దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేయాలన్న లక్ష్యంతో 23ఏళ్ళ క్రితం ఏర్పడిన జి-20 కూటమి తన లక్ష్యాలను వీడి చాలా కాలమైంది. ఈ కూటమి లక్ష్యాలు అనేకం. సాధించింది బహు స్వల్పం. అంతర్జాతీయంగా ఏర్పడే కూటములు ప్రపంచంలో బలమైన లేదా సంపన్న దేశాల అడుగులకు మడుగులొత్తడం తప్ప బడుగు దేశాలకు ఏమాత్రం సహకారం అందించవన్న వాస్తవం ఇంతకుముందే రుజువైంది. ఇంతకాలానికి ఆ కూటమికి అధ్యక్షునిగా భారత ప్రధాని ఎంపిక కావడంతో అభివృద్ధి చెందుతున్న, వర్థమాన దేశాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈ సంస్థను నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం ముందుకు నడిపిస్తానంటూ జి-20 కూటమి అధ్యక్ష బాధ్యతను చేపట్టిన వెంటనే ప్రకటించడం శుభ సూచకం. జి-20 కూటమి దేశాలు ప్రపంచ స్థూల ఉత్పత్తిలో 80 శాతాన్నీ, వాణిజ్యంలో 75 శాతాన్ని కలిగి ఉన్నాయి. అంటే దాదాపుగా ప్రపంచంలో మూడు వంతు దేశాలకు ఈ కూటమి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ కూటమి తల్చుకుంటే బడుగు దేశాల్లో కరవుకాటకాలను ఆపవచ్చు. యుద్ధాలను నివారించవచ్చు.
అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా బలహీన, బడుగు వర్గాల కోసం ఈ సంస్థ చేసిందేమంటే చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఐక్య రాజ్యసమితి మాదిరిగానే ఇలాంటి కూటములు కూడా అగ్ర, సంపన్న రాజ్యాల ఒత్తిడులకు లోనవుతున్నాయి. గత ఏడాది రోమ్‌లో జరిగిన జి-20 సదస్సు నాటికీ, ఇప్పటికీ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. అంటే అది గుణాత్మకమైనది కాదు. కరోనా వల్ల పేద దేశాలు మరిం త పేదగానూ, సంపన్న దేశాలు మరింత భాగ్యవంతం గానూ తయారయ్యాయి. కరోనా వ్యాక్సిన్ పంపిణీలో కూడా అగ్రదేశాలు బడుగు, బలహీన దేశాలకు అందించిన సాయం అంతంత మాత్రమే. భారత్‌కు ఇప్పుడంటే జి-20 కూటమి అధ్యక్ష పదవి వచ్చింది కానీ, అప్పట్లో ఆ పదవి కూడా లేదు. అయినప్పటికీ ప్రపంచంలోని పేద, బడుగు దేశాల సహా, సంపన్న దేశాలకు వ్యాక్సిన్‌ని అందజేసింది. అంటే సంపద, వనరులు ఉన్నంత మాత్రాన సరిపోదు. ఎదుటి వారికి సాయపడే గుణం కూడా ఉండాలన్న పరమోద్దేశ్యాన్ని భారత్ చాటి చెప్పింది. కోవిడ్ కారణంగా ఉత్పాదకత విషయంలో మనదేశం సహా అన్ని దేశాల్లో క్షీణత బాగా కనిపిస్తోంది. ఆ వెను వెంటనే ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా చమురు, గ్యాస్ ధరలు అందనంత ఎత్తుకి పెరిగిపోయాయి.
ధర మాట అటుంచి అవి అందనంత ఎత్తుకుపోయాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి వల్ల ప్రపంచంలో అన్ని దేశాలూ దెబ్బతిన్నాయి. వీటిలో పేద దేశాలు బాగా చితికిపోయాయి. ఈ యుద్ధంలో ఇరువైపులనూ కాపుకాస్తున్న దేశా లు జి-20 కూటమిలో ఉన్నాయి. అయితే, అవి అక్కడ ఈ యుద్ధం గురించి ప్రస్తావన చేయడానికి వెనుకాడాయి. కొన్ని దేశాలు ఈ విషయమై ప్రయత్నించినా వాటి గళాలను అగ్ర, సంపన్న దేశాలు అణచివేసినట్టుగా కనిపిస్తోంది. ఇంధన వనరులు, సహజ వనరులు ప్రపంచంలో ఎక్కడ కనిపించినా వాటిని కొల్లగొట్టుకునిపోవాలన్న ఆకాంక్ష ఉందన్న అపవాదు ఒక్క అమెరికాపై మాత్రమే ఉండేది. ఇప్పుడు అన్ని దేశాలూ అదే దోవలో పయనిస్తున్నాయి. ముఖ్యంగా, అమెరికాతో పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్న చైనా ప్రదర్శిస్తున్న దూకుడు అన్ని దేశాలూ ఏదో ఒక రీతిలో ఇబ్బందులకు గురి అవుతున్నాయి. ఉక్రెయిన్‌పై దాడి విషయంలో రష్యా వెనుక చైనా ఉందన్న విషయం బహిరంగ రహస్యం. చైనా అనుసరిస్తున్న ఒంటెత్తు విధానాల వల్ల పొరుగు దేశాలే కాకుండా చాలా దేశాలు నష్టపోతున్నాయి. దీనికి తోడు ద్రవ్యోల్బణం కారణంగా అగ్రరాజ్యమైన అమెరికాయే గిజగిజలాడుతోంది. అమెరికాలో 2008 తర్వాత ఇంతటి మాంద్యాన్ని చూడలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫెడ్ రేటు ఇప్పటికే బాగా పెంచింది. దాని దారిలోనే మన రిజర్వు బ్యాంకు వంటి వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను బాగా పెంచినప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. జీ-20 సదస్సులో ద్రవ్యోల్బణం గురించి ప్రధానంగా చర్చించి ఉండే బాగుండేది. కానీ, మాంద్యం నుంచి గట్టెక్కడానికి జి-20 దేశాలు సమష్టి గా, సంయుక్త కార్యాచరణతో ముందుకు సాగాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సూచించింది. అయితే, అటువంటి ప్రయత్నమేమీ జరిగినట్టు కనిపించ లేదు.ఈ సదస్సు అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో హితబోధలే తప్ప కట్టుతప్పి చెలరేగి పోతు న్న దేశాలను హెచ్చరించే పదజాలం ఎక్కడా కనిపించ లేదు. రష్యా, ఉక్రెయిన్లు పరస్పరం క్షిపణి దాడులు చేసుకుంటుంటే, ఇతర దేశాల పరిస్థితి ఏమిటి? పోలండ్ పై జరిగిన క్షిపణ దాడికి తాము బాధ్యులం కాదంటూ రష్యా, ఉక్రెయిన్ ప్రకటించాయి. ప్రస్తుతం క్షిపణుల యుద్ధం జరుపుతున్నవి ఈ రెండే. ఈ తరుణంలో ఈ కూటమి అధ్యక్ష బాధ్యతను చేపట్టనున్న మన ప్రధానికి ఇది ఒక అవకాశం మాత్రమే.