకునేట్టు కాంగ్రెస్ శ్రేణులు వీధుల్లో ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. దీని వల్ల ప్రజలకు ఒరిగేదేమిటో.. కాంగ్రెస్ వారు కానీ, ఈడీ అధికారులు కానీ చెప్పాలి. ఊరూ, పేరూలేని కంపెనీలకైతే గుట్టు చప్పుడు కాకుండా లావాదేవీలు జరిగిపోతూ ఉంటాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా అలాగే జరిగి ఉంటుంది. అయితే, ఈ కేసులో పెద్దల ప్రమేయం ఉన్నందున ప్రత్యర్ధి వర్గాలు రాజకీయ ప్రయోజనం కోసం దీనిని వినియోగించుకోవడం, వారికి ప్రతిగా కాంగ్రెస్ తన యంత్రాంగాన్ని రంగంలోకిదింపడంతో ఈ ఘటన మీద విపరీతమైన ప్రచారం జరుగుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.